
గన్నవరం: ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఒక పక్క ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, మరో పక్క ప్రధాని మోదీకి ఆగ్రహం రాకుండా చూసుకోవాలనే ద్వంద్వ వైఖరి సరికాదని హితవు పలికారు. ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వింత సంజీవరెడ్డి నివాసంలో కేంద్ర మాజీ మంత్రి పల్లాంరాజు, టీపీసీసీ నేత మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటివరకు ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మాణాల్లో ఎంత దోచుకోవాలి, ఎమ్మెల్యేల సీట్లు ఎలా పెంచుకోవాలనే ఆరాటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు బాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. హోదా కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే కొత్త ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, కిసాన్ సెల్ కన్వీనర్ కొమ్మినేని మల్లికార్జునరావు, పీసీసీ నాయకులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment