ఒంగోలు సబర్బన్: జిల్లా రైతన్న కంటతడి పెడుతున్నాడు. ఆకుపచ్చని చీరకట్టినట్టు పచ్చదనం పరుచుకోవాల్సిన పంట పొలాలు బోసిపోయి బీటలు వారి చినుకు కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక వైపు ప్రకృతి, మరో వైపు పాలకులు రైతన్న జీవితాలతో పరిహాసమాడుతున్నారు. గతేడాది సాగును సగానికి తగ్గించుకొని ఆత్మస్థైర్యం కోల్పోయిన కొంతమంది రైతులు ఆత్మహత్యల వైపు అడుగులేశారు. ఇంకొంత మంది వలసబాట పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. జూన్ 15 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతాంగం చినుకు కోసం ఆకాశం వైపు మోరెత్తుకొని చూస్తున్నారు. ఆకాశంలో మేఘాలు అలా కమ్ముకుంటున్నాయి.. రెప్పపాటులో తిరిగి మాయమవుతున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నప్పుడల్లా రైతాంగం ముఖాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతలోనే నిరాశమిగిలుతోంది. వెంటనే ఎండలు మంటలు రేపుతున్నాయి.
ఇది జిల్లాలోని రైతాంగం పరిస్థితి. చినుకు రాలుతుందో లేదోనన్న ఆందోళనలో రైతాంగం సతమతమవుతోంది. దానికి తోడు నకిలీ విత్తనాలు ఎక్కడ కొంపముంచుతాయోనన్న బెంగ రైతన్నను వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు లేకపోవడంతో పంటలు వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా వాటిని కొనుగోలు చేసి ఏం చేసుకోవాలని రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాగానే సాధారణంగా జూన్, జూలై మాసాల్లో పొలాలను సాగుకు సిద్ధం చేసుకునేందుకు ఉపక్రమిస్తారు. దుక్కులు దున్నటం, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం చేసుకోవటం, విత్తనాలు, ఎరువులు సేకరించటం, కొత్త రుణాలతో ఊపిరి సలపని పనుల్లో సతమతమవ్వాల్సిన రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.
నాలుగేళ్లుగా దుర్భిక్షమే
జిల్లాను నాలుగేళ్లుగా దుర్భిక్షం వెంటాడుతూనే ఉంది. ఏటా జిల్లా మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతూనే ఉంది. గతేడాదిలో జిల్లాలోని 56 మండలాల్లో చీరాల మండలం మినహా 55 మండలాలూ కరువు మండలాలే. తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతూ వచ్చాయి. భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. అటు సాగు, ఇటు తాగు నీటికి కొరత ఏర్పడింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి పోయాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కూడా వచ్చి జిల్లాలో పర్యటించి వెళ్లింది. జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కరువు బృందానికి ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిస్థితిని కళ్లకు గట్టారు. ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్లిన కరువు బృందం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి మరీ జిల్లా నుంచి వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రస్తుత ఖరీఫ్ సాధ్యం కాదన్న భయం రైతుల్లో ఏర్పడింది. అయినా గత బాధలు...కష్టాలు ఎలా ఉన్నా...ప్రతి సీజన్‌కు సమాయత్తం కావటం హలదారునికి కొత్తేమీ కాదు. ఖరీఫ్‌లో వరి పంట విస్తీర్ణం చాలా తక్కువ. మెట్ట పంటలు అధికంగా వేస్తారు. గతేడాది ఖరీఫ్ లక్ష్యంలో 50 శాతం కూడా విస్తీర్ణం సాగులోకి రాలేదు. వేసిన పంటలు కూడా వర్షాలు లేక దిగుబడి కూడా 30 శాతం కూడా రాలేదు. ఈ సంవత్సరం ఖరీఫ్ లక్ష్యం 2.28 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం. ఖరీఫ్‌లో ప్రధానంగా 70 వేల హెక్టార్లలో కందులు, 40 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. వాటితో పాటు వరి, జొన్న, సజ్జ, మినుము, పెసరతో పాటు పలురకాల మెట్ట పైరులు వేస్తారు. ఇప్పటికే భూసార పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 3.61 లక్షల మట్టి నమూనాల పరీక్షల ఫలితాల పత్రాలను రైతులకు అందించారు. మరో 3.61 లక్షల మట్టి నమూనా ఫలితాలు అందించాల్సి ఉంది. 75 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను అందించేందుకు 6,500 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. మూడు వేల క్వింటాళ్ల కంది, వేరుసెనగ, మినుము, పెసర విత్తనాలు కూడా సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment