సీమకు అన్యాయం చేయొద్దు | don't play with rayalaseema | Sakshi
Sakshi News home page

సీమకు అన్యాయం చేయొద్దు

Published Wed, Mar 25 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

don't play with rayalaseema

నంద్యాల: దేశంలోని అత్యంత కరువు ఎదుర్కొంటున్న రాయలసీమకు అన్యా యం చేయవద్దని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలోని వెనుకబాటు తనాన్ని తాగు, సాగునీటి సమస్యలను రాజకీయ సమస్యలుగా సృష్టించి కరువు సీమకు అన్యాయం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటిని తరలించుకొని పోవడం బాధాకరమన్నారు. ఎంత సేపు రాజకీయ లబ్ధి కోసం సీమను వాడుకుంటున్నారే తప్ప సీమకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చడంలో ప్రభత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదలపై ఉన్న విధానాలను రాయలసీమ హక్కులుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతి ఏడాదీ 500టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా రాయలసీమలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమల కాల్వలకు కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటి కేటాయింపులు మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్‌కు విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 872అడుగులకు పైన నీరు ఉన్నప్పుడే సాగర్‌కు నీటిని విడుదల చేయాలన్నారు. గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం ద్వారా ఆదా అయ్యే 45టీఎంసీల కృష్ణా జలాలను హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులకు కేటాయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు కేటాయించిన 60టీఎంసీల క్యారిఓవర్ నీటిని రాయలసీమ అవసరాలకు కేటాయించాలన్నారు. రాయలసీమ నీటి అవసరాల పరిష్కారం కోసం సీమ సాగునీటి కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా ఎస్సార్బీసీ ప్రధాన కాల్వను పూర్తి చేయాలని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర అసంపూర్తి నిర్మాణాలను, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, వెలుగొండ ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement