దాహం.. దాహం | Water Schemes Delayed in PSR Nellore | Sakshi
Sakshi News home page

దాహం.. దాహం

Published Sat, Apr 20 2019 11:57 AM | Last Updated on Sat, Apr 20 2019 11:57 AM

Water Schemes Delayed in PSR Nellore - Sakshi

పొదలకూరు: బిరదవోలు గ్రామంలో చేతిపంపు వద్ద్ద మహిళలు

మూడేళ్లుగా వెంటాడుతున్న తీవ్ర వర్షాభావం.. తాగునీటి ఎద్దడి నివారణకు కొరవడిన ముందు చూపు.. కొత్తగా ఒక్కబోర్‌ వెల్‌ మంజూరు చేయకపోవడం.. సీపీడబ్ల్యూ స్కీం (తాగునీటి పథకాలు)లకు సంబంధించి కాంట్రాక్టర్లకు సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పట్టణాలతో పాటు పల్లె సీమలు దాహంతో అల్లాడి పోతున్నాయి. బిందెడు తాగునీటి కోసం పనులు మానుకుని ఉండాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి ప్రజల సమస్యలను గాలికొదిలేసింది.

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఒనరుల జాడ కనిపించడంలేదు. ఎక్కువ శాతం బావులు అడుగంటి పోయాయి. చెరువులు ఎండిపోయాయి. ఇప్పటికే 41 నుంచి 42 డిగ్రీలతో ఎండలు మండుతున్నాయి. 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారే తప్ప ప్రజల తాగునీటి ఎద్దడికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు.  ఇది చాలదన్నట్టు  మూగజీవాలకు గుక్కెడు నీరు, కాస్త దాణా అందించలేక ప్రజలు తమ పశువులను కబేళాలకు అమ్ముకుంటున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.          మెట్ట ప్రాంతాల్లో మరీ దారుణం
ప్రధానంగా ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, రాపూరు, డక్కిలి, వెంకటగిరి , సైదాపురం, పొదలకూరు తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి మరీ తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో బావులు అడుగంటి పోయాయి. ఉదయగిరిలోని బసినేనిపల్లి, కిష్టంపాడు తదితర ప్రాంతాల్లో పొలాల్లోకి రెండు కిలో మీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావలి, జలదంకిమండలాల్లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. డీవీ సత్రం మండలంలో సముద్ర తీర ప్రాంతాల గ్రామాలైన మీజూరు, ఏరికాడు, కారికాడు తదితర ఏడు గ్రామాల్లో తాగునీటి కోసం తహ తహ లాడుతున్నారు.

మూలన పడుతున్న సీపీడబ్ల్యూ స్కీంలు
ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెండు నుంచి నాలుగు ఆవాసిత ప్రాంతాలకు కలిపి ప్రభుత్వం ఏర్పరచిన సమగ్రరక్షిత నీటిపథకాలు జిల్లాలో 35 ఉన్నాయి. వాటిలో ఒకదానిని మినీ పంపింగ్‌ స్కీంగా మార్చారు. మిగతా 34లో గూడూరు డివిజన్‌లోని తుమ్మూరు–విన్నమాల గ్రామం, కొండాపురంలో మరొక సీపీడబ్ల్యూ పథకాలు పూర్తిగా మూలన పడ్డాయి. మరమ్మతులకు కూడా పనికి రాకుండా పోయాయి. మిగతా 32 స్కీముల ద్వారా 134 హ్యాబిటేషన్స్‌లో రోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 30 గ్రామాల్లో రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద 320 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొని ఉండగా కేవలం 134 ప్రాంతాల్లోనే సరఫరా చేస్తూ మిగతా ప్రాంతాల సంగతి గాలికొదిలేశారు.        

పంచాయతీల డబ్బు ప్రభుత్వం కబ్జా ..
8 నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూపులు

గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14 వ ఆర్ధిక సంఘం నిధులను వినియోగిస్తున్నారు. తాగునీటి పథకాల నిర్వహణ కోసం పంచాయతీల దగ్గర సరిపడా ఆర్థిక సంఘం నిధులున్నాయి. వీటిని పంచాయతీ అధికారులు జిల్లా పరిషత్‌(జెడ్పీ)  కార్యాలయానికి చెల్లిస్తున్నారు. జెడ్పీ అధికారులు తాగునీటి పథకాల నిర్వహణ కోసం వసూలు చేసిన డబ్బును ట్రెజరీలో జమ చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల నిధులను ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం ఆ నిధులను కావాలనే ట్రెజరీలో జమ చేయాలనే నిబంధనలు తెచ్చిపెట్టింది. 26వ తేదీ డిశంబర్‌ 2018న సీపీడబ్ల్యూ స్కీం నిర్వహణ కాంట్రాక్టర్లకు నాలుగు నెలల బకాయిలు చెల్లించేందుకు జెడ్పీ అధికారులు  చెక్కులిచ్చారు. ఆ చెక్కులను జనవరి –2019లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే కంప్యూటర్‌ యాక్సెప్ట్‌ చేసేసింది. ఇలా యాక్సెప్ట్‌ చేసిన రెండు, మూడు రోజుల్లోనే కాంట్రాక్టర్ల ఖాతాలో నిధులు జమకావాల్సి ఉంది. అయితే నేటికీ జమకాలేదు. ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఆ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నా ఒక్క పైసా విడుదల కాలేదు. కారణాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థల సొమ్మును ప్రభుత్వం కబ్జా చేసేసింది. ఇతర పథకాలకు డైవర్ట్‌ చేసింది. దీంతో కాంట్రాక్టర్లకు ఇవ్వలేక పోతోంది. ఇప్పటికే  రూ.1.10 కోట్ల బకాయిలు జిల్లాలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఒక్కో కాంట్రాక్టర్‌కు 15 నుంచి రూ.20 లక్షల వరకు బకాయిలున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి నిర్వహణ చేపట్టాల్సి రావడంతో స్కీంల మరమ్మతులను గాలికొదిలేస్తున్నారు.

దాహం తీర్చే చర్యలు ఏవీ?
గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు అక్కడక్కడా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అరకొర చర్యలు చేపట్టారే తప్ప పూర్తి స్థాయిలో గొంతు తడిపే చర్యలు చేపట్టలేదు. జిల్లాలో కొత్తగా ఒక్క చేతిపంపును ఏర్పాటు చేయలేదు. పాత చేతిపంపుల్లో పూడిక తీసే చర్యలు చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో రక్షిత నీటి ట్యాంకర్లను మంజూరు చేసినా అవి ఏళ్ల తరబడి పూర్తవ్వడం లేదు.  ప్రభుత్వం నీటి కొరత తీర్చేందుకు అత్యవసరం కింద  విడుదల చేసిన నిధులు శూన్యం. అరకొర విడుదల చేసినా అవి గత ఏడాది టాంకర్ల ద్వారా సరఫరా చేసిన కాంట్రాక్టర్లకే చాల్లేదు.

కొన్ని ఉదాహరణలు
కోవూరు  సీపీడబ్ల్యూ స్కీంను నాసిరకంగా నిర్మించడంతో అది రెండు, మూడు రోజులకోసారి మరమ్మతులకు గురవుతోంది. ఇదే విషయాన్ని స్థానిక జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తి రచ్చ చేశాడు.
ఉదయగిరి పంచాయతీలో వారం రోజులుగా తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. మండల కేంద్రమైన వరికుంటపాడులో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు రావడంలేదు. సీతారామపురం మండలంలో పలు చోట్ల పొలాల్లోని బావులవద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అక్కడ కూడా నీరు అడుగంటి అందడం లేదు. జలదంకి మండలం గట్టుపల్లిలో ఇదే పరిస్థితి
డీవీ సత్రంలోని తొగరాముడి,  ఏరికాడు, కారికాడు, ద్వారకాపురం, మీజూరులో తాగునీటికి అష్ట కష్టాలు పడుతున్నారు. కోట, వాకాడులో ఇదే పరిస్థితి నెలకొంది.
ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె బీసీ కాలనీ(చివరి ప్రాంతం) వాసులకు నీరందడం లేదు.
దగదర్తి మండలం ఉప్పలపాడులో ఏడాది నుంచి తాగునీటి ట్యాంకర్‌ నిర్మాణం పూర్తి కాలేదు. ఇక్కడ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంటే దిక్కు.

తాగునీటి ఎద్దడి నివారణకుప్రత్యేక ప్రణాళిక
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక ముందస్తు  ప్రణాళికను సిద్ధం చేశాం. నిధుల కొరత లేదు. జనవరి వరకు ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేసిన వారందరికీ బిల్లులు ఇచ్చాం. ఇప్పటికే 134 ప్రాంతాల్లో తాగునీటిని టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా నీటి ట్యాంకర్లు అవసరమైతే ఎంపీడీఓ ద్వారా మండల కమిటీని కలిసి అర్జీ ఇస్తే చాలు. సమస్యను తీరుస్తాం. అలాగే పశువులకు నీటిని సరఫరా చేసేందుకు పశుసంవర్ధక శాఖ డాక్టర్‌ ద్వారా లెటర్‌ తెచ్చుకోవాలి.– నాగజ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఈ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement