కనిగిరి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌస్, నీటిని శుభ్రపరిచేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వవ్వేరు పైలెట్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారు. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడంతో మూణ్ణాళ్లకే పైపులైన్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2015 మార్చి 3న మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి ప్రజాప్రతినిధులు సమస్యను తీసుకెళ్లగా, వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ప్రజల దాహార్తి తీరలేదు.
మండలంలోని అన్ని పంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏడేళ్ల క్రితం రూ.3.75 కోట్లతో జొన్నవాడ వద్ద పెన్నానదిలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించి నివేదికలు పంపారు. ఆ తరువాత ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. వవ్వేరు వద్ద రూ.2.5 కోట్లతో ప్రాజెక్ట్‌ను నిర్మించి కనిగిరి రిజర్వాయర్ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. కనిగిరి రిజర్వాయర్ నీటిని శుద్ధిచేసి పైప్‌లైన్ ద్వారా ట్యాంకులకు అందించి సరఫరా చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం.
నాసిరకంగా పైప్‌లైన్ నిర్మాణం
పైలెట్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నాసిరకంగా చేశారు. ప్రాజెక్ట్ నుంచి వాటర్‌ట్యాంకులకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు నాసిరకమైనవి వేశారు.దీనికితోడు భూమిలో రెండు అడుగుల లోతులో మాత్రమే పైప్‌లను అమర్చారు. దీంతో పైపులైన్లు తరచూ పగిలిపోతూ పైలెట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది.
దాహం..దాహం
వేసవిలో మండల ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మేజర్ పంచాయతీతో పాటు నాగాయగుంట, మునులపూడి, కట్టుబడిపాళెం, పెనుబల్లి, కాళయకాగొల్లు, మినగల్లు, జొన్నవాడ, తదితర గ్రామాల్లో తాగునీరు అందడం కష్టంగా మారుతోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పరిష్కారం శూన్యం
2015 మార్చి 3న జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి పైలెట్ ప్రాజెక్టు సమస్యను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీసుకొచ్చారు. వేసవిలో దాహార్తిని తీర్చడమే లక్ష్యమని చెప్పే మీరు, నిరుపయోగంగా ఉన్న పైలెట్ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన పోలంరెడ్డి మాట్లాడుతూ వారంలోగా ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటికి అల్లాడుతున్నాం
పైలెట్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు ట్యాంకులకు అందడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయింట్‌నెన్స్ కింద లక్షలు విడుదలవుతున్నా ప్రజలకు మాత్రం తాగునీరు అందడం లేదు.
– ఈదూరు నరేంద్రబాబు, కట్టుబడిపాళెం
మాటలు తప్ప చేతలేవీ
నేతలు, అధికారులు మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా పైలెట్ ప్రాజెక్ట్ నీటిని అందిస్తామని చెబుతూ ఉన్నారు..వింటూనే ఉన్నాం. ప్రతి వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఫలితం లేదు.
– చంద్రగిరి రాజశేఖర్, నాగాయగుంట
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
పైలెట్ ప్రాజెక్టు పరిస్థితిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. పైప్‌లైన్‌లు మరమ్మతులకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
–డీవీ.నరసింహారావు, ఎంపీడీఓ
Comments
Please login to add a commentAdd a comment