దాహం.. దాసోహం! | CM Jagan Check For Drinking Water Problems In Srikakulam District | Sakshi
Sakshi News home page

దాహం.. దాసోహం!

Published Sun, Sep 1 2019 8:36 AM | Last Updated on Sun, Sep 1 2019 9:12 AM

CM Jagan Check For Drinking Water Problems In Srikakulam District - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ల పేరుతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయించి, డీపీఆర్‌లు సిద్ధం చేసి, బాహుబలి సెట్టింగ్‌ల మాదిరిగా డిజైన్‌లు చూపించి ప్రజల్ని ఊహల్లో ఊరేగించింది. పదవిలో ఉన్నంతవరకు వాటర్‌ గ్రిడ్‌ల ఊసు లేదు. ఆ ప్రతిపాదనలు గుర్తుకు రాలేదు. కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడి చేసింది. వాటర్‌ గ్రిడ్‌లను మళ్లీ తెరపైకి తెచ్చింది. పోనీ అదేనా పూర్తిగా చేయలేదు. రూ.3600 కోట్లతో తొలుత ప్రతిపాదించిన ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.1783 కోట్లతో కొత్త ప్రాజెక్టును రూపకల్పన చేసింది. దాన్ని రూ.1000 కోట్లకు కుదిస్తూ ఫిబ్రవరి 21న అనుమతి ఇచ్చింది. దాంట్లో రూ.510 కోట్లకు టెండర్లు పిలిచి, కాంట్రాక్ట్‌ ఖరారు చేసింది. ఇదంతా చూస్తే టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ప్రతీ ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం లేదని తేటతెల్లమైంది. ఆర్భాటంపై తప్ప ఆచరణలో శ్రద్ధ చూపించలేదు. మొత్తానికి ఐదేళ్లు చేసిన మోసాలను గుర్తు చేసుకున్న ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. మాటిస్తే నిలబెట్టుకుంటారనుకున్న వైఎస్సార్‌సీపీని గెలిపిం చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఇంకేముంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా దానికి మించి చేస్తూ శభాష్‌ అన్పించుకుంటున్నారు.

కిడ్నీ బాధితులున్న ఉద్దానంకు అధికారంలోకి వస్తే శుద్ధ జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు.  తాగునీరే అక్కడ సమస్యని నివేదికలు చెబుతుండటంతో ఉద్దానం సమస్యకు పరిష్కా రం శుద్ధ జలాలు సరఫరాయే మార్గమని భావించా రు. బాధ్యతలు స్వీకరించిన 90రోజుల్లో మాట నిలబెట్టుకున్నారు. ఉద్దానానికి రూ. 600కోట్లతో తాగునీటిని ప్రాజెక్టును ప్రాంభించారు. ఒక్క ఉద్దానమే కాదు జిల్లా అంతటికీ తాగునీటిని అందించాలని, ఇంటింటికి కుళాయి ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనకు వచ్చారు.  మనసులో తట్టడమే తరువా యి కార్యరూపంలో పెట్టారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని రూ.3672.50కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గ డీపీఆర్‌ను త్వరితగతిన తయారు చేయించడమే కాకుం డా గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారు. ఇంకేముంది చిక్కోలు తాగునీటి సమస్య తీరనుంది.

-నిబంధనల మేరకు ప్రతి వ్యక్తికి రోజుకు  అందించాల్సిన నీరు : 70 లీటర్లు 
-జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు 
-రోజుకు 40 లీటర్లు మేర అందించే గ్రామాలు : 1000
-10 లీటర్లలోపు అందించే గ్రామాలు : 400
-నీటి వనరులు లేని గ్రామాలు : 22  

గత ప్రభుత్వ ప్రణాళిక.. 
ప్రతీ వ్యక్తికి రోజుకి 70 లీటర్లు అందిస్తామని చెబు తూ రూ.1783 కోట్లతో 24 మండలాల్లోని 1861 గ్రామాలకు పరిమితం చేస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. దీన్ని రూ.1000 కోట్లకు పరిమితం చేసి పరిపాలన అనుమతి ఇచ్చారు. ఇందులో 510 కోట్లతో పనులకు ఎన్నికలకు రెండు నెలలు ముందు టెండర్లు పిలిచి, ఖరారు  చేశారు. ఈ ప్రణాళికలో నగరం, పట్టణాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్దానంలోని 7 మండలాలకు పూర్తిగా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు  మిగతా 17 మండలాల్లోని 11 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనివలన పలు గ్రామాలకు పాక్షికంగా తాగునీరు అందనుంది.

 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రణాళిక ..
జిల్లాలోని 38 మండలాలకు విస్తరించారు. ప్రతీ వ్యక్తి కి రోజుకి 100 లీటర్లు శుద్ధ జలాలు అందించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 1141 పంచాయతీల పరిధిలో ని 4207 ఆవాసాల్లో 5.66 లక్షల కుటుంబాలకు శుద్ధ  జలాలను అందించేందుకు నిర్ణయించారు. నగర, పట్టణ, మండల, గ్రామాలకు శుద్ధ జలాలు అందించాలని కార్యాచరణ రూపొందించారు. యుద్ధ ప్రాతి పదికన డీపీఆర్‌ తయారు చేయించారు. రూ. 3672.50 కోట్లతో రూపకల్పన చేసిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలో తొలి విడతలోనే ఈ  పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.


వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా చేపట్టనున్న చర్యలు.. 
జిల్లాలో హిరమండలం, పారాపురం, సింగిడి, ఆఫ్‌షోర్, మడ్డువలస జలాశయాలను తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయనున్నారు. తోటపల్లి జలాయశం ప్రాజెక్టు నీటిని కూడా వినియోగిస్తారు. వంశధార, నాగావళి ,మహేంద్రతనయ నదుల్లో అవసరమైన నీటి బావుల నిర్మాణాలు చేపడుతారు. తాగునీటి  వనరులు దూరంగా ఉన్న ప్రాంతాల్లో చెరువులను జలాశయాలుగా అభివృద్ధి చేయనున్నారు. నగరం, పట్టణం, గ్రామాల్లో అమలవుతున్న రక్షిత మంచినీటి పథకాను అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితమవడంతో భూ ఉపరిత జలాలనే తీసుకోనున్నారు. నేరుగా ఉపరితల జలాలు అందుబాటులోకి తేవడం( ఇన్‌ఫిల్టరేషన వెల్స్‌ నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోవడం)పై దృష్టి సారిస్తారు. దీనివల్ల సహజ సిద్ధంగా శుద్ధి అవుతుంది. అలాగే, కాలువల నుంచి నేరుగా నీటి ట్యాంకుల్లోకి మళ్లిస్తారు. శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేస్తారు.

తీరనున్న తాగునీటి కష్టాలు.. 
జిల్లాలో తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్దానానికే పరిమితం అనుకున్న ప్రాజెక్టును జిల్లా అంతటికీ విస్తరించారు. యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్‌ తయారు చేయించారు. రూ.3,672.50 కోట్లతో రూపొందించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఇంటింటి కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆమేరకు రాజధానిలో జరిగిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. 
– టి.శ్రీనివాసరావు, ఎస్‌ఈ,  గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం  

జిల్లాలో ఉన్న నీటి వనరులు
సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు     :      37
సింగిల్‌ రక్షిత మంచినీటి పథకాలు    :     1090
సౌరశక్తి పథకాలు     :                          177
కమ్యూనిటీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు     :           6
చేతి పంపులు     :                              15,624  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement