
ఇంకెన్నాళ్లు?
హిందూపురం పట్టణంలో తాగునీటి ఎద్దడి కష్టాలు తీరేలా లేవు. పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తున్న శ్రీరామరెడ్డి పథకానికి సంబంధించిన పైపులు మరమ్మతులకు గురి కావడంతో రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ అయింది.
- రెండురోజులుగా నీటిసరఫరా నిల్
- మరమ్మతుల్లో ‘శ్రీరామరెడ్డి’ పైప్‌లైన్
- ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు
హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణంలో తాగునీటి ఎద్దడి కష్టాలు తీరేలా లేవు. పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తున్న శ్రీరామరెడ్డి పథకానికి సంబంధించిన పైపులు మరమ్మతులకు గురి కావడంతో రెండు రోజులుగా నీటి సరఫరా బంద్ అయింది. ఇంకా రెండు, మూడురోజులు నీటి సరఫరాలో అంతరాయం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టణంలోని అన్ని వార్డులకు ట్యాంకర్లతోనే నీటిని అందించాల్సి వస్తోంది. ప్రతిరోజు సుమారు 12 ఎంఎల్‌డీ పట్టణానికి అవసరం ఉండగా కలెక్టర్ సూచనలతో శ్రీరామరెడ్డి పథకం ద్వారా 5 ఎంఎల్‌డీ నీరు వస్తోంది. ట్యాంకర్ల ద్వారా 3 ఎంఎల్‌డీ వరకు సరఫరా అవుతోంది. వీటితోనే అతికష్టంగా సాగుతుండగా నాలుగు రోజులు నీటిసరఫరా బంద్ అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పట్టణ శివారు వార్డుల్లోని ఆటోనగర్, త్యాగరాజనగర్, ధన్‌రోడ్డు, సుగూరు, రహమత్‌పురం, హమాలీ కాలనీ, అంబేడ్కర్, ముద్దిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రతరమైంది.
అదనపు ట్రిప్పులు పంపిస్తున్నాం : రమేష్, మున్సిపల్ ఇంజినీర్
శ్రీరామరెడ్డి పథకం ద్వారా నీటి సరఫరా బంద్ అయినప్పటి నుంచి అన్ని వార్డులకు ట్యాంకర్ల ద్వారా అదనపు ట్రిప్పులతో అందిస్తున్నాం. ఏ వార్డులో నీటి ఇబ్బంది ఉందని తెలిపితే వెంటనే ట్యాంకర్లు పంపించే ఏర్పాట్లు చేశాం. రెండు రోజుల్లో పైప్‌లైన్ మరమ్మతులు పూర్తయి నీటిసరఫరా పునరుద్ధరణ అవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలియజేశారు.