మనకు ఇంకో 40 శాతం నీరు కావాలి
న్యూయార్క్: నీరు లేకుండా ప్రాణికి భూమి మీద మనుగడే లేదు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నీటి వనరులు అందుబాటులో ఉండడం, లేకపోవడం మధ్య ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైన ప్రపంచ నీటి వారోత్సవాల సందర్భంగా శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతలు, సామాజిక సంస్థలు నీటికి సంబంధించిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించాయి. వాటిలో కొన్ని ప్రధానమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1. భూగోళంపై అందుబాటులోవున్న నీటి వనరుల్లో కేవలం 0.5 శాతం నీరు మాత్రమే మానవ వినియోగానికి పనికొస్తోంది.
2. 2030 సంవత్సరానికి మానవ వినియోగానికి మరో 40 శాతం నీరు అవసరమని మ్యాక్ కిన్సే అండ్ కంపెనీ అంచనా వేసింది.
3. ప్రపంచంలో 65 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ సురక్షిత నీరు అందుబాటులో లేదు.
4. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం వల్ల డయేరియాతో ఏటా 8,42,000 మంది పిల్లలు, పెద్దలు మృత్యువాత పడుతున్నారు.
5. ఆఫ్రికాలోని 42 శాతం వైద్య సౌకర్యాలకు సురక్షిత నీరు అందుబాటులో లేదు.
6. 1990 నుంచి 2015 మధ్య కాలంలో సబ్ సహారా ఆఫ్రికాలో రోజుకు 47 వేల మందికి మాత్రమే సురక్షిత మంచినీరు అందుబాటులోకి వచ్చింది.
7. ప్రపంచంలో 147 దేశాలు మాత్రమే మంచినీరు లక్ష్యాన్ని సాధించగలిగాయి. చైనాలో 50 కోట్ల మంది ప్రజలకు మాత్రమే మంచినీరు అందుబాటులో ఉంది.
8. ప్రపంచంలోని ప్రజలందరికి సురక్షితమైన నీరు అందించడం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలో ఒకటి.
9. ప్రపంచంలో 90 శాతం నీరు వ్యవసాయ అవసరాలకే వినియోగం అవుతోంది. సెప్టెంబర్ రెండవ తేదీతో ప్రపంచ నీటి వారోత్సవం ముగియనున్న తరుణంలో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడం శుభ పరిణామం.