
జలం.. జఠిలం
భూగర్భజలాలు అడుగంటి.. బోర్లు ఎండిపోవడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అలమటిస్తున్నారు.
– నేటికి 679 గ్రామాలకు చేరని తాగు నీటి పథకాలు
– 165 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా
– అడుగంటి పోయిన చేతి పంపులు 2487
– మరమ్మతులకు నోచుకోని చేతి పంపులు 872
భూగర్భజలాలు అడుగంటి.. బోర్లు ఎండిపోవడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అలమటిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తనీయబోమని, 24 గంటల్లోగా సమస్య పరిష్కరిస్తామని చెప్పిన పాలకులు, అధికారులు మాటలు నీటిమూటలయ్యాయి. జిల్లాలో అత్యధిక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. - అనంతపురం సిటీ
జిల్లాలో 56 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. పది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులున్నాయి. రోజుకు 1.05 టీఎంసీల తాగునీరు సరఫరా అవుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. సగటున ఒక మనిషికి రోజుకు 30 లీటర్లకు మించి నీరు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 1,795 గ్రామాలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. 679 గ్రామాలకు తాగునీటి పథకాలు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు సొంతంగా బోర్లు వేసుకుని నీరు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్కీములెన్నున్నా..
జిల్లాలో అతిపెద్దదైన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కింద 936 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నా 836 గ్రామాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. కాగా ఈ పథకాన్ని గత ప్రభుత్వం వారికి అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చిందన్న అక్కసుతో ఓ ప్రజాప్రతినిధి తన బలాన్ని ఉపయోగించి స్కీమ్‌ని ఏడు పాయలుగా చీల్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అనుకున్న మేరకు ప్రస్తుతం ఈ స్కీమ్ ఏడుగురు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినా నీటి సరఫరాలో ప్రజలకు ఊరట కలగలేదు. ఒక్క గ్రామానికి కూడా అదనంగా నీరివ్వలేక పోతున్నారు. మెయిన్ పైప్‌లైన్ మరమ్మతులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ పథకం నుంచి కూడా నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక జేసీ నాగిరెడ్డి పథకం 514 గ్రామాలకు, సత్యసాయి వాటర్ సప్లయ్ స్కీమ్ 571 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నాయి.
చేతి పంపులు:
జిల్లాలోని 63 మండలాలకు కలిపి 12,674 చేతి పంపులు ఉన్నాయి. వాటిలో వేసవి రాగానే భూగర్భ జలాలు అడుగంటి పోయి నీరు రానివి 2,487 ఉండగా, ఇప్పటిదాకా పని చేయని చేతి పంపులు 872 ఉన్నాయి. ఇంకా 630కి పైగా చేతిపంపుల కోసం బోర్లు వేయాలన్న వినతులు అధికారులకు జిల్లా వాసులు అందించినట్లు తెలుస్తోంది.
ట్యాంకర్లతో సరఫరా
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 165 గ్రామాలకు మాత్రమే తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. రోజుకు ఈ గ్రామాలకు 971 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇక 99 గ్రామాల్లో రోజుకు 127 ట్రిప్పుల నీటిని పశువులకు తాగేందుకు సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో పొందుపరిచారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల్లో కూడా తక్కువ చేసి చూపాల్సిందిగా అధికారపార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం.
స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ
జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో కలెక్టర్ స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ కింద రూ.53 కోట్లు ఇచ్చారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులతోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టి చాలా చేతి పంపులను మరమ్మతులు చేయించగలిగామన్నారు. ఇంకా పనులు జరుగుతున్నాయని వారంటున్నారు.