సాక్షి ప్రతినిధి, కాకినాడ : సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కరువు నెలకొందని చెప్పారు. అయితే ఏటా వేసవిలో ఎదురయ్యే సాధారణ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన కనీస కార్యాచరణే కరువైన ప్రభుత్వం.. కరువు పరిస్థితుల్లో ప్రజానీకం కడగండ్లను తగ్గించడానికి గానీ, కనీసం వారి దాహార్తికి అవసరమైన నీటిని అందించడానికి గానీ ఏ మాత్రం సన్నద్ధంగా లేదు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కళ్లకు కడుతోంది.
మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని తాండవ, పంపా, ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్, చంద్రబాబు సాగర్, పుష్కర తదితర ప్రాజెక్టులు చుక్క నీరు లేకుండా ఎండిపోయి బీళ్లను తలపిస్తున్నాయి. ఏజెన్సీలోనూ ఇలాంటి దుస్థితే కనిపిస్తోంది. అక్కడ భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ ప్రాజెక్టులు అడుగంటాయి. అటు మెట్ట, ఇటు ఏజెన్సీలో సైతం మూగజీవాలకు కనీసం ఎండుగడ్డి కూడా గగగనమైపోతోంది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న శివారు గ్రామాలు జిల్లాలో 1,058 వరకు ఉన్నాయి. వీటిలో 886 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులే లెక్క తేల్చారు.
కోనసీమలోని తీర గ్రామాల్లో కూడా గుక్కెడు నీటి కోసం అక్కడి ప్రజలు పడుతున్న పాట్లు చెప్పనలవికాదు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి తదితర తీరప్రాంత మండలాల్లోని మత్స్యకార గ్రామాల వారు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి జిల్లా పరిషత్ కేవలం రూ.మూడు కోట్లు కేటాయించింది. ఇదే విషయాన్ని జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు గడచిన వారం రోజులుగా జిల్లా అంతటా ఊదరగొడుతున్నారు. ఈ నిధులు ఎంత మంది దాహార్తిని తీరుస్తాయనేది వేచి చూడాల్సిందే.
ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ పోరు..
ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా జడత్వంతో పట్టించుకోని సర్కారులో చలనం తెచ్చే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తాగునీటి ఎద్దడిని, కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మండలాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ యావత్తు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో చంద్రబాబు సర్కార్‌పై నిరసన గళాన్ని జిల్లా అంతటా వినిపించేందుకు సిద్ధమవుతోంది. కన్నబాబు ఇప్పటికే రెండు దఫాలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్‌లు, రాష్ట్ర, జిల్లాస్థారుు పదవుల్లో ఉన్న నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులతో మాట్లాడి ప్రజా భాగస్వామ్యంతో ఎమ్మార్వో లేదా ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు, మూగజీవాలపై కూడా కనికరం లేని కాఠిన్యాన్ని ఎండగట్టేందుకు మండలాల్లో ఆందోళనలు చేపట్టాలని ఆయన పార్టీ నేతలు, శ్రేణులను సమాయత్తం చేశారు. కన్నబాబు కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్‌లో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రూ.10.44 కోట్లు అడిగాం.. రూ.2 కోట్లు వచ్చాయి..
జిల్లాలో శివారు గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించేందుకు రూ.10.44 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రస్తుతానికి రూ.రెండు కోట్లు విడుదలచేసింది. మిగిలిన నిధులు త్వరలో వస్తాయి. సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం.
- పి.రాజేశ్వరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
అవసరమైతే పశుగ్రాసం తెస్తాం..
75 శాతం రాయితీపై రైతులకు సరఫరాచేసేందుకు 16 టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశాం. జిల్లాలో పశువుల మేతకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. బోర్లు లేక నీటి లభ్యత లేదనే కారణంతో రైతులు పచ్చి రొట్ట విత్తనాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మెట్ట ప్రాంతంలో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే గడ్డి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం.
- గాబ్రియేలు, జాయింట్ డెరైక్టర్, పశుసంవర్ధక శాఖ, కాకినాడ
కరువు కోరల్లో..
Published Mon, May 2 2016 12:45 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement