మరో దోపిడీకి చంద్రబాబు కుట్ర
పోలవరంపై ఆయనకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ దుట్టా విమర్శలు
హనుమాన్‌జంక్షన్ రూరల్ :
పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మరో దోపిడీకి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ దశాబ్ధాలుగా కలగా మిగిలిపోయిన పొలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును నిర్మించాలనే దృఢనిశ్చయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భూసేకరణ, ప్రధాన కాలువల తవ్వకం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు వంటి పనులను పూర్తి చేశారని చెప్పారు. కుడి ప్రధానకాలువ ద్వారా కోస్తాంధ్ర జిల్లాలు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని లక్షలాది ఎకరాలను సాగునీరు అందించే లక్ష్యంతో దాదాపు మూడొంతుల కాలువ పనులు సైతం వైఎస్సార్ హాయంలోనే జరిగాయని దుట్టా గుర్తు చేశారు. పోలవరం పూర్తి అయితే దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. ఇంతటి బృహత్తర ప్రాజెక్టును వదిలి పెట్టి రోజుకు రూ.కోటిన్నర విద్యుత్ ఖర్చుతో కేవలం గోదావరిలో వరద నీటిని తరలించేందుకు పట్టీసీమ ఎత్తిపోతల పథకం నిర్మించటం సీఎం చంద్రబాబు అవివేకమని ఎద్దేవా చేశారు. పట్టీసీమ పేరుతో రూ.1600 కోట్ల ప్రజా ధనాన్ని పచ్చ తమ్ముళ్లు దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ ఎడమకాలువకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించటం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం మరో దోపిడికి తెర లేపిందని దుట్టా దుయ్యబట్టారు.