నల్లగొండ : నీరందక వరి పైరు ఎండిపోతోందని ఆవేదనకు గురైన రైతులు కాలువ గేట్లను ఎత్తి నీటిని తరలించిన ఘటన నల్లగొండ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిలుకూరు మండల రైతులు నీటిని విడుదల చేయాలని కోరుతూ మునగాల శివారులోని సాగర్ ప్రధాన ఎడమకాలువ వద్ద ఆందోళనకు దిగారు. అయితే హెడ్ రెగ్యులేటర్ వద్ద కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా రైతులే గేట్లను ఎత్తి ముక్త్యాల బ్రాంచి కాలువకు నీటిని విడుదల చేశారు.
ఈలోగా ఎన్‌ఎస్‌పీ ఏఈ బాలాజీ అక్కడకు చేరుకోవడంతో రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఏఈ బాలాజీ వివరణ ఇస్తూ... ప్రస్తుతం వారబందీ విధానం అమలుచేస్తున్నామని, వారం పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.