ఇరు గ్రామాల ప్రజలతో చర్చిస్తున్న అధికారులు
జక్రాన్‌పల్లి (నిజామాబాద్ రూరల్): మండలం లోని పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాం నుంచి నీ టి విడుదల గ్రామాల మధ్య జల జగడానికి దారి తీసింది. ఇరువైపుల నుంచి ప్రజలు పెద్ద సంఖ్య లో తరలి రావడంతో శనివారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీరు వదలాలని ఒకరు, వదలద్దని మరొకరు పట్టుబట్టడంతో పెద్ద వాగులో వాదులాట జరిగింది. అయితే, అధికారులు వేగంగా స్పందించడంతో ప్రస్తుతానికైతే జల వివాదం సద్దుమణిగింది. జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్, చింతలూర్ గ్రామాల మధ్య గల పెద్దవాగులో ప్రభుత్వం రూ.3.50 కోట్లతో చెక్ డ్యాం నిర్మించింది. ఈ చెక్ డ్యాంకు కుడి వైపున మాటు కాలువ ద్వారా నడ్కుడ చెరువులోకి నీరు వెళ్లేలా ఆరు అడుగులతో కూడిన ఒక గే టు(షట్టర్)ను బిగించారు. అయితే, ఇటీవలి వర్షాలకు చెక్‌డ్యాం నిండడంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చెక్ డ్యాంను ప్రారంభించి, షట్టర్‌ను తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని విడుదల చేశారు.
గేటు మూసేయడంతో వివాదం..
అయితే, చెక్‌డ్యాంలో నిలువ ఉన్న నీరు వెళ్లిపోతుండడంతో కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు శనివారం ఉదయం చెక్ డ్యాం వద్దకు వెళ్లి షట్టర్‌ను మూసివేశారు. ఈ విషయం తెలిసి నడ్కుడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలిగోట్ వద్దకు తరలి వచ్చారు. అప్పటికే అక్కడ కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఉండడంతో ఏం జరుగుతుందోన్న ఆందోళన నెలకొంది. వాగులో గుమి గూడిన ఆయా గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. సమాచారమందుకున్న నీటిపారుదల శాఖ ఈఈ రాధాకిషన్‌రావు, డీఈలు నాగేశ్వర్‌రావు, గోపినాథ్, జక్రాన్‌పల్లి, వేల్పూర్ తహసీల్దార్లు సతీశ్‌రెడ్డి, అర్చన, ఆర్మూర్ రూరల్, ధర్పల్లి సీఐలు పాలగొల్లు రమణారెడ్డి,« చందర్‌రాథోడ్, జక్రాన్‌పల్లి, వేల్పూర్ ఎస్సైలు సురేశ్‌కుమార్, ప్రభాకర్ అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. అనంతరం ఒక్కో గ్రామం నుంచి పది మంది చొప్పున ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, మంది రైతులతో అధికారులు రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
నీళ్లు వదలాలి: నడ్కుడ వాసులు..
ఇరవై ఏళ్లుగా తాగు, సాగునీటికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, చివరకు ప్రజాప్రతినిధుల సహకారంతో చెక్ డ్యాం నిర్మించుకుంటే ఇ ప్పుడు వచ్చి నీటిని అడ్డుకోవడం సరికాదని నడ్కుడ వాసులు తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న చెరువులో ప్రస్తుతం ఒక్క నీటి బొట్టు లేదని, తాగునీరు కూడా దొరకడం లేదన్నారు. చె క్‌డ్యాం నిర్మాణ సమయంలోనే అడ్డు చెప్పకుండా కలిగోట్, చింతలూర్ గ్రామస్తులు ఇప్పుడు నీళ్లు వదలకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. చెక్ డ్యాంకు నిర్మించిన గేటును తెరిచి నడ్కుడ చెరువులోకి నీటిని వదలి ఆదుకోవాలని కోరారు.
ఒప్పుకోబోమన్న కలిగోట్, చింతలూరు గ్రామస్తులు..
అయితే, చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని కలిగోట్, చింతలూరు ప్రజలు స్పష్టం చేశారు. చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీరు కాకుండా అదనపు నీటిని వదిలితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. వాగు ప్రవ హించినప్పుడు, రామడుగు ప్రాజెక్టు సర్‌ప్లస్ వా టర్ వచ్చినపుడు మాత్రమే షట్టర్ ద్వారా నీళ్లు వదలాలని సూచించారు. వాగు పారకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని, తాగు, సాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అధికారులు పరిశీలించి ఇరు గ్రామాల రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న అధికారులు ఉన్నతాధికారులకు ఫోన్‌లో పరిస్థితిని వివరించారు. అయితే, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఇరు గ్రామాల ప్రజలు రెండు గంటల పాటు వేచి చూశారు. అనంతరం ఆర్మూర్ సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు విన్నవించామని, వారి ఆదేశాల మేరకు నిర్ణయం చెబుతామన్నారు. ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం ఇరు గ్రామాల ప్రజలు నడుచుకోవాలన్నారు. ఇరు గ్రామాల ప్రజలు సంయమ నం పాటించాలని, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా చర్యలు తప్పవని సూచించారు. ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇరు గ్రామాల ప్రజలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment