గద్వాల జమ్ములమ్మ రిజర్వాయర్‌లో నీటిశుద్ధి కేంద్రం
గద్వాల : ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. రిజర్వాయర్లు వట్టిపోయాయి. కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో వేసవికి ముందే తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
అయినా, ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు కరువయ్యాయి. తీరా అత్యవసర సమయంలో నిధులు మంజూరుకాకపోవడం, కేటాయింపు అరకొరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు వేసవి రాకముందే పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు అరకొర నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని ప్రాం తాల్లో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు.
అయిజలో తాగునీటి సమస్య జఠిలం
అయిజలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. అక్కడ ఉన్న బోరుబావులు అ డుగంటాయి. భూగర్భజలాలు వేగంగా పడిపోతుండటంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు సరిపోవడంలేదు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. గద్వాల పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడానికి కృష్ణా ఫిల్టర్‌బెడ్, జమ్ములమ్మ ఫిల్టర్ బెడ్‌లు ఉన్నాయి. నదిలో నీరు లేకపోవడంతో కృష్ణా ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా అయ్యే కాలనీలకు తాగునీరు అరకొరగా అందనుంది. జమ్ములమ్మ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతోపాటు గద్వాల పట్టణ శివారులో తాగునీటి ఇక్కట్లు నెలకొన్నాయి. ఇక్కడ తాగునీటి సరఫరా అరకొరగా ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సమస్యాత్మక పట్టణాల గుర్తింపేదీ?
గద్వాల, అయిజ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించాల్సి ఉండగా... ఆ దిశగా కార్యాచరణ చేయలేదు. గతేడాది మాత్రం ఆయా పట్టణాల్లో తాగునీటి కోసం ఎక్కువగా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ ఏడాది ముందుగానే ఎద్దడి మొదలైన తాగునీటి అవసరాలపై చర్యలు లేకపోవడం ఆ ప్రాంతవాసులకు ఆందోళన కలిగిస్తోంది.
మిషన్ భగీరథ మీదనే భారం...
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ కిందనే నీటిని అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ నీటిని తీసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. జూరాల దగ్గర ఉన్న గ్రిడ్ ద్వారా ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని మున్సిపాలిటీలకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గద్వాల పట్టణ శివారులో నిర్మించిన ట్యాంకులు, సంపుల్లోకి నీటిని తీసుకొని, అక్కడి నుంచి పాత పద్ధతిలోనే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. అయిజ పట్టణానికి మాత్రం భగీరథ నీరు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
నీటి అవసరాలు తీరేనా?
గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి అవసరాలు తీవ్రంగా మారగా.. అధికారులు మాత్రం ఈ వేసవిలోనే మిషన్‌భగీరథ కింద నీటిని అందించాలని నిర్ణయించారు. నీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికీ అనుమానంగా ఉంది. అయితే ప్రతి వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఆయా పట్టణాల్లో కనిపించడం లేదు.
ప్రతిపాదనలు పంపిస్తాం
నీటి ఎద్దడి నివారణ చర్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. గతేడాది తరహాలోనే ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు నివేదిస్తాం. మిషన్ భగీరథ కింద నీటిని ఇవ్వడానికి సైతం ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం.
– ఇంతియాజ్ అహ్మద్, డీఈ, గద్వాల మున్సిపాలిటీ
సమస్య తీరడంలేదు
తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. తాగునీరు సరఫరా కాకపోవడంతో చాలామంది అయిజలో ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. దుర్గానగర్‌కు ఇంతవరకు కుళాయి కనెక్షన్‌లు ఇవ్వలేదు. చేతిపంపులు ఎండిపోయాయి. ఒకటే బోర్‌వెల్‌లో నీళ్లున్నాయి. దానికి పవర్‌మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తున్నారు. మోటార్ కాలిపోయినప్పుడల్లా నీళ్లు దొరకవు. ఎండాకాలంలో అధికారులు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
– మాణిక్యమ్మ, దుర్గానగర్, అయిజ
Comments
Please login to add a commentAdd a comment