గతంలో కేవలం అధికార కేంద్రమే
పదేళ్లుగా ప్రేరక శక్తిగా నిలిచింది
వికసిత భారతే మనందరి లక్ష్యం
ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
పీఎంవో అధికారులతో మోదీ
ప్రధానిగా బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు.
2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు.
పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు.
పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం.
నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అదే నా శక్తి రహస్యం...
తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు.
‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం
సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment