Prime Ministers Office
-
మోదీ పీఎంవో కాదది... ప్రజా పీఎంవో!
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు. పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు. పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం. నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే నా శక్తి రహస్యం... తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు. ‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి శ్వేతా సింగ్ నియమితులయ్యారు. 2008 బ్యాచ్ అధికారి అయిన శ్వేతా సింగ్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం పేర్కొంది. శ్వేతా సింగ్ జాయిన్ అయిన నాటి నుంచి మూడేళ్లపాటు నూతన బాధ్యతల్లో కొనసాగుతారు. అదేవిధంగా, పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా అనికేత్ గోవింద్ మాండవ్గానె నియామకాన్ని ఏసీసీ రద్దు చేసింది. 2009 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన అనికేత్ జూలై 18వ తేదీన ఆ పదవిలో నియమితులయ్యారు. -
5న కేదార్‌నాథ్‌కు ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొంది. అనంతరం రూ.130 కోట్లతో నిర్మించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.180 కోట్లతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపింది. 2013లో సంభవించిన వరదల్లో ఆదిశంకరాచార్య సమాధి ధ్వంసమైందని పీఎంవో పేర్కొంది. -
సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు
కేంద్ర మంత్రుల ఆస్తుల ప్రకటన * పీఎంవో వెబ్సైట్లో వివరాలు * రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ మందికి ఆస్తులు న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. దీని ప్రకారం ఎక్కువ మంది మంత్రులు రియల్ ఎస్టేట్ రంగంలోనే తమ ఆస్తులున్నట్లు తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వీరి ఆస్తుల వివరాలను పీఎంవో తన వెబ్సైట్లో ఉంచింది. 2016 జనవరి 30 నాటికి ఈ వివరాలను అప్డేట్ చేసినట్టు వెల్లడించింది. కీలక మంత్రులైన రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, పరీకర్, తదితరుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. వెంకయ్యనాయుడు: ఈయనకు స్థిర, చరాస్తులూ లేవు. రూ. 38వేల నగదు, రూ. 28.07 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్యపేరుతో రూ.8కోట్ల ఆస్తులు ఉన్నాయి. భార్యకు రూ.26 లక్షలు అప్పుగా ఇచ్చారు. సుష్మాస్వరాజ్: ఈమె స్థిర, చరాస్తులు, ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం విలువ రూ. 5.35 కోట్లు చేతిలోని డబ్బు రూ. 22,616. అశోక్ గజపతిరాజు: సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు(5.06 కోట్లు), ఎఫ్డీలు(1.51 కోట్లు), షేర్లు, బాండ్లు (1.12 కోట్లు), సాగు భూమి(62.06 సెంట్లు) వాణిజ్య భూమి (1.20 సెంట్లు), ఇల్లు(రూ.25లక్షలు). జేపీ నడ్డా: సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో రూ. 15లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లు(10 లక్షలు), బీమా పాలసీలు (15లక్షలు)తోపాటు 1.45 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. రవిశంకర్ ప్రసాద్: బ్యాంకు డిపాజిట్లు (9.25కోట్లు), బాండ్లు, డిబెంచర్లు తదితరాలు కలుపుకుని రూ. 10కోట్లున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్: స్థిర, చరాస్తులు, బ్యాంకు బాలెన్సు కలుపుకుని 35 లక్షలుండగా.. భార్య పేరుతో 34 లక్షల ఆస్తులతోపాటు ఓ పెట్రోల్ బంక్ ఉంది. ఉమాభారతి: రూ. 4.75 కోట్ల ఆస్తులు సదానంద గౌడ: స్థిర,చరాస్తులు, బాండ్లు, బ్యాంకు బాలెన్సు అన్నీకలిపి రూ. 14 కోట్లు. సురేశ్‌ప్రభు: కోటిన్నర వరకు ఆస్తులున్నాయి. స్మృతిఇరానీ: 1.75 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకకులో రూ.35లక్షలు. మహేశ్‌శర్మ: ఐదు ఇళు ్ల(రూ. 19.19 కోట్లు), రూ. 7.5 కోట్ల సేవింగ్స్, డిపాజిట్లు. జితేందర్‌సింగ్: జమ్మూలో ఇల్లు(రూ. 1.97 కోట్లు), వ్యవసాయ భూమి(రూ. 33 లక్షలు) రాధామోహన్‌సింగ్: రూ. 62 లక్షల స్థిరాస్తి. థావర్‌చంద్ గెహ్లాట్: స్థిర, చరాస్తుల విలువ రెండున్నర కోట్లు. బీరేంద్రసింగ్: స్థిర, చరాస్తులు, బ్యాంకు, డిపాజిట్ల మొత్తం విలువ రూ.2.6 కోట్లు. హర్సిమ్రత్ కౌర్ బాదల్: స్థిర, చరాస్తులతోపాటు బ్యాంకు అకౌంట్లు, బంగారు ఆభరణాలు కలిపి రూ. 12 కోట్లున్నాయి. -
ఎయిర్‌పోర్టు వస్తోంది
జక్రాన్‌పల్లి:జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రజల కల నెరవేరబోతోంది. దేశంలో 51, రాష్ట్రంలో 8 ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని గత ఏడాది జూన్ 29న ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తాజాగా ఎన్డీఏ సర్కారు ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల స్థాపనకు బడ్జెట్లో సుముఖత వ్యక్తం చేయడంతో మళ్లీ జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన తె రపైకి వచ్చింది. జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గ తంలో భావించారు. ఇందుకోసం 795.36 ఎకరాల పట్టా భూములను, 1,208.26 ఎకరాల అసైన్డ్ భూములను అప్పగించడానికి జక్రాన్‌పల్లి మండల రైతులు ముందు కు వచ్చారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ పెరి గి వైమానిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, 2009లో రక్షణ శాఖ అ భ్యంతరం వ్యక్తం చేసింది. కరీంనగర్తోపా టు జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పా టు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఈ అంశం తాత్కాలికంగా మరుగునపడిం ది. పీఎంఓ నిర్ణయంతో మళ్లీ తెరపైకి వచ్చింది. యూనివర్సిటీ శంకుస్థాపన సమయంలోనే వైఎస్ హామీ డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ శం కుస్థాపనకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జక్రాన్‌పల్లి మండలంలోనే ఎ యిర్పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో జిల్లాకో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించిన దివంగత ముఖ్యమంత్రి కల నెరవేరబోతోంది. అప్పట్లో వైఎస్ ఆలోచనకు అనుగుణంగా జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి, కొలిప్యాక్, తొర్లికొం డ, మనోహరాబాద్ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా ఎంతో విశాలమైన స్థలం ఇక్కడే ఉంది. దీంతో నాలుగు గ్రామాల పరిధిలోని 2004.22 ఎకరాల భూమిని సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాల రూపురేఖలు మారుతాయి విమానాశ్రయం ఏర్పాటయితే జిల్లాతోపాటు చుట్టూ ఉన్న గ్రామాల రూపు రేఖలు మారిపోయి అభివృద్ధి బాట పడతాయని ఆశించిన రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. నష్ట పరిహారం విషయంలో స్వల్ప వివాదం ఏర్పడినా, రైతులంతా విమానాశ్రయం ఏర్పాటుకే సుముఖత వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రతి పాదిస్తున్న స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉంది. తెలంగాణ యూనివర్సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే జిల్లావాసులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. వీరితోపాటు సీడ్ వ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందింది. వీరందరికీ విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుంది. -
తొలి రోజు మోడీ బిజీబిజీ
* ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ * పీఎంఓలో మహాత్ముడికి పుష్ప నివాళి * తొలి నిర్ణయం కింద గోరఖ్‌ధామ్ * రైలు ప్రమాద బాధితులకు పరిహారం న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంగళవారం ప్రధాని బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. ప్రధాని హోదాలో తొలిరోజు తీరికలేకుండా గడిపారు. అధికార విధులు, సీనియర్ అధికారులు, సార్క్ దేశాల అధినేతలు, సహచర మంత్రులతో, భేటీల్లో మునిగితేలారు. మోడీకి ప్రధానిగా ఇవే తొలి అధికార భేటీలు. గుజరాత్ భవన్ నుంచి బీఎండబ్ల్యూ కారులో ఉదయం సౌత్‌బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరుకున్న ఆయనకు పీఎంఓ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మోడీ పుష్పనివాళి అర్పించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 50వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కూడా ట్విట్టర్లో నివాళి అర్పించారు. తర్వాత నృపేంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కాసేపు భేటీ అయ్యారు. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారని పీఎంఓ తెలిపింది. ప్రధానిగా మోడీ తీసుకున్న తొలి అధికార నిర్ణయం ఇదే. ఆయన పీఎంఓలో 15 నిమిషాలు ఉన్నారు. సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నిజానికి ఆ రోజు రాత్రే ఉన్నతాధికారులతో సమావేశమవడం ద్వారా అధికార విధులు ప్రారంభించారు. మన్మోహన్ ఇంటికి... మోడీ మంగళవారం సాయంత్రం ప్రత్యేక గౌరవ సూచకంగా తాజా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నారు. మన్మోహన్ కొత్త అధికార నివాసమైన 3, మోతీలాల్ నెహ్రూ ప్లేస్‌కు చేరుకున్న ఆయనను మన్మోహన్ దంపతులు లోనికి ఆహ్వానించారు. మోడీ మర్యాదపూర్వకంగా మాజీ ప్రధానిని కలుసుకున్నారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రధాని అధికార నివాసమైన 7, రేస్‌కోర్స్ రోడ్డు భవనానికి మరమ్మతులు జరుగుతుండడంతో మోడీ ప్రస్తుతం గుజరాత్ భవన్లో ఉంటున్నారు. ఆయన కొద్ది రోజుల్లో అక్కడికి మకాం మార్చనున్నారు. కాగా, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కారులో ముందు సీట్లో కూర్చునే మోడీ మంగళవారం పీఎంఓకు కారులో వచ్చేటప్పుడు వెనుక సీట్లో కూర్చున్నారని ఓ జర్నలిస్టు చెప్పారు. మోడీ షెడ్యూలు ఇలా.. ఉదయం 8.00 గంటలు: పీఎంఎలో ప్రధానిగా బాధ్యతల స్వీకరణ. జాతిపితకు నివాళి. పీఎంఓ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు. సార్క్ దేశాధినేతలతో భేటీల కోసం హైదరాబాద్ హౌస్‌కు చేరిక. 9.30: అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌తో సమావేశం 10.05: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్‌తో భేటీ 10.30: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో భేటీ 10.55: భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బేతో భేటీ 11.20: మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో సమావేశం 11.45: నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలతో భేటీ 12.10: పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌తో సమావేశం 12.45: బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షరిన్ షర్మిన్ చౌధురితో భేటీ సాయంత్రం 4.30: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటికెళ్లి ఆయనతో మర్యాదపూర్వక భేటీ. 5.00: సౌత్‌బ్లాక్‌లో తన కేబినెట్‌తో తొలి భేటీ 7.00: గుజరాత్ భవన్‌కు చేరుకుని, నేతలతో భేటీలు. -
పీఎంవోలో ‘టీమ్ మోడీ’
- మోడీ విజయంలో కీలక పాత్ర - ఇకపై ప్రధాని కార్యాలయంలోనూ వారి హవా! న్యూఢిల్లీ: కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సృష్టించిన దేశవ్యాప్త మాయాజాలం వెనక ఎంతోమంది సూత్రధారులు, మరెందరో పాత్రధారులతో కూడిన ‘టీమ్ మోడీ’ అతి కీలక పాత్ర పోషించింది! అత్యంత చాకచక్యంగా ‘బ్రాండ్ మోడీ’ని సృష్టించింది. అంతే గొప్పగా, ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా దాన్ని దేశమంతటికీ వ్యాప్తి చేసింది. గుజరాత్‌ను అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా ఈ బృందానిదే కీలక పాత్ర. మోడీ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, తనను తాను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఆహార్యం ఎలా ఉండాలి వంటి అన్ని అంశాల్లోనూ ‘టీమ్ మోడీ’ అదృశ్య మేధ అడుగడుగునా పని చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మొదలుకుని ఈ బృందంలో పలువురు సభ్యులున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన వీరిలో పలువురిని తనతో పాటు హస్తినకు తీసుకెళ్లాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇకపై ప్రధాని కార్యాలయంలోనూ వారి పాత్ర కీలకమయ్యేలా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ‘టీమ్ మోడీ’లోని పలువురు కీలక సభ్యులపై ఫోకస్... తురుపుముక్క... అమిత్ షా గుజరాత్ మాజీ మంత్రి, మోడీకి అత్యంత నమ్మకస్తుడైన రాజకీయ సహచరుడు, ప్రధాన వ్యూహకర్త, పూర్వాశ్రమంలో ప్లాస్టిక్, ప్రింటింగ్ వ్యాపారి. 1980ల్లో మోడీని తొలిసారిగా కలిశారు. అప్పటినుంచీ ఆయనతోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికలకు పక్కాగా వ్యూహం రచిస్తుంటారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా వ్యూహాలన్నీ బ్రహ్మాండంగా ఫలించాయి. ముఖ్యంగా షా చేపట్టిన ‘మిషన్ యూపీ’ అయితే సూపర్‌హిట్ అయింది. వారణాసి లోక్‌సభ స్థానాన్ని అట్టిపెట్టుకుని వడోదరకు మోడీ రాజీనామా చేస్తారంటున్న నేపథ్యంలో, అక్కడి నుంచి షా పోటీ చేస్తారని విన్పిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పదవి ఖాయమంటున్నా, అందుకాయన సుముఖంగా లేరని, పార్టీలోనే మరింత కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. ప్రధానిగా మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన గంగా ప్రక్షాళన వంటి ప్రాజెక్టుల అమలు బాధ్యతలను షా చేపట్టవచ్చు. ‘ప్రత్యేక’ అధికారి... కె.కైలాసనాథన్ 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేకేగా గుజరాతీలందరికీ సుపరిచితుడు. రాష్ట్రంలో అత్యంత శక్తిమంతుడైన ప్రభుత్వాధికారి. గతేడాది రిటైరైనా మోడీ మాత్రం ఏరికోరి తనవద్దే అట్టిపెట్టుకున్నారు. ఆయన కోసమే ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పేరుతో ఓ పదవిని కూడా సృష్టించారు! దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల వ్యూహంతో పాటు పార్టీలతో పొత్తు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ యంత్రాంగానికి, మోడీకి మధ్యీయనే కీలక లింకు. మోడీ ఎజెండాను అమలు చేసేందుకు పరిధులు అతిక్రమిస్తుంటారని కేకేపై కాంగ్రెస్ నిత్యం ఆరోపణలు గుప్పిస్తుంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న ఆనందీబెన్ పాటిల్‌కు సాయంగా కేకేను గుజరాత్‌లోనే మోడీ కొనసాగిస్తారని భావిస్తున్నారు. భలే వేగు... భరత్ లాల్ ఢిల్లీలో గుజరాత్ రెసిడెంట్ కమిషనర్. హస్తినలో చీమ చిటుక్కుమన్నా మోడీకి చేరవేస్తుంటారు. నాలుగేళ్లుగా దేశ రాజధానిలో రాజకీయవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా ముఖ్యులతో మోడీకి తిరగులేని రీతిలో సత్సంబంధాలను నెలకొల్పి పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయనకు చేరవేస్తూ వచ్చారు. పీఎంఓలో చేరవచ్చు. వండర్ కిడ్... ప్రశాంత్ కిశోర్ అమెరికాలో చదువుకున్న యువ మేధావి. ఐరాసలో పని చేసి వచ్చి మోడీ బృందంలో చేరారు. రెండేళ్లుగా సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. అచ్చం అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో మోడీ ప్రచార వ్యూహాన్ని రూపొందించడం, పక్కాగా ఆచరణలో పెట్టడంలో కిశోర్‌ది కీలక పాత్ర. ఎందరో ఐఐటీ పట్టభద్రులు తమ ఉద్యోగాలు వదిలి ఈ ఎన్నికల్లో మోడీ కోసం పని చేసేలా చూశారు. విధాన నిర్ణయాలను నిర్దేశించే మోడీ సలహాదారుల బృందానికి సారథుల్లో ఒకరు. పీఎంఓలోనూ చేరి బ్రాండ్ మోడీని మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించవచ్చు. న్యాయ కోణం... గిరీశ్ ముర్ము 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోడీకి ముఖ్య కార్యదర్శి. మత అల్లర్లు మొదలుకుని లోకాయుక్త దాకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సున్నితమైన న్యాయ వివాదాలన్నింటినీ ఈయనే చూసుకుంటారు. ఈయనా పీఎంఓలో చేరవచ్చు. టెక్ త్రయం... హిరేన్ జోషీ, రాజేశ్ జైన్, బీజీ మహేశ్ మోడీ ప్రచారానికి టెక్నాలజీ సొబగులు అద్దిన త్రయం. సీఎంఓ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఐటీ) హోదాలో మోడీ 3డీ ప్రచారం వెనక ఉన్నది జోషీయే. ఐటీ వ్యాపారవేత్తలైన ముంబైకి చెందిన రాజేశ్, బెంగళూరుకు చెందిన మహేశ్ ఆయనకు సహా యకులు. జోషీ కూడా మోడీతో పాటు ఢిల్లీ వెళ్లడం ఖాయమే. కోశాధికారి... సురేంద్ర పటేల్ ‘కాకా’గా గుజరాత్ అంతటికీ తెలిసిన పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. గుజరాత్‌లోని అత్యంత సంపన్నులంతా కాకా నోరు తెరిచి అడిగిన మరుక్షణం మరో ప్రశ్న లేకుండా విరాళాలు ఇచ్చేస్తారంటే అతిశయోక్తి కాదు. అద్వానీకి కూడా అతి సన్నిహితుడు. పార్టీ రాష్ట్ర కోశాధికారి కూడా. గుజరాత్లో ఉంటూనే జాతీయ స్థాయిలో బీజేపీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టనున్నారు. సలహాదారు... విజయ్ చౌతైవాలే గుజరాత్‌కు చెందిన టొరెంట్ గ్రూప్‌కు వైస్ ప్రెసిడెంట్. నాగపూర్‌కు చెందిన ఆరెస్సెస్ కుటుంబం నుంచి వచ్చారు. పలు అంశాలపై ఈయన ఇచ్చే సలహాలకు మోడీ చాలా విలువిస్తారు. మోడీ కోరిక మేరకు ఎన్నికల ప్రచారం సాగినన్ని రోజులూ కంపెనీ వ్యవహారాలు పక్కన పెట్టి ఢిల్లీలోనే మకాం వేశారు. ట్రబుల్ షూటర్... అరవింద్ కె.శర్మ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ట్రబుల్ షూటర్. పారిశామ్రిక ప్రపంచంలో గుజరాత్ పేరుతో పాటు మోడీ ప్రతిష్టను పెంచేసిన వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్రాల సూత్రధారి. యూపీకి చెందిన ఈయనకు ఆజంగఢ్, అలహాబాద్ వంటి పలు ప్రాంతాలపై పట్టుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల సమస్యల పరిష్కార బాధ్యత ఈయనదే. ఇకపై పీఎంఓలో ఎంపీల బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. -
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దాంతో ఆరుఅగ్నిమాపక శకటాలు హుటాహుటిన పీఎంఓకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న న్యూఢిల్లీ నగర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా అగమేఘాల మీద సౌత్ బ్లాక్‌లోని పీఎంఓకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయిని.... అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పీఎంఓ అగ్నిప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
వాజ్‌పేయితో సంప్రదింపులు బయటపెట్టొచ్చా?
గుజరాత్ ప్రభుత్వం, మోడీల ఆమోదం కోరిన పీఎంఓ న్యూఢిల్లీ: గోధ్రా అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయితో జరిపిన సంప్రదింపులను బహిర్గత పరచడంపై గుజరాత్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కోరింది. అయితే గతంలో ఆ సమాచారాన్ని బహిర్గతపరచడానికి పీఎంఓ కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐఓ) ఎస్ఈ రిజ్వీ నిరాకరించారు. ఆర్టీఐ యాక్ట్ 8 (1)(హెచ్) ప్రకారం ఏవిధమైన కారణాలు చూపకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన దరఖాస్తుదారుడు అభ్యతరం చెప్పారు. ఆ సమాచారం ఇవ్వకపోవడానికి సరైన కారణాలు చూపించలేదని అతడు ఆరోపించాడు. పదకొండేళ్ల క్రితం జరిగిన ఆ సంప్రదింపులను బహిర్గతం చేయడం వల్ల విచారణపై ప్రభావం పడదని, అది నిందితులకు ఆందోళన కలిగించే అంశం కూడా కాదని ఆయన చెప్పారు. దీనిని సమర్థించిన అప్పీలేట్ అథారిటీ ఆ కేసుకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా సీపీఐఓకు సూచించిం ది. తాజా సమాచారాన్ని పదిహేను రోజుల్లోగా దరఖాస్తుదారునకు అందించాలని అప్పీలేట్ అథారిటీ, పీఎంఓ డెరైక్టర్ కృష్ణన్ కుమార్ నిర్ణయించారు. దీంతో ఆర్టీఐ యాక్ట్ 11 (1) ప్రకారం థర్డ్‌పార్టీ అయి న గుజరాత్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మోడీలకు అప్పీలేట్ నిర్ణయాన్ని తెలిపామని రిజ్వీ చెప్పారు. -
'అండమాన్' మృతులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కొకుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు చెప్పారు. పడవ దుర్ఘటన పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో మంగళవారం ఆ విషయాన్ని పోస్ట్ చేసింది. అండమాన్ నికోబార్ దీవులోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఆదివారం 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తిరగబడింది. ఆ ఘటనలో 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఒక వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. మృతులలో తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. జయలలిత ఇప్పటికే మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కలెక్టర్ రిలీవ్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : కలెక్టర్ వి.శేషాద్రి బదిలీ అయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో డెరైక్టర్‌గా అవకాశం రావడంతో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు రిలీవ్ అయ్యారు. వాస్తవానికి ఈ నెల 16నే రిలీవ్ కావాలని భావించారు. ఈ నెల 19నే పీఎంవో డెరైక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో 21వ తేదీ వరకు వేచి చూడాల్సి వచ్చింది. బుధవారం ఉదయం ఉత్తర్వులు వచ్చిన వెంటనే క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వచ్చి జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం జేసీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఏజేసీ వై.నరసింహారావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్, ఆర్డీఓ రంగయ్య, ఎస్డీసీలు విజయసార థి, పరిపాలనాధికారి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డిలు కలెక్టర్‌కు వీడ్కోలు పలికారు. సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. శేషాద్రి స్థానంలో కలెక్టర్‌గా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్త కలెక్టర్‌ను నియమించే వరకు జేసీ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కలెక్టర్‌గా శేషాద్రి గతేడాది ఆగస్టు 29న విధుల్లో చేరారు. కర్నాటకవాసి అయినా తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. తెలుగులోనే దస్త్రాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో కలెక్టరేట్ నుంచి మండల కార్యాలయాలకు వెళ్లే అన్ని దస్త్రాలు తెలుగులోనే తయారు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏడాది కాలంలోనే విశాఖ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. బృహత్తర కార్యక్రమాలు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దూర ప్రాంత ప్రజలు కలెక్టరేట్‌కు రాకుండానే ఫోన్లోనే తమ సమస్యలు విన్నవించుకునే అవకాశాన్ని కల్పించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి, డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి శాఖకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించి వాటిని వంద రోజుల్లో పూర్తి చేసే కార్యాచరణను రూపొందించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంపై సర్వే చేయించారు. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో కోర్టులో తమ వాదనలు గట్టి వినిపించడానికి చర్యలు తీసుకున్నారు. ఇష్టానుసారంగా కొన్ని భూములకు ఇచ్చిన ఎన్ఓసీలను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఆన్లైన్లోనే ప్రభుత్వ భూముల వివరాలను పొందుపరిచారు. ఆ వివరాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి ఆ భూములు అసలు రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. పాలన దక్షతతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు.