- మోడీ విజయంలో కీలక పాత్ర
- ఇకపై ప్రధాని కార్యాలయంలోనూ వారి హవా!
న్యూఢిల్లీ: కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సృష్టించిన దేశవ్యాప్త మాయాజాలం వెనక ఎంతోమంది సూత్రధారులు, మరెందరో పాత్రధారులతో కూడిన ‘టీమ్ మోడీ’ అతి కీలక పాత్ర పోషించింది! అత్యంత చాకచక్యంగా ‘బ్రాండ్ మోడీ’ని సృష్టించింది. అంతే గొప్పగా, ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా దాన్ని దేశమంతటికీ వ్యాప్తి చేసింది. గుజరాత్‌ను అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా ఈ బృందానిదే కీలక పాత్ర.
మోడీ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, తనను తాను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఆహార్యం ఎలా ఉండాలి వంటి అన్ని అంశాల్లోనూ ‘టీమ్ మోడీ’ అదృశ్య మేధ అడుగడుగునా పని చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మొదలుకుని ఈ బృందంలో పలువురు సభ్యులున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన వీరిలో పలువురిని తనతో పాటు హస్తినకు తీసుకెళ్లాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇకపై ప్రధాని కార్యాలయంలోనూ వారి పాత్ర కీలకమయ్యేలా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ‘టీమ్ మోడీ’లోని పలువురు కీలక సభ్యులపై ఫోకస్...
తురుపుముక్క... అమిత్ షా
గుజరాత్ మాజీ మంత్రి, మోడీకి అత్యంత నమ్మకస్తుడైన రాజకీయ సహచరుడు, ప్రధాన వ్యూహకర్త, పూర్వాశ్రమంలో ప్లాస్టిక్, ప్రింటింగ్ వ్యాపారి. 1980ల్లో మోడీని తొలిసారిగా కలిశారు. అప్పటినుంచీ ఆయనతోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికలకు పక్కాగా వ్యూహం రచిస్తుంటారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా వ్యూహాలన్నీ బ్రహ్మాండంగా ఫలించాయి. ముఖ్యంగా షా చేపట్టిన ‘మిషన్ యూపీ’ అయితే సూపర్‌హిట్ అయింది. వారణాసి లోక్‌సభ స్థానాన్ని అట్టిపెట్టుకుని వడోదరకు మోడీ రాజీనామా చేస్తారంటున్న నేపథ్యంలో, అక్కడి నుంచి షా పోటీ చేస్తారని విన్పిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పదవి ఖాయమంటున్నా, అందుకాయన సుముఖంగా లేరని, పార్టీలోనే మరింత కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. ప్రధానిగా మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన గంగా ప్రక్షాళన వంటి ప్రాజెక్టుల అమలు బాధ్యతలను షా చేపట్టవచ్చు.
‘ప్రత్యేక’ అధికారి... కె.కైలాసనాథన్
1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేకేగా గుజరాతీలందరికీ సుపరిచితుడు. రాష్ట్రంలో అత్యంత శక్తిమంతుడైన ప్రభుత్వాధికారి. గతేడాది రిటైరైనా మోడీ మాత్రం ఏరికోరి తనవద్దే అట్టిపెట్టుకున్నారు. ఆయన కోసమే ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పేరుతో ఓ పదవిని కూడా సృష్టించారు! దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల వ్యూహంతో పాటు పార్టీలతో పొత్తు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ యంత్రాంగానికి, మోడీకి మధ్యీయనే కీలక లింకు. మోడీ ఎజెండాను అమలు చేసేందుకు పరిధులు అతిక్రమిస్తుంటారని కేకేపై కాంగ్రెస్ నిత్యం ఆరోపణలు గుప్పిస్తుంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న ఆనందీబెన్ పాటిల్‌కు సాయంగా కేకేను గుజరాత్‌లోనే మోడీ కొనసాగిస్తారని భావిస్తున్నారు.
భలే వేగు... భరత్ లాల్
ఢిల్లీలో గుజరాత్ రెసిడెంట్ కమిషనర్. హస్తినలో చీమ చిటుక్కుమన్నా మోడీకి చేరవేస్తుంటారు. నాలుగేళ్లుగా దేశ రాజధానిలో రాజకీయవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా ముఖ్యులతో మోడీకి తిరగులేని రీతిలో సత్సంబంధాలను నెలకొల్పి పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయనకు చేరవేస్తూ వచ్చారు. పీఎంఓలో చేరవచ్చు.
వండర్ కిడ్... ప్రశాంత్ కిశోర్
అమెరికాలో చదువుకున్న యువ మేధావి. ఐరాసలో పని చేసి వచ్చి మోడీ బృందంలో చేరారు. రెండేళ్లుగా సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. అచ్చం అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో మోడీ ప్రచార వ్యూహాన్ని రూపొందించడం, పక్కాగా ఆచరణలో పెట్టడంలో కిశోర్‌ది కీలక పాత్ర. ఎందరో ఐఐటీ పట్టభద్రులు తమ ఉద్యోగాలు వదిలి ఈ ఎన్నికల్లో మోడీ కోసం పని చేసేలా చూశారు. విధాన నిర్ణయాలను నిర్దేశించే మోడీ సలహాదారుల బృందానికి సారథుల్లో ఒకరు. పీఎంఓలోనూ చేరి బ్రాండ్ మోడీని మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించవచ్చు.
న్యాయ కోణం... గిరీశ్ ముర్ము
1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోడీకి ముఖ్య కార్యదర్శి. మత అల్లర్లు మొదలుకుని లోకాయుక్త దాకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సున్నితమైన న్యాయ వివాదాలన్నింటినీ ఈయనే చూసుకుంటారు. ఈయనా పీఎంఓలో చేరవచ్చు.
టెక్ త్రయం... హిరేన్ జోషీ, రాజేశ్ జైన్, బీజీ మహేశ్
మోడీ ప్రచారానికి టెక్నాలజీ సొబగులు అద్దిన త్రయం. సీఎంఓ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఐటీ) హోదాలో మోడీ 3డీ ప్రచారం వెనక ఉన్నది జోషీయే. ఐటీ వ్యాపారవేత్తలైన ముంబైకి చెందిన రాజేశ్, బెంగళూరుకు చెందిన మహేశ్ ఆయనకు సహా యకులు. జోషీ కూడా మోడీతో పాటు ఢిల్లీ వెళ్లడం ఖాయమే.
కోశాధికారి... సురేంద్ర పటేల్
‘కాకా’గా గుజరాత్ అంతటికీ తెలిసిన పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. గుజరాత్‌లోని అత్యంత సంపన్నులంతా కాకా నోరు తెరిచి అడిగిన మరుక్షణం మరో ప్రశ్న లేకుండా విరాళాలు ఇచ్చేస్తారంటే అతిశయోక్తి కాదు. అద్వానీకి కూడా అతి సన్నిహితుడు. పార్టీ రాష్ట్ర కోశాధికారి కూడా. గుజరాత్‌లో ఉంటూనే జాతీయ స్థాయిలో బీజేపీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టనున్నారు.
సలహాదారు... విజయ్ చౌతైవాలే
గుజరాత్‌కు చెందిన టొరెంట్ గ్రూప్‌కు వైస్ ప్రెసిడెంట్. నాగపూర్‌కు చెందిన ఆరెస్సెస్ కుటుంబం నుంచి వచ్చారు. పలు అంశాలపై ఈయన ఇచ్చే సలహాలకు మోడీ చాలా విలువిస్తారు. మోడీ కోరిక మేరకు ఎన్నికల ప్రచారం సాగినన్ని రోజులూ కంపెనీ వ్యవహారాలు పక్కన పెట్టి ఢిల్లీలోనే మకాం వేశారు.
ట్రబుల్ షూటర్... అరవింద్ కె.శర్మ
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ట్రబుల్ షూటర్. పారిశామ్రిక ప్రపంచంలో గుజరాత్ పేరుతో పాటు మోడీ ప్రతిష్టను పెంచేసిన వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్రాల సూత్రధారి. యూపీకి చెందిన ఈయనకు ఆజంగఢ్, అలహాబాద్ వంటి పలు ప్రాంతాలపై పట్టుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల సమస్యల పరిష్కార బాధ్యత ఈయనదే. ఇకపై పీఎంఓలో ఎంపీల బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు.