మన్మోహన్ నివాసంలో ఆయనతో మోడీ కరచాలనం
* ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ
* పీఎంఓలో మహాత్ముడికి పుష్ప నివాళి
* తొలి నిర్ణయం కింద గోరఖ్‌ధామ్
* రైలు ప్రమాద బాధితులకు పరిహారం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంగళవారం ప్రధాని బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. ప్రధాని హోదాలో తొలిరోజు తీరికలేకుండా గడిపారు. అధికార విధులు, సీనియర్ అధికారులు, సార్క్ దేశాల అధినేతలు, సహచర మంత్రులతో, భేటీల్లో మునిగితేలారు. మోడీకి ప్రధానిగా ఇవే తొలి అధికార భేటీలు. గుజరాత్ భవన్ నుంచి బీఎండబ్ల్యూ కారులో ఉదయం సౌత్‌బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరుకున్న ఆయనకు పీఎంఓ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మోడీ పుష్పనివాళి అర్పించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 50వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కూడా ట్విట్టర్‌లో నివాళి అర్పించారు. తర్వాత నృపేంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కాసేపు భేటీ అయ్యారు. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారని పీఎంఓ తెలిపింది. ప్రధానిగా మోడీ తీసుకున్న తొలి అధికార నిర్ణయం ఇదే. ఆయన పీఎంఓలో 15 నిమిషాలు ఉన్నారు. సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నిజానికి ఆ రోజు రాత్రే ఉన్నతాధికారులతో సమావేశమవడం ద్వారా అధికార విధులు ప్రారంభించారు.
మన్మోహన్ ఇంటికి...
మోడీ మంగళవారం సాయంత్రం ప్రత్యేక గౌరవ సూచకంగా తాజా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నారు. మన్మోహన్ కొత్త అధికార నివాసమైన 3, మోతీలాల్ నెహ్రూ ప్లేస్‌కు చేరుకున్న ఆయనను మన్మోహన్ దంపతులు లోనికి ఆహ్వానించారు. మోడీ మర్యాదపూర్వకంగా మాజీ ప్రధానిని కలుసుకున్నారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రధాని అధికార నివాసమైన 7, రేస్‌కోర్స్ రోడ్డు భవనానికి మరమ్మతులు జరుగుతుండడంతో మోడీ ప్రస్తుతం గుజరాత్ భవన్‌లో ఉంటున్నారు. ఆయన కొద్ది రోజుల్లో అక్కడికి మకాం మార్చనున్నారు. కాగా, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కారులో ముందు సీట్లో కూర్చునే మోడీ మంగళవారం పీఎంఓకు కారులో వచ్చేటప్పుడు వెనుక సీట్లో కూర్చున్నారని ఓ జర్నలిస్టు చెప్పారు.
మోడీ షెడ్యూలు ఇలా..
ఉదయం 8.00 గంటలు: పీఎంఎలో ప్రధానిగా బాధ్యతల స్వీకరణ. జాతిపితకు నివాళి. పీఎంఓ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు. సార్క్ దేశాధినేతలతో భేటీల కోసం హైదరాబాద్ హౌస్‌కు చేరిక.
9.30: అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌తో సమావేశం
10.05: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్‌తో భేటీ
10.30: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో భేటీ
10.55: భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బేతో భేటీ
11.20: మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో సమావేశం
11.45: నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలతో భేటీ
12.10: పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌తో సమావేశం
12.45: బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షరిన్ షర్మిన్ చౌధురితో భేటీ
సాయంత్రం 4.30: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటికెళ్లి ఆయనతో మర్యాదపూర్వక భేటీ.
5.00: సౌత్‌బ్లాక్‌లో తన కేబినెట్‌తో తొలి భేటీ
7.00: గుజరాత్ భవన్‌కు చేరుకుని, నేతలతో భేటీలు.