కలెక్టర్ రిలీవ్ | Collector V. Seshadri transferred | Sakshi
Sakshi News home page

కలెక్టర్ రిలీవ్

Published Thu, Aug 22 2013 2:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

Collector V. Seshadri transferred

విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : కలెక్టర్ వి.శేషాద్రి బదిలీ అయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో డెరైక్టర్‌గా అవకాశం రావడంతో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు రిలీవ్ అయ్యారు. వాస్తవానికి ఈ నెల 16నే రిలీవ్ కావాలని భావించారు. ఈ నెల 19నే పీఎంవో డెరైక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో 21వ తేదీ వరకు వేచి చూడాల్సి వచ్చింది. బుధవారం ఉదయం ఉత్తర్వులు వచ్చిన వెంటనే క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వచ్చి జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం జేసీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందనలు తెలిపారు.

ఏజేసీ వై.నరసింహారావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్, ఆర్‌డీఓ రంగయ్య, ఎస్‌డీసీలు విజయసార థి, పరిపాలనాధికారి, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డిలు కలెక్టర్‌కు  వీడ్కోలు పలికారు. సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. శేషాద్రి స్థానంలో కలెక్టర్‌గా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్త కలెక్టర్‌ను నియమించే వరకు జేసీ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు.
 
ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం
 కలెక్టర్‌గా శేషాద్రి గతేడాది ఆగస్టు 29న విధుల్లో చేరారు. కర్నాటకవాసి అయినా తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. తెలుగులోనే దస్త్రాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో కలెక్టరేట్ నుంచి మండల కార్యాలయాలకు వెళ్లే అన్ని దస్త్రాలు తెలుగులోనే తయారు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏడాది కాలంలోనే విశాఖ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
బృహత్తర కార్యక్రమాలు
 బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దూర ప్రాంత ప్రజలు కలెక్టరేట్‌కు రాకుండానే ఫోన్‌లోనే తమ సమస్యలు విన్నవించుకునే అవకాశాన్ని కల్పించారు. ఫోన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి, డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి శాఖకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించి వాటిని వంద రోజుల్లో పూర్తి చేసే కార్యాచరణను రూపొందించారు.
 
 ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
 ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంపై సర్వే చేయించారు. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో కోర్టులో తమ వాదనలు గట్టి వినిపించడానికి చర్యలు తీసుకున్నారు. ఇష్టానుసారంగా కొన్ని భూములకు ఇచ్చిన ఎన్‌ఓసీలను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వ భూముల వివరాలను పొందుపరిచారు. ఆ వివరాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి ఆ భూములు అసలు రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. పాలన దక్షతతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement