gadval
-
రాజకీయ వేడి
సాక్షి, గద్వాల : నడిగడ్డలో రాజకీయం ఊపందుకుంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో తిష్ట వేసేందుకు టీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న కసితో అధిష్టానం పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే అబ్రహాన్ని పార్టీలో చేర్చుకుని అలంపూర్ నుంచి రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అధికార పార్టీ బలం చేకూర్చనుంది. అలాగే గద్వాల నియోజకవర్గంలోనూ బలమైన నేత, మాజీ మంత్రి డి.కె.అరుణను ఢీకొని ఎమ్మెల్యే స్థానాన్ని వచ్చే ఎన్నికల్లోనైనా ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. పంచాయతీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరికలకు తెరతీస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను టీఆర్ఎస్ అనువుగా మార్చుకుంటుండగా.. అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మంత్రి జూపల్లి ప్రత్యేక దృష్టి ఈసారి జిల్లాలో ఏవిధంగానైనా సరే తమ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ముందుకు కదులుతోంది. దీనికోసం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించారు. నడిగడ్డలో గెలుపు గుర్రాలను సిద్ధం చేసి ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలన్న తపనలో ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు మాజీ ఎంపీ మందా జగన్నాథానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చారు. సౌమ్యుడిగా, ప్రజల్లో మంచిపేరున్న మాజీ ఎమ్మెల్యే అబ్రహాన్ని అధికార పార్టీలో చేర్చుకుని అలంపూర్ నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీలో పెట్టాలని నిర్ణయించారు. మరోవైపు అధికార పార్టీకి దీటుగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తన స భ్యత్వాన్ని రద్దు చేసిన అంశాన్ని, హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ గన్మెన్లను కే టాయించకపోవడం, ఎమ్మెల్యేగా గుర్తించకపోవ డం తదితర అంశాలను, టీఆర్ఎస్ విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సద్దుమణిగిన విభేదాలు ఇక పార్టీలో ఉన్న విభేదాలను సద్దుమణిగించడంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఇటీవల రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నిండు సభలోనే కృష్ణమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న మిగతా వారిలో ఆశలు సన్నగిల్లాయి. అలాగే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తూ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతుబంధు పథకాన్ని అనువుగా మార్చుకుని ప్రతి గ్రామంలోనూ హడావుడి చేస్తున్నారు. క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపుతూ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారు. ఇదిలాఉండగా సీనియర్ నేతగా, ప్రతిపక్ష పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండి, బలమైన నాయకురాలిగా గద్వాలకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరొందిన మాజీ మంత్రి డి.కె.అరుణ సైతం నడిగడ్డలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్‌లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా వ్యవహరిస్తూ వైఫల్యాలను ఎండగడుతూ ఢీ అంటే ఢీ అనే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వరాలు కురిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం నడిగడ్డకు వరాలు కురిపిస్తోంది. అలంపూర్ నియోజకవర్గ పరిధిలో రూ.783కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పనులను వేగవంతంగా చేసింది. అలాగే గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.26కోట్లు, ముదిరాజ్, వాల్మీకి, మున్నూరుకాపు, కుర్వ సంఘం కమ్యూనిటీ భవనాలకు రూ.50లక్షల చొప్పున కేటాయించింది. ముస్లింల కోసం ఈద్గా అభివృద్ధికి రూ.2.25కోట్లు కేటాయించి ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం, సీసీరోడ్ల నిర్మాణానికి జిల్లాకు రూ.40కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది. గట్టు, ధరూరు, కేటిదొడ్డి మండలాల ప్రజలకు సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్న గట్టు ఎత్తిపోతల పథకానికి రూ.553.98కోట్లు విడుదల చేసింది. రైతుబంధు పథకం ద్వారా రైతాంగానికి మరింత చేరువయ్యేందుకు అధికార పార్టీ నేతలకు అవకాశం కలిగింది. చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పం పిణీ ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణాన్ని త లపించేలా సభలు ఏర్పాటు చేయడంతోపాటు ఇ తర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టులను ఎక్కువ జనాభా కలిగిన సామాజిక వర్గాలకు కేటాయించడం వారికి కలిసొచ్చే అంశం. ప్రజల అభిప్రాయంతోనే టీఆర్ఎస్లోకి...మాజీ ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్ : నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్లో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్‌చౌరస్తాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సైతం టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అలంపూర్ నియోజకవర్గ నాయకులతోపాటు గద్వాలకు వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో జోగుళాంబ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ అల్లాభ„Š , యువ నాయకులు కిశోర్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సేవలందించడం వరం
గద్వాల : ప్రజలకు సేవలందించే అవకాశం తనకు భగవంతుడు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు స్వయంగా సేవలందించే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, వివిధ అభివృద్ధి పనులను చేపట్టి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు యత్నిస్తున్నానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, వైస్‌చైర్మన్ శంకర్, పార్టీ నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్, సలాం, బండల వెంకట్రాములు, రామంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 121 మంది రక్తదానం మొదట ఇంట్లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే డీకే అరుణ కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన స్వగృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులతోపాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు 121మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్తదానంతో కాపాడొచ్చన్నారు. రక్తదానాన్ని ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీచుపల్లిలో ప్రత్యేక పూజలు.. ఇటిక్యాల (అలంపూర్) : తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయ పూజారి మారుతీచారి, ఈఓ రామన్‌గౌడ్, వాల్మీకి పూజరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. -
అనుమానమే పెనుభూతమై..
గద్వాల క్రైం : అన్యోన్యంగా ఉంటున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది.. భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు.. పెద్దల సమక్షంలో పంచాయతీలు.. ఈ నేపథ్యంలో భార్యను పురుగు మందు తాగి చనిపోవాలని పురమాయించి.. ఆపై గొంతు నులిమి హత్య చేసి పారిపోయిన భర్త.. పదిరోజుల తర్వాత నేరం అంగీకరిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం గద్వాలలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెంటకటేశ్వర్లు తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. మేనమామ కూతురితో వివాహం.. మండలంలోని కాకులారం గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురైన యశోదమ్మ(40)ను గత 27 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే వివాహం అయినప్పటి నుంచి భార్యపై భర్త అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకునేవి. అయితే గత నెల 29న అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మన్న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి చనిపోమని హెచ్చరించాడు. దీంతో క్షణికావేశానికి లోనైన యశోదమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుమారులు, బంధువులు వచ్చి తనను నిలదీస్తారనే ఆందోళనతో గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకు, బంధువులకు పురుగు మందు తాగిందని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడి నుంచి కనిపించకుండాపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా.. యశోదమ్మ తండ్రి శివన్న తన కూతురు పురుగు మందు తాగి చనిపోలేదని అనుమానం వ్యక్తం చేస్తూ గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి హత్య చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గత పదిరోజుల నుంచి లక్ష్మన్న కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. అయితే భార్యను చంపి తాను తప్పించుకుని తిరగడం సాధ్యం కాదని భావించిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా గద్వాల సీఐ కార్యాలయానికి వచ్చి యశోదమ్మను హత్య చేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. దీంతో లక్ష్మన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులున్నారు. -
ముందుంది ముప్పు !
గద్వాల : ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. రిజర్వాయర్లు వట్టిపోయాయి. కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో వేసవికి ముందే తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయినా, ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు కరువయ్యాయి. తీరా అత్యవసర సమయంలో నిధులు మంజూరుకాకపోవడం, కేటాయింపు అరకొరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు వేసవి రాకముందే పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు అరకొర నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని ప్రాం తాల్లో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అయిజలో తాగునీటి సమస్య జఠిలం అయిజలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. అక్కడ ఉన్న బోరుబావులు అ డుగంటాయి. భూగర్భజలాలు వేగంగా పడిపోతుండటంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు సరిపోవడంలేదు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. గద్వాల పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడానికి కృష్ణా ఫిల్టర్‌బెడ్, జమ్ములమ్మ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. నదిలో నీరు లేకపోవడంతో కృష్ణా ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా అయ్యే కాలనీలకు తాగునీరు అరకొరగా అందనుంది. జమ్ములమ్మ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతోపాటు గద్వాల పట్టణ శివారులో తాగునీటి ఇక్కట్లు నెలకొన్నాయి. ఇక్కడ తాగునీటి సరఫరా అరకొరగా ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పట్టణాల గుర్తింపేదీ? గద్వాల, అయిజ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించాల్సి ఉండగా... ఆ దిశగా కార్యాచరణ చేయలేదు. గతేడాది మాత్రం ఆయా పట్టణాల్లో తాగునీటి కోసం ఎక్కువగా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ ఏడాది ముందుగానే ఎద్దడి మొదలైన తాగునీటి అవసరాలపై చర్యలు లేకపోవడం ఆ ప్రాంతవాసులకు ఆందోళన కలిగిస్తోంది. మిషన్ భగీరథ మీదనే భారం... నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ కిందనే నీటిని అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ నీటిని తీసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. జూరాల దగ్గర ఉన్న గ్రిడ్ ద్వారా ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని మున్సిపాలిటీలకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గద్వాల పట్టణ శివారులో నిర్మించిన ట్యాంకులు, సంపుల్లోకి నీటిని తీసుకొని, అక్కడి నుంచి పాత పద్ధతిలోనే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. అయిజ పట్టణానికి మాత్రం భగీరథ నీరు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నీటి అవసరాలు తీరేనా? గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి అవసరాలు తీవ్రంగా మారగా.. అధికారులు మాత్రం ఈ వేసవిలోనే మిషన్‌భగీరథ కింద నీటిని అందించాలని నిర్ణయించారు. నీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికీ అనుమానంగా ఉంది. అయితే ప్రతి వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఆయా పట్టణాల్లో కనిపించడం లేదు. ప్రతిపాదనలు పంపిస్తాం నీటి ఎద్దడి నివారణ చర్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. గతేడాది తరహాలోనే ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు నివేదిస్తాం. మిషన్ భగీరథ కింద నీటిని ఇవ్వడానికి సైతం ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. – ఇంతియాజ్ అహ్మద్, డీఈ, గద్వాల మున్సిపాలిటీ సమస్య తీరడంలేదు తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. తాగునీరు సరఫరా కాకపోవడంతో చాలామంది అయిజలో ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. దుర్గానగర్‌కు ఇంతవరకు కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. చేతిపంపులు ఎండిపోయాయి. ఒకటే బోర్‌వెల్‌లో నీళ్లున్నాయి. దానికి పవర్మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తున్నారు. మోటార్ కాలిపోయినప్పుడల్లా నీళ్లు దొరకవు. ఎండాకాలంలో అధికారులు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – మాణిక్యమ్మ, దుర్గానగర్, అయిజ -
అమ్మా.. ఆకలి!
ఈ విద్యార్థి పేరు లోక్‌నాథ్. గద్వాల మండలం గుర్రంగడ్డ దివి గ్రామం. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజు పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాడు. ఇంటి నుంచి ఉదయం 6గంటలకు పాఠశాలకు బయల్దేరుతాడు. పుట్టిలో కృష్ణానదిని దాటి బీరెల్లి గ్రామం నుంచి బస్సు ద్వారా గద్వాలకు ఉదయం 8.30 గంటల వరకు చేరుకుంటాడు. సాయంత్రం తిరిగి ప్రత్యేక తరగతులు పూర్తయిన వెంటనే 5.45 గంటలకు పాఠశాల నుంచి గ్రామానికి బయల్దేరుతాడు. ఇంటికి చేరుకునే వరకు రాత్రి 7 నుంచి 8 గంటలవుతుంది. పొద్దస్తమానం మధ్యాహ్నం పాఠశాలలో పెడుతున్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకలిని తట్టుకోలేక ఖాళీ కడుపుతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాడు. గద్వాల : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే దిక్కు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మళ్లీ సాయంత్రం గంటన్నరపాటు తరగతులు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దానికి తోడు ఉదయం ఇంట్లో అల్పాహారం అందక పాఠశాలలో ఎవరూ పెట్టక విద్యార్థులు కడుపులు మాడ్చుకొని చదువుకోవాల్సి వస్తోంది. అల్పాహారం అందక అవస్థలు పదో తరగతి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం ఫలితాలు, ఉత్తీర్ణతపై దృష్టిసారించిన విద్యాశాఖ విద్యార్థుల ఆకలిని పట్టించుకోవడంలేదు. విద్యార్థులు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలలోనే గడపాల్సి వస్తుంది. అందరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే కావడంతో అంత ఉదయం వంట చేయడం సాధ్యం కాదు. పరిగడుపుతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు కడుపు మాడ్చుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి పెరగడంతో నీరసించి తరగతిలో విన్న పాఠాలు అర్థంకాని పరిస్థితి ఉంది. గత విద్యా సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వడ్డీ డబ్బుల నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆ అవకాశం లేకపోవడంతో బిస్కెట్లతో సరిపెట్టారు. ప్రస్తుతం ఆ విధానంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పిల్లలు ఆకలితో అవస్థలు పడుతున్నారు. దాతలు సహకరించాలి ఆయా గ్రామాల్లోని దాతలు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సహకరిస్తే చదువుపై దృష్టి సారించి ప్రతిభ కనబరిచే అవకాశముంది. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం విద్యార్థులను పట్టించుకుని అల్పాహారం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంకా నెలరోజుల సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ఎవరైనా దాతలు వస్తే విద్యార్థుల ఆకలి బాధలు తీరుతాయి. ఆకలి తట్టుకోలేక పోతున్నాం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాం. మాకు ఎవరూ ఎలాంటి అల్పాహారం ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క మధ్యాహ్న భోజనం తప్ప కడుపులో ఏమీ ఉండడం లేదు. 8 గంటల పాటు పాఠాలు వినడం వల్ల ఆలసిపోతున్నాం. సాయంత్రం వేళ బాగా ఆకలి వేస్తోంది. తట్టుకోలేకపోతున్నాం. – జ్యోతి, విద్యార్థిని, మెలచేర్వు గ్రామం నిధులు లేవు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం నిధులు రాలేదు. కొన్ని చోట్ల దాతల సహాయంతో అల్పాహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఆయా గ్రామాల్లో దాతలు ముందుకువచ్చి విద్యార్థులకు సహకరించాలి. ఒకవేళ ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అల్పాహారం సమకూరుస్తాం. – వేణుగోపాల్, డీఈఓ -
వైద్యురాలి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
గద్వాల క్రైం: కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఓ ఆశ కార్యకర్త మభ్యపెట్టి ప్రైవేట్ క్లినిక్‌కు పంపించింది.. అక్కడ నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణాలొదిలింది.. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యురాలే కారణమని బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం గద్వాలలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..రెండురోజుల తర్వాత.. ధరూరు మండలంలోని నీళహల్లి గ్రామానికి చెందిన పావని అనే గర్భిణి ఈ నెల 22న కాన్పు కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే డ్యూటీ డాక్టర్ వరలక్ష్మి గర్భిణిని పరిశీలించి కాన్పు కావడానికి ఇంకా సమయం ఉందని, ఎలాంటి భయం లేదని చెప్పారు. ఆస్పత్రిలోనే రెండు రోజులు గడిచినప్పటికీ పావనికి ఎలాంటి నొప్పులు రాలేదు. అయితే ఓ ఆశ కార్యకర్త తనకు తెలిసిన ఓ ప్రైవేట్ క్లినిక్‌లో డెలివరీ చేయించుకోండి అంటూ ప్రైవేట్ క్లినిక్‌కు ఈ నెల 24న పంపించారు. అక్కడ డాక్టర్ వరలక్ష్మి సాయంత్రం పావనికి సిజేరియన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. అయితే బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, ఉమ్మ నీరు తాగిందని, బిడ్డ పేగు మెడకు చుట్టుకుందని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బంధు వులు గురువారం మధ్యాహ్నం గద్వా ల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెం ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టా రు. కాన్పు కోసం వచ్చిన సమయ ంలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యురాలు వరలక్ష్మి.. రెండురోజులు నిర్లక్ష్యం చేసి.. తనకు సంబంధించిన ప్రైవేట్ క్లినిక్‌లో సిజేరియన్ చేయడంతోనే బిడ్డ మృతిచెందిందని ఆరోపించారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నా తప్పిదం లేదు.. ఈ విషయమై వైద్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ చినపోవడంలో తమ తప్పిదం లేన్నారు. ఉమ్మనీరు తాగడం, పేగు మెడకు చుట్టుకోవడంతోనే మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించామన్నారు. ఎవరికీ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యం చేయించుకోవాలని చెప్పలేదన్నారు. విచారణ జరుపుతాం.. ప్రభ్తుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే కాన్పులు చేయాలి. అలా కాదని ఎవరైనా ప్రైవేట్ క్లినిక్‌లకు పంపించడం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్, గద్వాల -
క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం
గద్వాల్: మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్షకు కూర్చున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మూడు రోజులుగా గంజిపేట రాజా, ఇమ్మనేయులు, మోహిద్ఖాన్లు అనే విద్యార్థులు గద్వాలలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ వైద్యులు కిషోర్, గోవర్దన్ శిబిరం వద్దకు చేరుకుని ముగ్గురు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాజా, ఇమ్మనేయులు శరీరంలో గ్లూకోజ్, షుగర్ లెవెల్ కనీస స్థాయికన్నా తగ్గాయని తెలిపారు. బీపీ కూడా సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. ఎలాంటి ద్రవపదార్థాలు తీసుకోకపోవటంతో కిడ్నీలపై ప్రభావం పడుతోందని తెలిపారు. ఇలాగే మరో ఆరుగంటలు గడిస్తే వారి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెప్పారు