గద్వాల క్రైం : అన్యోన్యంగా ఉంటున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది.. భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు.. పెద్దల సమక్షంలో పంచాయతీలు.. ఈ నేపథ్యంలో భార్యను పురుగు మందు తాగి చనిపోవాలని పురమాయించి.. ఆపై గొంతు నులిమి హత్య చేసి పారిపోయిన భర్త.. పదిరోజుల తర్వాత నేరం అంగీకరిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం గద్వాలలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెంటకటేశ్వర్లు తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
మేనమామ కూతురితో వివాహం..
మండలంలోని కాకులారం గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురైన యశోదమ్మ(40)ను గత 27 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే వివాహం అయినప్పటి నుంచి భార్యపై భర్త అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకునేవి. అయితే గత నెల 29న అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మన్న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి చనిపోమని హెచ్చరించాడు. దీంతో క్షణికావేశానికి లోనైన యశోదమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుమారులు, బంధువులు వచ్చి తనను నిలదీస్తారనే ఆందోళనతో గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకు, బంధువులకు పురుగు మందు తాగిందని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడి నుంచి కనిపించకుండాపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనుమానాస్పద మృతిగా..
యశోదమ్మ తండ్రి శివన్న తన కూతురు పురుగు మందు తాగి చనిపోలేదని అనుమానం వ్యక్తం చేస్తూ గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి హత్య చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గత పదిరోజుల నుంచి లక్ష్మన్న కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. అయితే భార్యను చంపి తాను తప్పించుకుని తిరగడం సాధ్యం కాదని భావించిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా గద్వాల సీఐ కార్యాలయానికి వచ్చి యశోదమ్మను హత్య చేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. దీంతో లక్ష్మన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులున్నారు.
అనుమానమే పెనుభూతమై..
Published Sat, Apr 7 2018 11:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment