బర్మావత్ లక్ష్మీబాయి (ఫైల్)
కోదాడ : మూడు రోజుల క్రితం పట్టణంలోని బాలాజీనగర్‌లో పట్టపగలు దారుణ హత్యకు గురైన గిరిజన మహిళ బర్మావత్ లక్ష్మీబాయి (46) కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును పట్టణ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజున కుటుంబ సభ్యులు లక్ష్మీబాయి పెద్ద కుమారుడి కొడుకును చూడడానికి 10 గంటల సమయంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లారు. అంతకు ముందు మూడు రోజులు కోడలు వద్దే లక్ష్మీబాయి ఉంది. తాను ఇంటి వద్దే ఉంటానని, బారసాల కూడా కాదు కాబట్టి మీరు వెళ్లి రమ్మని లక్ష్మీబాయి చెప్పింది.
దీంతో ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడళ్లు, ఆమె భర్త సీతరాంసింగ్ నేలకొండపల్లి వెళ్లారు. 12 గంటల సమయంలో రెండో కుమారుడు సందీప్ తల్లికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన వారు 12–30 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు చుట్టూ చీర చుట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు గాయాన్ని గమనించలేదు. కళ్లు తిరిగి పడిపోవడంతో తలకు దెబ్బ తగిలిందెమోనని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నిందితుడు అతడేనా..?
లక్ష్మీబాయిని వైద్యశాలకు తీసుకెళుతున్న సమయంలో బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించాడని, కం గారులో అతని గురించి తాము పట్టించుకోలేదని లక్ష్మీబాయి రెండో కుమారుడు సందీప్ అంటున్నారు. ఆస్పత్రికి వెళుతుండగా పలుమార్లు సదరు వ్యక్తి సందీప్‌కు ఫోన్ చేసి ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పాడు. మొదట వద్దు అన్న సందీప్ సదరు వ్యక్తి పలుమార్లు ఫోన్ చేయడంతో చివరకు విసుగులో నీ ఇష్టం అని అనడంతో సదరు వ్యక్తి వెంటనే ఇంటిలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. ఇదంతా కేవలం 15 నిమిషాల్లోనే సదరు వ్యక్తి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అతను వారి బంధువు కూడా కాదు. అతను ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తానన్నాడు? అన్న విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అంతే కాకుండా వైద్యశాలకు ఫోన్ చేశానని, వైద్యులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో పాటు ఆమెకు ఎలా ఉంది అంటూ ఆరా తీయడం కూడా అతనిపై ఉన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ విషయాలన్ని సందీప్ ఫోన్‌లో రికార్డు అయ్యాయి. ఇపుడు ఇవే కేసుకు బలమైన ఆధారాలుగా మారనున్నాయి. ఇంటిని కుటుంబ సభ్యులే శుభ్రం చేయించినట్లు అందరిని నమ్మించాడు. తనపై అనుమానం రాకుండా ఉండడానికే తప్పు దోవపట్టించాడేమోనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పోలీసులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే కేసును ఛేదిస్తామని చెపుతున్నారు.
త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం : శ్రీనివాసరెడ్డి, సీఐ
లక్ష్మీబాయి హత్య కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం.
విషాదం నుంచి కోలుకోని కుటుంబ సభ్యులు : అప్పటి వరకు తమ కళ్ల ముందు తిరిగిన తల్లి, ఊరు వెళ్లి రండి చేపల కూర వండి పెడతానని చెప్పి తమను సాగనంపిన రెండు గంటల లోపే దారుణహత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులో విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తునే ఉన్నారు.తమ తల్లి ఎన్నో కష్టాలు పడి చదివించిందని ఆమె కృషి వల్లే తాము ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డామని లక్ష్మీబాయి ముగ్గురు కుమారులు రోదిస్తూ చెపుతున్న తీరు పలువురిని కంట తడిపెట్టిస్తోంది. లక్ష్మీబాయి భర్త సీతరాంసింగ్ కూడా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా సన్నిధానం ఏర్పాటు చేసి మాలదారులకు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాడు. లక్ష్మీబాయి కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ది. పట్టణంలోని ఎవ్వరితో విభేదాలు లేని వీరి కుటుంబానికి చెందిన మహిళను హత్య చేయాల్సిన అవసరం ఎవ్వరికి ఉందో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment