రక్తపు మడుగులో అయిలయ్య మృతదేహం
వర్ధన్నపేట : తండ్రిపై కక్ష పెంచుకున్న తనయుడు తండ్రితో ఘర్షణకు దిగి తలపై రాయితో కొట్టి చంపిన సంఘటన గురువారం రాత్రి కడారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం గ్రామానికి చెందిన మంద అయిలయ్య(60)కు ముగ్గురు కుమారులున్నారు. వీరిలో చిన్నవాడైన దేవేందర్ కన్న తండ్రిపై కక్ష పెంచుకుని గురువారం రాత్రి తండ్రితో ఘర్షణకు దిగాడు. దీంతో దేవేందర్ తల్లి అమృతమ్మ తండ్రి కొడుకులను ఎంత సముదాయించిన వినక పోవడంతో పొరుగువారిని తీసుకు వచ్చి నచ్చ చెప్పించి గొడవ సద్దు మణిగేలా చూడడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దేవేందర్ బండరాయితో దాడి చేయడంతో తల ఛిద్రమై రక్తపు మడుగులో కొట్టు మట్టాడుతూ విగతజీవుడిగా మారాడు.
కుమారుడు దేవేందర్‌కు తండ్రి స్థానికంగా రుణం రూ.50 వేలు ఇప్పించాడు. వాటిని తీర్చమని తండ్రి కోరగా భూమి పంపకం చేస్తేనే రుణం చెల్లిస్తానని మొండికేయడంతో భూమిని సైతం పంచి ఇచ్చాడు. అప్పు ఇచ్చిన వారు తండ్రిపై ఒత్తిడి తెస్తుండడంతో గత వారం రోజులుగా తండ్రీ కొడుకులు ఘర్షణ పడుతున్నారు. గురువారం సైతం ఘర్షణ పెరిగి కుమారుడు దేవేందర్ తండ్రిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన విషయాన్ని గ్రహించిన దేవేందర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ సమాచారం అందుకున్న వర్దన్నపేట ఎస్సై ఉపేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment