గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు
ఈ విద్యార్థి పేరు లోక్‌నాథ్. గద్వాల మండలం గుర్రంగడ్డ దివి గ్రామం. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజు పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాడు. ఇంటి నుంచి ఉదయం 6గంటలకు పాఠశాలకు బయల్దేరుతాడు. పుట్టిలో కృష్ణానదిని దాటి బీరెల్లి గ్రామం నుంచి బస్సు ద్వారా గద్వాలకు ఉదయం 8.30 గంటల వరకు చేరుకుంటాడు. సాయంత్రం తిరిగి ప్రత్యేక తరగతులు పూర్తయిన వెంటనే 5.45 గంటలకు పాఠశాల నుంచి గ్రామానికి బయల్దేరుతాడు. ఇంటికి చేరుకునే వరకు రాత్రి 7 నుంచి 8 గంటలవుతుంది. పొద్దస్తమానం మధ్యాహ్నం పాఠశాలలో పెడుతున్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకలిని తట్టుకోలేక ఖాళీ కడుపుతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాడు.
గద్వాల : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే దిక్కు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మళ్లీ సాయంత్రం గంటన్నరపాటు తరగతులు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దానికి తోడు ఉదయం ఇంట్లో అల్పాహారం అందక పాఠశాలలో ఎవరూ పెట్టక విద్యార్థులు కడుపులు మాడ్చుకొని చదువుకోవాల్సి వస్తోంది.
అల్పాహారం అందక అవస్థలు
పదో తరగతి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం ఫలితాలు, ఉత్తీర్ణతపై దృష్టిసారించిన విద్యాశాఖ విద్యార్థుల ఆకలిని పట్టించుకోవడంలేదు. విద్యార్థులు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలలోనే గడపాల్సి వస్తుంది. అందరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే కావడంతో అంత ఉదయం వంట చేయడం సాధ్యం కాదు. పరిగడుపుతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు కడుపు మాడ్చుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి పెరగడంతో నీరసించి తరగతిలో విన్న పాఠాలు అర్థంకాని పరిస్థితి ఉంది.
గత విద్యా సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వడ్డీ డబ్బుల నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆ అవకాశం లేకపోవడంతో బిస్కెట్లతో సరిపెట్టారు. ప్రస్తుతం ఆ విధానంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పిల్లలు ఆకలితో అవస్థలు పడుతున్నారు. దాతలు సహకరించాలి ఆయా గ్రామాల్లోని దాతలు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సహకరిస్తే చదువుపై దృష్టి సారించి ప్రతిభ కనబరిచే అవకాశముంది. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం విద్యార్థులను పట్టించుకుని అల్పాహారం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంకా నెలరోజుల సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ఎవరైనా దాతలు వస్తే విద్యార్థుల ఆకలి బాధలు తీరుతాయి.
ఆకలి తట్టుకోలేక పోతున్నాం
ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాం. మాకు ఎవరూ ఎలాంటి అల్పాహారం ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క మధ్యాహ్న భోజనం తప్ప కడుపులో ఏమీ ఉండడం లేదు. 8 గంటల పాటు పాఠాలు వినడం వల్ల ఆలసిపోతున్నాం. సాయంత్రం వేళ బాగా ఆకలి వేస్తోంది. తట్టుకోలేకపోతున్నాం.
– జ్యోతి, విద్యార్థిని, మెలచేర్వు గ్రామం
నిధులు లేవు
పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం నిధులు రాలేదు. కొన్ని చోట్ల దాతల సహాయంతో అల్పాహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఆయా గ్రామాల్లో దాతలు ముందుకువచ్చి విద్యార్థులకు సహకరించాలి. ఒకవేళ ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అల్పాహారం సమకూరుస్తాం.
– వేణుగోపాల్, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment