village students
-
సాంకేతిక సొబగులు
సాక్షి, వనపర్తి : ఎన్నో దశాబ్దాలుగా విద్యాపర్తిగా కొనసాగుతున్న వనపర్తి కీర్తిసిగలో మరో నగ చేరనుంది. జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల నివేదిక సమర్పించినట్లు తెలిసింది. వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే సంకల్పంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయించింది. పరిశీలనకు కమిటీని నియమించగా వనపర్తిలో ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. గ్రామీణ విద్యార్థులకు వరం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో బాసరతో పాటు ఇడుపులపాయ, నూజివీడులో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. 2017లో అనంతపురం జిల్లాలో మరొకటి నెలకొల్పారు. ఈ మేరకు తెలంగాణలో సైతం మరో మూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే వనపర్తిలో ఒకటి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తిలో అనుకూల పరిస్థితులు ఉన్నత స్థాయి విద్యామండలి, సాంకేతిక విద్యామండలి, బాసరలోని ఐఐఐటీ కళాశాల బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి, ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించి ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో ఉండి రోడ్డు సౌకర్యం బాగా ఉండటం, శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 120 కి.మీ దూరంలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు సులువుగా ఉంటుందని భావించి కమిటీ వనపర్తి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 50శాతం పూర్తయిన ప్రక్రియ తెలంగాణలోని తూర్పు జిల్లాలైన వరంగల్ లేదా ఖమ్మంలో మరొకటి, పశ్చిమ జిల్లాలైన మెదక్ లేదా నిజామాబాద్‌లో ఇంకొకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వనపర్తిలో బాసర స్థాయిలో ట్రిపుల్ ఐటీని నిర్మించాలంటే సుమారు రూ.700కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడంతో 50శాతం ప్రక్రియ ముగిసినట్లయింది. రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇందతా జరగడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరమే నుంచే వనపర్తిలో తరగతులు ప్రారంభించాలని యోచించినా మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 2019– 2020 విద్యాసంవత్సరంలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థలసేకరణ పూర్తి ట్రిపుల్ టీ ఏర్పాటుకు పక్కా భవనాల నిర్మాణం జరగాలంటే రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, అప్పటివరకు పాలిటెక్నిక్ కళాశాలలోని గదులను పరిశీలించిన బృందం చిన్న చిన్న మరమ్మతులు చేపడితే పక్కా భవనాలు నిర్మించే వరకు ఇక్కడే తరగతులు కొనసాగించవచ్చనే భావనకు వచ్చింది. పక్కా భవనాల నిర్మాణం, క్యాంపస్ కోసం సుమారు 250ఎకరాల స్థలం అవసరం ఉంటుందని కమిటీ సూచించింది. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత భవనం, ఎస్పీ కార్యాలయం సమీపంలోని సర్వేనంబర్ 200లో 200 ఎకరాల స్థలం ఉందని కలెక్టర్ శ్వేతామహంతి నివేదిక ఇచ్చారు. అవసరమైతే మరో 50ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించి ఇస్తామని ఆమె వెల్లడించారు. -
అమ్మో... ఆన్లైన్ పరీక్షలు..!
తక్కువ ఖర్చుతో స్వల్ప సమయంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించవచ్చనే భావనతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలకు కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోవడం, తగినంత శిక్షణ పొందేందుకు వనరుల లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు నష్టపోతున్నారు. తిరువూరు: జిల్లాలోని పశ్చిమకృష్ణా ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ఏకొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో కంప్యూటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండట్లేదు. హైస్కూలు స్థాయి నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం కంప్యూటరు విద్య ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలోని 284 జెడ్పీ హైస్కూళ్లలో లక్షా 10 వేల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా రెట్టింపు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 10 శాతం మందికి కూడా కంప్యూటర్ విద్య అందట్లేదు. కంప్యూటర్ శిక్షణలో వెనుకబాటే... విద్యాపరంగా ముందంజలో ఉన్న కృష్ణాజిల్లాలో బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు కూడా కంప్యూటర్ నైపుణ్యాలు కరువవుతున్నాయి. బీటెక్‌లో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ, బీఎస్సీ, బీకాంలలో కంప్యూటర్ సబ్జెక్టుతో పట్టా పుచ్చుకున్న విద్యార్థులు కూడా ఆన్లైన్ పరీక్షలు రాయడానికి తడబడే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, టెట్ పరీక్షలకు, ప్రభుత్వోద్యోగులు పదోన్నతుల కోసం రాసే డిపార్టుమెంటల్ పరీక్షలకు కూడా ఆన్లైన్ టెస్టులే జరుగుతున్నాయి. ఎడ్‌సెట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, డీసెట్ వంటి ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశ పరీక్షలకూ ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. మాక్ టెస్టుల పేరుతో ఆయా ఎంపిక సంస్థలు వెబ్సైటులో నమూనా పరీక్షలు పెడుతున్నా అభ్యర్థులకు అర్థం కావట్లేదు. ప్రైవేటు వెబ్సైట్లు ఆన్లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నా ఉచితంగా లభ్యంకాక పేద విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. ‘టెట్’ గందరగోళంతో మరింత ఆందోళన 2017 టెట్‌లో ప్రైవేటు ఏజెన్సీకి పరీక్ష నిర్వహణను విద్యాశాఖ అప్పగించగా, ఆన్లైన్ ప్రశ్నపత్రం కూర్పులో గానీ, వాల్యుయేషన్, రీవెరిఫికేషన్, రెస్పాన్స్షీట్ల జారీలో ఫైనల్ కీతో సంబంధం లేకుండా గజిబిజిగా ఫలితాలు వెల్లడవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి కూడా టెట్‌పరీక్ష ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించగా, ఆఫ్‌లైన్‌లోనే జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వలె అన్ని పోటీపరీక్షలకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీ క్షలు నిర్వహిస్తే గ్రామీణ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. ‘టెట్’లో అర్హత సాధించలేకపోయా టెట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడంతో కంప్యూటర్ పరిజ్ఞానం తగినంత లేక అర్హత సాధించలేకపోయా. టెట్ పరీక్షకై పూర్తిస్థాయిలో సిద్ధమైనప్పటికీ ఆన్లైన్ పరీక్ష నిర్వహించడంతో ఇబ్బందికి గురయ్యా. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పోటీపరీక్షలు నిర్వహించాలి. – రమాదేవి, మల్లేల అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం తగదు గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు తక్కువ సంఖ్యలో ఉన్నందున పట్టణ అభ్యర్థులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ పరీక్షలతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతున్నందున వారి ఇబ్బందులు గమనించి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి మండలంలో ఒక ఆన్లైన్ శిక్షణ కేంద్రం నిర్వహించాలి.– రాంప్రదీప్, ఉపాధ్యాయుడు, గానుగపాడు -
అమ్మా.. ఆకలి!
ఈ విద్యార్థి పేరు లోక్‌నాథ్. గద్వాల మండలం గుర్రంగడ్డ దివి గ్రామం. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజు పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాడు. ఇంటి నుంచి ఉదయం 6గంటలకు పాఠశాలకు బయల్దేరుతాడు. పుట్టిలో కృష్ణానదిని దాటి బీరెల్లి గ్రామం నుంచి బస్సు ద్వారా గద్వాలకు ఉదయం 8.30 గంటల వరకు చేరుకుంటాడు. సాయంత్రం తిరిగి ప్రత్యేక తరగతులు పూర్తయిన వెంటనే 5.45 గంటలకు పాఠశాల నుంచి గ్రామానికి బయల్దేరుతాడు. ఇంటికి చేరుకునే వరకు రాత్రి 7 నుంచి 8 గంటలవుతుంది. పొద్దస్తమానం మధ్యాహ్నం పాఠశాలలో పెడుతున్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకలిని తట్టుకోలేక ఖాళీ కడుపుతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాడు. గద్వాల : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే దిక్కు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మళ్లీ సాయంత్రం గంటన్నరపాటు తరగతులు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దానికి తోడు ఉదయం ఇంట్లో అల్పాహారం అందక పాఠశాలలో ఎవరూ పెట్టక విద్యార్థులు కడుపులు మాడ్చుకొని చదువుకోవాల్సి వస్తోంది. అల్పాహారం అందక అవస్థలు పదో తరగతి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం ఫలితాలు, ఉత్తీర్ణతపై దృష్టిసారించిన విద్యాశాఖ విద్యార్థుల ఆకలిని పట్టించుకోవడంలేదు. విద్యార్థులు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలలోనే గడపాల్సి వస్తుంది. అందరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే కావడంతో అంత ఉదయం వంట చేయడం సాధ్యం కాదు. పరిగడుపుతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు కడుపు మాడ్చుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి పెరగడంతో నీరసించి తరగతిలో విన్న పాఠాలు అర్థంకాని పరిస్థితి ఉంది. గత విద్యా సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వడ్డీ డబ్బుల నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆ అవకాశం లేకపోవడంతో బిస్కెట్లతో సరిపెట్టారు. ప్రస్తుతం ఆ విధానంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పిల్లలు ఆకలితో అవస్థలు పడుతున్నారు. దాతలు సహకరించాలి ఆయా గ్రామాల్లోని దాతలు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సహకరిస్తే చదువుపై దృష్టి సారించి ప్రతిభ కనబరిచే అవకాశముంది. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం విద్యార్థులను పట్టించుకుని అల్పాహారం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంకా నెలరోజుల సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ఎవరైనా దాతలు వస్తే విద్యార్థుల ఆకలి బాధలు తీరుతాయి. ఆకలి తట్టుకోలేక పోతున్నాం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాం. మాకు ఎవరూ ఎలాంటి అల్పాహారం ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క మధ్యాహ్న భోజనం తప్ప కడుపులో ఏమీ ఉండడం లేదు. 8 గంటల పాటు పాఠాలు వినడం వల్ల ఆలసిపోతున్నాం. సాయంత్రం వేళ బాగా ఆకలి వేస్తోంది. తట్టుకోలేకపోతున్నాం. – జ్యోతి, విద్యార్థిని, మెలచేర్వు గ్రామం నిధులు లేవు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం నిధులు రాలేదు. కొన్ని చోట్ల దాతల సహాయంతో అల్పాహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఆయా గ్రామాల్లో దాతలు ముందుకువచ్చి విద్యార్థులకు సహకరించాలి. ఒకవేళ ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అల్పాహారం సమకూరుస్తాం. – వేణుగోపాల్, డీఈఓ -
గ్రామీణ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దండి
– ఉద్యోగ నైపుణ్య భాగ్యాన్ని కల్పించండి – స్కిల్ డెవలప్మెంట్ ట్రై నింగ్‌తో ఉద్యోగాలు సొంతం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి మెరికల్లాగా తయారు చేసే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు స్కిల్‌డెవలప్‌మెంట్‌పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఏడాది కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన 1087 మంది విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్రా తదితర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంలో ప్రిన్సిపాళ్ల పాత్రనే కీలకమన్నారు. వీరు ప్రోత్సాహంతోనే విద్యార్థులు చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు సాధించారన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. సమస్యలను ఏకరవు పెట్టిన ప్రిన్సిపాళ్లు మరోవైపు డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాళ్లు ఏకరవు పెట్టారు. ఆదోని ఏఏస్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు రీయింబర్స్మెంట్ కోసమే కళాశాలలకు వస్తున్నారన్నా విషయంలో వాస్తవం లేదన్నారు. కేవీఆర్ డిగ్రీ కళాశాలలో తరగతి గదులు, హాస్టల్ భవనాలు పాతవి కావడంతో పాములు వస్తున్నాయని, కొత్త వాటి కోసం నిధులు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కోరారు. ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలల నడుపుతున్నామని, ఇక్కడా ఒక్కరే రెగ్యులర్ అధ్యాపకుడు ఉన్నాడని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఇలా ప్రతి కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాళ్లు ఏకరువు పెట్టడంతో సమావేశాన్ని తొందరగా ముగుంచుకొని మంత్రి వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైస్ చాన్సులర్ వై.నరసింహులు, రిజిస్ట్రార్ అమర్నాథ్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణిగాంధీ, స్కిల్ డెవల్‌పమెంట్ స్టేట్ చైర్మన్ గంగా సుబ్బారావు పాల్గొన్నారు.