అమ్మో... ఆన్‌లైన్‌ పరీక్షలు..! | Village Students Worried About Online Exams | Sakshi
Sakshi News home page

అమ్మో... ఆన్‌లైన్‌ పరీక్షలు..!

Published Fri, May 18 2018 1:03 PM | Last Updated on Fri, May 18 2018 1:03 PM

Village Students Worried About Online Exams - Sakshi

తక్కువ ఖర్చుతో స్వల్ప సమయంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించవచ్చనే భావనతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ పరీక్షలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్షలకు కంప్యూటర్‌ నైపుణ్యాలు లేకపోవడం, తగినంత శిక్షణ పొందేందుకు వనరుల లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు నష్టపోతున్నారు.

తిరువూరు: జిల్లాలోని పశ్చిమకృష్ణా ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ఏకొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో కంప్యూటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండట్లేదు. హైస్కూలు స్థాయి నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం కంప్యూటరు విద్య ప్రకటనలకే పరిమితమవుతోంది.  జిల్లాలోని 284 జెడ్పీ హైస్కూళ్లలో లక్షా 10 వేల మంది విద్యార్థులున్నారు.  ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా రెట్టింపు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 10 శాతం మందికి కూడా కంప్యూటర్‌ విద్య అందట్లేదు.

కంప్యూటర్‌ శిక్షణలో వెనుకబాటే...
విద్యాపరంగా ముందంజలో ఉన్న కృష్ణాజిల్లాలో బీటెక్, డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులకు కూడా కంప్యూటర్‌ నైపుణ్యాలు కరువవుతున్నాయి. బీటెక్‌లో ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ, బీఎస్సీ, బీకాంలలో కంప్యూటర్‌ సబ్జెక్టుతో పట్టా పుచ్చుకున్న విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ పరీక్షలు రాయడానికి తడబడే పరిస్థితి నెలకొనడం గమనార్హం.  ఏపీపీఎస్సీ, డీఎస్సీ, టెట్‌ పరీక్షలకు, ప్రభుత్వోద్యోగులు పదోన్నతుల కోసం రాసే డిపార్టుమెంటల్‌ పరీక్షలకు కూడా ఆన్‌లైన్‌ టెస్టులే జరుగుతున్నాయి. ఎడ్‌సెట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, డీసెట్‌ వంటి ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశ పరీక్షలకూ ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. మాక్‌ టెస్టుల పేరుతో ఆయా ఎంపిక సంస్థలు వెబ్‌సైటులో నమూనా పరీక్షలు పెడుతున్నా అభ్యర్థులకు అర్థం కావట్లేదు. ప్రైవేటు వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నా ఉచితంగా లభ్యంకాక పేద విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు.

‘టెట్‌’ గందరగోళంతో మరింత ఆందోళన
2017 టెట్‌లో ప్రైవేటు ఏజెన్సీకి పరీక్ష నిర్వహణను విద్యాశాఖ అప్పగించగా, ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రం కూర్పులో గానీ, వాల్యుయేషన్, రీవెరిఫికేషన్, రెస్పాన్స్‌షీట్ల జారీలో ఫైనల్‌ కీతో సంబంధం లేకుండా గజిబిజిగా ఫలితాలు వెల్లడవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి కూడా టెట్‌పరీక్ష ఆన్‌లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించగా,  ఆఫ్‌లైన్లోనే జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వలె అన్ని పోటీపరీక్షలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పరీ క్షలు నిర్వహిస్తే గ్రామీణ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.  

‘టెట్‌’లో అర్హత సాధించలేకపోయా
టెట్‌ పరీక్ష ఆన్‌లైన్లో నిర్వహించడంతో కంప్యూటర్‌ పరిజ్ఞానం తగినంత లేక అర్హత సాధించలేకపోయా.  టెట్‌ పరీక్షకై పూర్తిస్థాయిలో సిద్ధమైనప్పటికీ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించడంతో ఇబ్బందికి గురయ్యా. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పోటీపరీక్షలు నిర్వహించాలి. – రమాదేవి, మల్లేల

అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం తగదు
గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు తక్కువ సంఖ్యలో ఉన్నందున పట్టణ అభ్యర్థులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌ పరీక్షలతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతున్నందున వారి ఇబ్బందులు గమనించి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి మండలంలో ఒక ఆన్‌లైన్‌ శిక్షణ కేంద్రం నిర్వహించాలి.– రాంప్రదీప్, ఉపాధ్యాయుడు, గానుగపాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement