రాజకీయ వేడి | TRS Party Political Heat In Gadwal | Sakshi
Sakshi News home page

రాజకీయ వేడి

Published Sun, Jun 10 2018 8:34 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

TRS Party Political Heat In Gadwal - Sakshi

రాజకీయ వేడి

సాక్షి, గద్వాల : నడిగడ్డలో రాజకీయం ఊపందుకుంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో తిష్ట వేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న కసితో అధిష్టానం పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే అబ్రహాన్ని పార్టీలో చేర్చుకుని అలంపూర్‌ నుంచి రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు రైతులకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అధికార పార్టీ బలం చేకూర్చనుంది.

అలాగే గద్వాల నియోజకవర్గంలోనూ బలమైన నేత, మాజీ మంత్రి డి.కె.అరుణను ఢీకొని ఎమ్మెల్యే స్థానాన్ని వచ్చే ఎన్నికల్లోనైనా ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ముందుకు సాగుతోంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. పంచాయతీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరికలకు తెరతీస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను టీఆర్‌ఎస్‌ అనువుగా మార్చుకుంటుండగా.. అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. 

మంత్రి జూపల్లి ప్రత్యేక దృష్టి 
ఈసారి జిల్లాలో ఏవిధంగానైనా సరే తమ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ముందుకు కదులుతోంది. దీనికోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించారు. నడిగడ్డలో గెలుపు గుర్రాలను సిద్ధం చేసి ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలన్న తపనలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచన మేరకు మాజీ ఎంపీ మందా జగన్నాథానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చారు. సౌమ్యుడిగా, ప్రజల్లో మంచిపేరున్న మాజీ ఎమ్మెల్యే అబ్రహాన్ని అధికార పార్టీలో చేర్చుకుని అలంపూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో పెట్టాలని నిర్ణయించారు. మరోవైపు అధికార పార్టీకి దీటుగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తన స భ్యత్వాన్ని రద్దు చేసిన అంశాన్ని, హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ గన్‌మెన్లను కే టాయించకపోవడం, ఎమ్మెల్యేగా గుర్తించకపోవ డం తదితర అంశాలను, టీఆర్‌ఎస్‌ విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

సద్దుమణిగిన విభేదాలు 
ఇక పార్టీలో ఉన్న విభేదాలను సద్దుమణిగించడంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఇటీవల రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నిండు సభలోనే కృష్ణమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న మిగతా వారిలో ఆశలు సన్నగిల్లాయి. అలాగే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తూ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతుబంధు పథకాన్ని అనువుగా మార్చుకుని ప్రతి గ్రామంలోనూ హడావుడి చేస్తున్నారు. క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతూ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారు.

ఇదిలాఉండగా సీనియర్‌ నేతగా, ప్రతిపక్ష పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండి, బలమైన నాయకురాలిగా గద్వాలకు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా పేరొందిన మాజీ మంత్రి డి.కె.అరుణ సైతం నడిగడ్డలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్‌లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా వ్యవహరిస్తూ వైఫల్యాలను ఎండగడుతూ ఢీ అంటే ఢీ అనే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

వరాలు కురిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం నడిగడ్డకు వరాలు కురిపిస్తోంది. అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో రూ.783కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పనులను వేగవంతంగా చేసింది. అలాగే గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.26కోట్లు, ముదిరాజ్, వాల్మీకి, మున్నూరుకాపు, కుర్వ సంఘం కమ్యూనిటీ భవనాలకు రూ.50లక్షల చొప్పున కేటాయించింది. ముస్లింల కోసం ఈద్గా అభివృద్ధికి రూ.2.25కోట్లు కేటాయించి ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం, సీసీరోడ్ల నిర్మాణానికి జిల్లాకు రూ.40కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.

గట్టు, ధరూరు, కేటిదొడ్డి మండలాల ప్రజలకు సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్న గట్టు ఎత్తిపోతల పథకానికి రూ.553.98కోట్లు విడుదల చేసింది. రైతుబంధు పథకం ద్వారా రైతాంగానికి మరింత చేరువయ్యేందుకు అధికార పార్టీ నేతలకు అవకాశం కలిగింది. చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పం పిణీ ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణాన్ని త లపించేలా సభలు ఏర్పాటు చేయడంతోపాటు ఇ తర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు. నామినేటెడ్‌ పోస్టులను ఎక్కువ జనాభా కలిగిన సామాజిక వర్గాలకు కేటాయించడం వారికి కలిసొచ్చే అంశం.   

ప్రజల అభిప్రాయంతోనే టీఆర్‌ఎస్‌లోకి...మాజీ ఎమ్మెల్యే అబ్రహం 
అలంపూర్‌ : నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే టీఆర్‌ఎస్‌లో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్‌చౌరస్తాలో విలేకరులతో ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అలంపూర్‌ నియోజకవర్గ నాయకులతోపాటు గద్వాలకు వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో జోగుళాంబ ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ అల్లాభ„Š , యువ నాయకులు కిశోర్, తేజ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement