
సాక్షి, అనంతపురం : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. తాగునీటి సమస్యను తెలియజేస్తూ మహిళలు ఖాళీ బిందలతో ఆయన ముందు నిరసన తెలిపారు. నియోజవర్గంలోని చిలమత్తూరులో శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చాలా మంది మహిళలు తమ సమస్యలు తెలియజేయడానికి రాగా.. వారిని పట్టించుకోకుండా ఆయన ప్రసంగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాగు నీటి సమస్యను విన్నవించేందుకు ఖాళీ బిందెలతో వచ్చిన మహిళల నుంచి సీఐ వెంకటేశ్వర్లు వాటిని లాక్కున్నారు. సీఐ, ఎమ్మెల్యే తీరుపై నియోజక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.