N Balakrishna
-
అప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా? బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, తిరుపతి: ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. బాలకృష్ణను చూస్తే బాధకరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా?.. ఇప్పుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెడుతానంటున్నారని విమర్శించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అభివృద్ధి చేస్తామని..సీఎం జగన్, కొడాలి నాని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్క్రిప్ట్‌లు మానేసి.. ఎన్టీఆర్ కొడుకుగా ఒక డైనమిక్ లీడర్‌గా ముందుకొచ్చి టీడీపీ కార్యకర్తలను కాపాడండని అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా శనివారం మాట్లాడుతూ.. ‘తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి ఉంటే, ఎన్టీఆర్‌గారు చనిపోయినప్పుడు బాలకృష్ణగారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని వాడుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, వాళ్లను ఏ విధంగా బయటపడేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరంగా ఉంచిన చంద్రబాబు, మళ్లీ తన అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా చూశాం. చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని నిమ్మకూరు అభివృద్ధి, ఈరోజు బాలకృష్ణ అక్కడకు వెళ్ళి, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టామని చెప్పడం అమాయకమా? మరొకటా అనేది అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా బాలకృష్ణగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్‌ను గౌరవిస్తామని సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. అందుకు నిదర్శనంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగింది. అందుకు ముందుగా ఎన్టీఆర్ కుటుంబం వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలి’ అని మంత్రి రోజా అన్నారు. చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు -
బాలకృష్ణపై మహిళల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. తాగునీటి సమస్యను తెలియజేస్తూ మహిళలు ఖాళీ బిందలతో ఆయన ముందు నిరసన తెలిపారు. నియోజవర్గంలోని చిలమత్తూరులో శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చాలా మంది మహిళలు తమ సమస్యలు తెలియజేయడానికి రాగా.. వారిని పట్టించుకోకుండా ఆయన ప్రసంగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాగు నీటి సమస్యను విన్నవించేందుకు ఖాళీ బిందెలతో వచ్చిన మహిళల నుంచి సీఐ వెంకటేశ్వర్లు వాటిని లాక్కున్నారు. సీఐ, ఎమ్మెల్యే తీరుపై నియోజక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘చెప్పడం కాదు.. చేసి చూపిస్తాం’
హిందూపురం : సినిమాల్లో చెప్పడానికే పరిమితం కాదు.. దాన్ని చేసి చూపించే సత్తా తమకే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన మంగళవారం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో నాలుగు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజలు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు. -
వెంకయ్యతో బాలయ్య భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడితో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని బాలకృష్ణ ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని కోరారు. ఈ మేరకు వెంకయ్యకు బాలకృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఉత్సవానికి హాజరయ్యేందుకు వెంకయ్య సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే పలువురు కేంద్రమంత్రులను బాలకృష్ణ కలసి ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనం నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. -
జీవన విధానం మార్చుకుంటే చాలు...
హైదరాబాద్ : ప్రజల జీవన విధానాన్ని మార్చుకుంటే చాలు... కేన్సర్‌ను జయించవచ్చని టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో నూతన సంవత్సర వేడుకల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సర్వేకల్ కేన్సర్‌పై అవగాహాన, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
'నేను రాష్ట్ర నాయకుడిని'
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ నగర శివారులలో టీడీపీ మహానాడు గురువారం రెండో రోజు ప్రారంభమైంది. నేడు ఎన్టీఆర్ 92వ జయంతి కూడా కావడంతో ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... పేదవాడి కనీస అవసరాలు తీర్చిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పేద వాడి కనీస అవసరాలు తీర్చిన గొప్ప నేత అని ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అభివర్ణించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించారని బాలకృష్ణ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని బాలకృష్ణ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. నేను హిందూపురానికే పరిమితమైన నాయకుడిని కాదని... రాష్ట్ర నాయకుడినని బాలకృష్ణ స్పష్టం చేశారు.