'నేను రాష్ట్ర నాయకుడిని'
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ నగర శివారులలో టీడీపీ మహానాడు గురువారం రెండో రోజు ప్రారంభమైంది. నేడు ఎన్టీఆర్ 92వ జయంతి కూడా కావడంతో ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... పేదవాడి కనీస అవసరాలు తీర్చిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పేద వాడి కనీస అవసరాలు తీర్చిన గొప్ప నేత అని ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు.
బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అభివర్ణించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించారని బాలకృష్ణ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని బాలకృష్ణ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. నేను హిందూపురానికే పరిమితమైన నాయకుడిని కాదని... రాష్ట్ర నాయకుడినని బాలకృష్ణ స్పష్టం చేశారు.