విషవృష్టి యాగం..! | Vardhelli Murali Article On TDP Mahanadu | Sakshi
Sakshi News home page

విషవృష్టి యాగం..!

Published Sun, May 29 2022 12:34 AM | Last Updated on Sun, May 29 2022 7:41 AM

Vardhelli Murali Article On TDP Mahanadu - Sakshi

చెప్పాలని ఉంది... గొంతు విప్పాలని ఉంది. తెలుగుదేశం పార్టీ నలభయ్యేళ్ల ప్రస్థానం గురించీ, ఆ ప్రయాణంలోని మలుపుల గురించీ ఇప్పుడు క్లుప్తంగానైనా మాట్లాడుకోవాలి. తాజాగా ఆ పార్టీ ‘మహానాడు’ పేరుతో ఓ విషవృష్టి యాగాన్ని నిర్వహిం చింది. ఆ విబూదిని రాష్ట్రమంతటా చల్లక ముందే... తొలకరి వర్షాలతో కలిపి అది విషపు చుక్కల్ని కురిపించకముందే... విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఆ పార్టీని పెట్టిన ఎన్టీ రామా రావుకు ఇది శతజయంతి సంవత్సరం. పార్టీ వయసు 40 సంవత్సరాలు. అందువల్ల కూడా ఇది మాట్లాడుకోవలసిన సందర్భం.

పదేళ్ల కింద వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూటికి 70 మంది నలభయ్యేళ్ల లోపువారే. కనుక తెలుగు రాష్ట్రాల్లోని నూటికి డెబ్బయ్‌ మందికి తెలుగుదేశం పార్టీ ప్రయాణంలోని పదనిసల గురించిన లోతైన అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఆ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసు కొచ్చిన ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ణి చేసి చంద్రబాబు 27 సంవత్సరాల క్రితం గద్దెనెక్కాడు. ఇప్పుడు నలభయ్యేళ్లున్న వారు కూడా అప్పటికింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ‘మహా నాడు’ హంగామాలను చూసి తెలుగుదేశం నాయకులంతా ఎన్టీ రామారావు శిష్యులనీ, భక్తులనీ, అనుచరులనీ వారు భ్రమించే అవకాశం ఉన్నది. అనారోగ్య కారణాలతో ఎన్టీ రామారావు తప్పుకొని స్వయంగా ఆయనే చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించాడని యెల్లో మీడియా కథలల్లడానికి ఇంకెంతో కాలం పట్టదు. అందువల్ల ఈ నలభయ్యేళ్ల కథను ఖుల్లం ఖుల్లా చెప్పుకోవాలి.

రెక్కల గుర్రంపై ఎగిరొచ్చే కలల రాకుమారుడి కథలాంటిది ఎన్టీ రామారావు సినీ జీవితం. జానపదుల జనరంజక కథా నాయకుడు. దేవతామూర్తుల పాత్రల్లో ఒదిగిపోయిన స్ఫుర ద్రూపం. అద్భుతమైన నటపాండిత్యం. వెరసి తెలుగు నిఘంటు వులో హీరో అనే మాటకు అర్థం అతను. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు’ అనే బిరుదును ఆయన అభిమానులు ఇవ్వలేదు. భజన బృందం తగిలించింది కాదు. శృంగేరీ పీఠానికి సంబంధించిన యతీశ్వరులు స్వయంగా చేసిన ప్రశంస అది. ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే ఎన్టీఆర్‌ సినిమాలు రాబట్టిన కలెక్షన్లు ఇప్పటికీ రికార్డులే! ఒక డజన్‌ సూపర్‌ డూపర్‌ హిట్స్‌తో ఆయన తన 60వ ఏట సినీరంగం ఇన్నింగ్స్‌ను ముగించారు. ఇంతటి ప్రజాదరణ ఉన్నది కనుకనే తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను రాజకీయాల్లో పరీక్షించుకోదలుచుకున్నారు.

రాజకీయాల్లో నెగ్గుకురావడానికి ప్రజాదరణ ఒక్కటే సరిపోదు. పరిస్థితులు కూడా కలిసిరావాలి. ఎన్టీఆర్‌ను అదృష్టం వరించింది. ఆ సమయానికి పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత ఏర్పడుతున్నది. బలమైన ప్రతిపక్షం లేని రాజకీయ శూన్యత ఆవరించి ఉన్నది. అప్పటి పత్రికా రంగం నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అసలే ఎన్టీఆర్‌. ఆపై రోడ్డెక్కారు. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పదజాలం కత్తులు దూసింది. రాజకీయాల్లోకి కొత్త నరేటివ్‌ వచ్చి చేరింది. ఈ మార్పు జనానికి కూడా నచ్చింది. ఫలితంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి సూపర్‌హిట్‌ ఎన్టీఆర్‌ ఖాతాలో వచ్చిపడింది.

స్వాతంత్య్రోద్యమ కాలంలో చదువుకున్నవాడు కాబట్టి ఎన్టీ రామారావుపై జాతీయ భావాలు, ఆదర్శాల ప్రభావం కొంత ఉన్నది. నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ (ఎన్‌ఏటి) పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి ప్రదర్శనలిచ్చేవారు. విద్యార్థి రోజుల నుంచే కష్టపడి సంపాదించుకునే తత్వం. సినిమాల్లో కూడా రేయింబవళ్లు పనిచేశారు. ఏటా పది పన్నెండు సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి హీరో ఎన్టీఆర్‌ తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. ఆయన పోషించిన వందలాది ఉదాత్త, జనోద్ధారక పాత్రల ప్రభావం కూడా ఉండేది. ముఖ్యమంత్రిగా పరిపాలనలో పేదలకు, కష్టజీవులకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. చౌకబియ్యం ఇవ్వడంతోపాటు రైతుల విద్యుత్‌ ఛార్జీలను తగ్గించారు. పాలనా సంస్కరణలను ప్రారంభించారు.

మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్‌ – పట్వారీ లేదా కరణం – మునసబుల వ్యవస్థ రద్దు – ఈ సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఎన్టీ రామారావు అనుసరించిన పేదల అనుకూల విధా నాలపై తెలుగుదేశం పార్టీలోనే కొందరు ముఖ్యులకూ, పార్టీకి అండగా నిలబడిన మీడియా మొగల్స్‌కూ సదభిప్రాయం లేదన్న సంగతి తదనంతర కాలంలో బయటపడింది. సదరు మీడియా మొగల్స్, బిజినెస్‌ మౌర్యాస్, సంపన్న నిజామ్స్‌.... అంతా కలిసి చంద్రబాబు రింగ్‌ లీడర్‌గా ఒక ముఠాను తెలుగుదేశం పార్టీలో తయారుచేసుకున్నారు. ’89 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఈ ముఠా పట్టు బిగిసింది. పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో ఉండే అన్ని కమ్యూనికేషన్‌ చానల్స్‌ ఈ ముఠా అధీనంలోకి వచ్చాయి.

వయోధిక దశలో ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్‌కు సహాయ కురాలిగా ఉన్న లక్ష్మీపార్వతి మరో కమ్యూనికేషన్‌ చానల్‌గా మారవచ్చని ముఠా శంకించింది. ఆమెపై దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమెకు వ్యతిరేకంగా మెదళ్లలో విష బీజాలు నాటి కన్నబిడ్డల్ని సైతం ఎన్టీఆర్‌కు దూరం చేశారు. తనకు తోడుగా ఉన్నందుకు నిందలు మోస్తున్న మహిళకు అండగా నిలవడమే తన తక్షణ ధర్మంగా ఎన్టీఆర్‌ భావించారు. తిరుపతి బహిరంగ సభలో వేలాదిమంది సమక్షంలో ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.

ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబు ముఠా పార్టీపై ఎందుకు పట్టు బిగించిందో, నాయకుని కమ్యూనికేషన్‌ ఛానల్స్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నదో, లక్ష్మీపార్వతిని వెళ్లగొట్టడానికి ఎందుకు ప్రయత్నించిందో... 94 ఎన్నికల తర్వాత అర్థమైంది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు కొంతమేరకే ఉపయోగం తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం సాధ్యపడదని బాబు అండ్‌ మొగల్స్‌ ముఠాకు అవగాహన ఉన్నది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి. అందుకోసం టిక్కెట్లలో సింహభాగం తమ నమ్మకస్థులకే దక్కాలి. ఇదీ కుట్ర. అయితే చివరి దశలో ఎన్టీఆర్‌ అప్రమత్తం కావడంతో కొంతమేరకు మాత్రమే వారి ఎత్తుగడ ఫలించింది. పైగా అరకొర మెజారిటీ కాకుండా ఎన్టీఆర్‌కు అఖండ విజయం సిద్ధించింది. కుట్ర అమలుకు కొన్ని నెలలు ఎదురు చూడవలసి వచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు నమోదు చేసిన నెలరోజులకే యెల్లో మీడియా ఎజెండాను పైకి తీసింది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్టు, కార్యకర్తలతో దూరం పెరిగినట్టు ప్రచారం మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే వ్యతిరేకత ఎట్లా వచ్చిందనే ప్రశ్నకు ఇక్కడ తావుండదు. యెల్లో మీడియా వార్తలకు తర్కంతోగానీ, హేతువుతోగానీ, వాస్తవికతతో గానీ సంబంధం ఉండదు. వేడివేడి బజ్జీలు వేయడం మార్కెట్లోకి వదలడం మాత్రమే దానికి తెలిసిన విద్య. ప్రచారం పీక్స్‌కు చేరగానే తాము టిక్కెట్లి ప్పించగా ఎన్టీఆర్‌ వేవ్‌లో గెలిచిన ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను ఈ ముఠా వైస్రాయ్‌ హోటల్‌కు పంపించేసింది.

ఆ వెంటనే ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా 70 మంది ఎమ్మెల్యేలు ఆ హోటల్లో సమావేశమయ్యారని ప్రచారం మొదలుపెట్టారు. గంటగంటకూ ఆ స్కోర్‌ పెంచుతూపోయారు. ఏం జరుగుతోందో చూసి వెళ్దామని వచ్చిన ఎమ్మెల్యేలను అక్కడే బంధించారు. కొందర్ని బెదిరించి పిలిపించారు. మీడియా సహకారంతో తెల్లారేసరికల్లా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. గవర్నర్‌ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్టీఆర్‌ పిలిచి టిక్కెట్టిచ్చి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసి, స్పీకర్‌ను చేసిన యనమల ఎన్టీఆర్‌కు మాట్లాడే హక్కును సైతం తృణీకరించారు. సైకిల్‌ గుర్తు, టీడీపీ జెండా, బ్యాంక్‌ డిపాజిట్లతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదనీ, అవన్నీ బాబు పార్టీకి చెందుతాయనీ హైకోర్టు కూడా చెప్పేసింది.

ఎదురుగా వెళ్లే ధైర్యం లేక వృద్ధసింహాన్ని మోసపూరితంగా బంధించి బోనులో పెట్టారు. తనవాళ్లే తనకు ద్రోహం చేయడాన్ని ఊహించలేకపోయిన ఎన్టీఆర్‌ షాక్‌కు గురయ్యారు. మనోవేదనతో కృశించి అనతికాలంలోనే ఆయన చనిపోయారు. ఆయన ఇంకొంతకాలం జీవించి ఉంటే ఈ ముఠాకు గుణపాఠం చెప్పి ఉండేవారు. ’94 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ అండతో రెండు కమ్యూనిస్టు పార్టీలూ కలిసి 32 సీట్లు గెలుచుకున్నాయి. 1962 తర్వాత కమ్యూనిస్టులు ఇన్ని సీట్లు గెలిచిన సందర్భం మొదటి  సారి, చివరిసారి కూడా ఇదే! అయినా ఆ పార్టీలు కృతజ్ఞత చూపెట్టలేదు. టీడీపీ ఆంతరంగిక వ్యవహారమని ముఖం చాటేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు మద్దతు ప్రకటించాయి. కమ్యూనిస్టులు తన సహజ మిత్రులనీ, తనకు బావగార్ల వరసవుతారనీ ఎన్టీఆర్‌ ఆప్యాయంగా చెప్పు కున్నారు. ఆ బావల నిర్వాకం చూసి ఆయన అవాక్కయ్యారు. కృత్రిమ సంక్షోభం తలెత్తిన వెంటనే కమ్యూనిస్టులు ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికావాళ్లు జపాన్‌పై వేసిన ఆటమ్‌ బాంబ్‌తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తి కలిగిన హైడ్రోజన్‌ బాంబులు ఇప్పుడున్నాయి. ఎన్టీఆర్‌ మీద యెల్లో ముఠా చేసిన కుట్రను ఆటమ్‌ బాంబుతో పోల్చితే, అదే ముఠా సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద అమలుచేస్తున్న కుట్రను హైడ్రోజన్‌ బాంబుతో పోల్చ వచ్చు. 27 ఏళ్ల కిందట కుట్రపూరితంగా అధికారం చేపట్టిన ఈ ముఠా ఆ కుట్రలూ కుహకాల్లో ఆరితేరి హైడ్రోజన్‌ బాంబులు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రజాసంక్షేమం, ప్రజల వద్దకు పాలన, బలహీన వర్గాల సాధికారత అనే అంశాల్లో ఎన్టీఆర్‌ నలభయ్యేళ్ల కింద ఒక అడుగువేస్తే ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి 40 అడుగులు వేశారు. ఈ విధానాలకూ, యెల్లో ముఠాకూ అస్సలు పొసగదు. ఈ ముఠాకు తన వర్గ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు అండ్‌ కో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ముఠాకు ఎనిమీ నెంబర్‌ వన్‌.

జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని, సామర్థ్యాన్ని, కమిట్‌ మెంట్‌నూ అందరికంటే ముందుగానే ఈ ముఠా గుర్తించింది. అందుకే ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి తప్పుకోవడానికి ముందే ఆ పార్టీ అధిష్ఠానంతో చేతులు కలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో షరీకై తప్పుడు కేసులు మోపడానికి రంగం సిద్ధం చేసింది. జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే కేసుల కుట్రను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ ఆజాద్‌ ఒక బహిరంగ సభలోనే అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మేము జగన్‌మోహన్‌ రెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఆఫర్‌ చేశాము.

కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము. మాట వినకపోతే జైలుకు పోవలసి వస్తుందని కూడా చెప్పాము. అయినా మాట వినలేదని ఆజాద్‌ అన్నారు. మాట వింటే అందలమెక్కిస్తాం, వినకపోతే జైలుకి పంపిస్తామని సాక్షాత్తూ ఢిల్లీ సామ్రాజ్ఞి చెప్పినా జగన్‌మోహన్‌ రెడ్డి వినకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కావలసింది సమాచారం కాదు. కామన్‌సెన్స్‌! జైలుకు పంపించే తప్పేమీ తాను చేయలేదని తన అంతరాత్మకు తెలుసు గనుక ఆయన పెద్దల బెదిరింపులకు జంకలేదు. తన ప్రయాణాన్ని తాను ఎంచుకున్నారు.

ఆనాటి నుంచీ గడిచిన పదకొండేళ్లుగా యెల్లో ముఠా తన సర్వశక్తుల్నీ జగన్‌మోహన్‌ రెడ్డి పైనే కేంద్రీకరించింది. ఈ కాలంలో ఆయన మీద విష ప్రచారానికి కేటాయించిన న్యూస్‌ ప్రింట్‌నంతా ఒక పక్కన పడేసి వుంటే ఆ రెండు పత్రికలకు ఇంకో ఏడాదిపాటు ఆ న్యూస్‌ ప్రింట్‌ సరిపోయేది. విష ప్రచారాలతో, పొత్తుల ఎత్తులతో, నెరవేర్చని హామీలతో 2014 ఎన్నికల్లో జగన్‌ పార్టీని ఈ కూటమి ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడించగలిగింది.

దీనికి సమాధానంగా వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికల్లో 10 శాతం ఓట్ల తేడాతో టీడీపీని ఓడించింది. ఇది జగన్‌మోహన్‌ రెడ్డి ఒంటి చేత్తో 50 శాతం ఓట్లను సంపాదించి సాధించిన విజయం. ఈ విజయంతో పోల్చదగిన విజయాలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో రెండే రెండున్నాయి. ఒకటి కమ్యూ నిస్టులతో పొత్తు పెట్టుకొని 1994లో ఎన్టీఆర్‌ సాధించిన గెలుపు. రెండోది బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో సాధించిన గెలుపులో ఇందిరమ్మ ప్రభంజనం వీస్తున్న సమయంలో 1972లో కాంగ్రెస్‌ సాధించిన అసెంబ్లీ విజయం. అప్పుడు కాంగ్రెస్‌కు బలమైన ప్రతిపక్షం కూడా లేదు. ఇండిపెండెంట్లే ప్రతిపక్షం.

మూడేళ్ల కిందట జగన్‌మోహన్‌ రెడ్డి సాధిం చిన కళ్లు చెదిరే విజయం కంటే కూడా ఆయన పరిపాలనా దక్షత యెల్లో కూటమికి ఎక్కువ కలవరపాటును కలిగిస్తున్నది. సామాజిక ఆర్థిక మార్పు సాధనంగా ఆయన రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్న తీరుకు దేశవిదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది.

మహిళలూ, బలహీన వర్గాల సాధికారత విషయంలో జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలబడింది. రెండేళ్ల పాటు కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ఒక అధ్యయనాంశంగా మారింది. ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని, ఆర్‌బీకేల పనితీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు బృందాలుగా ప్రతినిధులు వచ్చిపోతున్నారు. ఊరి స్వరూపం మారుతున్నది. ప్రతి పల్లె పట్టణ సొబగులను అద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో సహజంగానే వైఎస్సార్‌సీపీ బలం గత ఎన్నికల కంటే ఇప్పుడు పెరిగింది.

యథాతథంగా ఎన్నికలు జరిగితే వైసీపీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. ఇతర పార్టీలతో జట్టు కట్టినా సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీకి యాభై శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌ బలం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం లోకి రావడం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే అడ్డదారులు తొక్కడానికి సిద్ధపడింది. పాతమిత్రుల ప్రత్యక్ష, పరోక్ష సహకారాలతో సామాజిక విభజన కార్యక్రమానికి చాలాకాలం కిందనే శ్రీకారం చుట్టింది. పేద వర్గాల ప్రజ లందరూ ఒకవైపున సంఘటితం కాకుండా కులాల పేరున, మతాల పేరున విడిపోయి విద్వేషాలను విరజిమ్ముకొనేలా రెచ్చగొట్టే పథకానికి తెరతీసింది. ఎక్కడెక్కడ అటువంటి అవకాశాలుంటాయో పరిశీలించడానికి గతంలోనే కొన్ని రెక్కీలను నిర్వహించారు. కోనసీమలోని అంతర్వేదితో ఒక రెక్కీ ఆపరేషన్‌ జరిగింది. రామతీర్థంలో రెక్కీ జరిగింది. గుంటూరులో జిన్నా టవర్స్‌ పేరుతో ఒక రెక్కీ జరిగింది. ఇప్పుడు కోనసీమలో ఒక యాక్షన్‌ అమలుచేశారు.

కోనసీమలో దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రకులాల వాళ్లు తరతరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. వ్యావసాయికంగానే కాక విద్యాపరంగా కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ అభివృద్ధి అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. చిన్న చిన్న తగాదాలు, వ్యక్తిగత పంచాయతీలు, పంతాలు పట్టింపుల వంటివి మాత్రమే వివిధ వర్గాల మధ్య పొడసూపుతున్నాయి. అప్పుడప్పుడు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇవేమీ పరిష్కరించ లేనంత తీవ్రమైన సమస్యలు కావు. కానీ వీటినే ఆసరా చేసుకొని ఇక్కడ విషం చిమ్మే క్రీడను ఈ కూటమి ప్రారంభించింది.

ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో వేళ్లన్నీ అటువైపే చూపు తున్నాయి. ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దళితులకూ – ఇతర కులాలకూ మధ్య, బీసీలకూ – ఇతరులకూ మధ్య, మైనారిటీలకూ – ఇతరులకూ మధ్య కృత్రిమ సమస్యలు సృష్టించి చిచ్చుపెట్టే వికృత క్రీడను ప్రారంభించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా, వినాశకరంగా పరిణ మించబోతున్న ఈ పాపాన్ని ప్రజలంతా ఉమ్మడిగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. శనివారం నాడు ఒంగోలులో జరిగిన ‘మహానాడు’లో పాలక పార్టీపై విద్వేషాన్ని రెచ్చ గొట్టడం తప్ప పేదవర్గాలను సాధికారం చేయగల ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయారు.

కోనసీమకు అంబేడ్కర్‌ పేరుపై తన వైఖరేమిటో చెప్పకుండా నిజస్వరూపాన్ని చూపెట్టారు. ఇదొక హెచ్చరిక. సాధించిన విజయాలను నిలబెట్టుకోవడానికి పేద వర్గాలు సంఘటితం కావలసిన అవసరం ఉన్నది. బలహీన వర్గాల నాయకుల బస్సు యాత్రలు ఆహ్వానించవలసిందే! కానీ అదే చాలదు. పేదవర్గాల ప్రజ లందరూ ఐకమత్యంగా గ్రామగ్రామానా చైతన్య యాత్రలు జరపవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక – సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయవలసి ఉన్నది. అన్ని కులాలు, వర్గాల మధ్య సమైక్యతనూ, సౌభ్రాతృత్వాన్నీ నిలబెట్టవలసి ఉన్నది.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement