నార్నూర్ : వేసవి కాలం ప్రారంభానికి ముందే గిరిజన గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొంది. తాగు నీటి సౌకర్యం లేక బిందేడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కారించాలని 40 ఏళ్లుగా వెడుకుంటున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారని సుంగాపూర్ తండా, కొలాంగూడ, గోండుగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు. మూడు గుడాలకు కలిపి కొలాంగూడలో ఒక్కటే చేతిపంపు ఉంది. గత 40 ఏళ్లుగా నీటి సమస్య ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా ఒక చేతి పంపు నీటిని మూడు గూడాల గిరిజనులు వాడుకుంటున్నారు. ఒక చేతి పంపు మీద దాదాపు 500 కుటుంబాలు ఆధారపడాల్సి వస్తోంది.
నీటి కోసం తప్పని గోస...
చోర్‌గావ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుంగాపూర్ తండా 200, కొలాంగూడలో 150, గోండుగూడలో 160 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మూడు గూడాలకు నీటి సౌకర్యం లేదు. కొలాంగూడలోని ఒక చేతి పంపు వద్ద బారులు తీరి నీటిని పట్టుకుంటారు. బిందేడు నీటి కోసం గంట ఆగాల్సి వస్తొందని గిరిజన మహిళలంటున్నారు. నీటి కోసం గోడవలు సైతం అవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య తీర్చాలని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం పైపులైన్ పనులు కూడా మొదలపెట్టలేదని గిరిజనులంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి మూడు గూడాలకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు.
చాలా గోసైతాంది...
మాకు తాగటానికి నీళ్లు లేవు. నీటి కోసం చాలా గోసైతాంది. రోజు బిందే నీటి కోసం గంట ఆగాల్సి వస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోవాలి. మా ఊళ్లకు నీటి సౌకర్యాన్ని కల్పించాలి. మా గోసను తీర్చాలి. నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలి.
– కొడప నాగు, సుంగాపూర్
ఒక చేతిపంపుతో ఇబ్బంది..
మూడు గూడాలకు ఒక చేతి పంపు మాత్రమే ఉంది. తాగడానికి స్నానానికి ఇక్కడి నుంచే నీటిని తీసుకువెళ్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిందేలతో బారులు తీరాల్సి వస్తోంది. బిందేడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
– అయ్యుబాయి, కొలాంగూడ
నీటి సమస్య తీర్చాలి...
గత 40 ఏళ్లుగా నీటి కోసం ఆరిగోస పడుతూనే ఉన్నాం. అధికారులు, జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎండకాలంలో ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్‌ల ద్వారా నీటి సరపరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. శాశ్వతంగా పరిష్కరించాలి.
– గణేష్, గిరిజన నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment