కోసిగి మండలం చింతకుంటలో బోరు వద్ద గుమిగూడిన గ్రామస్తులు
కర్నూలు(అర్బన్): వేసవి రాకముందే జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మెజారిటీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనివల్ల తాగునీటి సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 562.14 మిల్లిమీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 294.34 మి.మీ. కురిసింది. ఈ నేపథ్యంలో అనేక గ్రామాల్లో బిందెడు నీటి కోసం రెండు, మూడు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికితోడు ఆయా గ్రామాల్లో గతంలో ఎప్పుడో నిర్మించిన వాటర్ ట్యాంకులు విస్తరించిన గ్రామాల పరిధికి అనుగుణంగా నీటిని అందించలేకపోతున్నాయి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్యాంకుల నిర్మాణం కూడా చేపట్టడం లేదు. ఈ కారణంగానూ గ్రామీణులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదీతీర గ్రామాల్లోని ప్రజలను సైతం నీటి సమస్య వేధిస్తోంది. పనుల కోసం కాకుండా నీటి కోసం వ్యవసాయబోర్లు, బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. మేజర్ గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోనూ సమస్య అధికమవుతోంది. నిన్నటి వరకు కోడుమూరు మేజర్ పంచాయతీలో పది రోజులకు ఒకసారి నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీకి విడుదల చేయడంతో వారానికి రెండు సార్లు సరఫరా చేయగలుగుతున్నారు. గాజులదిన్నె నీరు కూడా హంద్రీకి డిసెంబర్ 15 వరకు మాత్రమే విడుదలయ్యే సూచనలుకనిపిస్తున్నాయి. అప్పటిలోపు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే తిరిగి కష్టాలు తప్పవు. వెల్దుర్తి మేజర్ పంచాయతీలో నీటి సరఫరా పరిస్థితి తాత్కాలికంగా కొంత మెరుగైనా, అనేక వార్డుల్లో ఇంకా కష్టాలు తీరలేదు. ఇదే మండలంలోని క్రిష్ణాపురం, కలుగొట్ల గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
9 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా
ఇప్పటికే జిల్లాలోని తొమ్మిది ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదోని డివిజన్‌లోని ఆరేకల్, తొగలగల్లు, దొడగొండ, బైలుపత్తికొండ, రాళ్లదొడ్డి, మూగతి, కర్నూలు డివిజన్‌లోని కే నాగులాపురం, కాజీపేట, చౌట్కూరు ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. డోన్ సబ్ డివిజన్ పరిధిలోని ఆవులదొడ్డి, రాచెర్ల గ్రామాలకు హైరింగ్ (బోర్లను అద్దెకు తీసుకుని) ద్వారా నీటిని అందిస్తున్నారు.
నాలుగున్నరేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం
నంద్యాల వాటర్ స్కీం పనిచేయకపోవడంతో నాలుగున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. వాడుకునేందుకు నీటిని సమీపంలోని వ్యవసాయ బోర్లు, బావుల నుంచి తెచ్చుకుంటున్నాం. తాగునీరు మాత్రం ప్రతి రోజు డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు.– కె.నాగన్న, మాజీ సర్పంచ్, మల్లాపురం
Comments
Please login to add a commentAdd a comment