
అలా నిండి.. ఇలా ఖాళీ!
♦ కాగ్నాలో వరదనీటికి పడని అడ్డుకట్ట
♦ కర్ణాటకకు తరలిపోతున్న వరద జలాలు
♦ చెక్‌డ్యాం కిందిభాగం నుంచి లీకేజీలు!
♦ మట్టికట్ట కోతకు గురికావడంతో ఇబ్బంది
♦ షీట్‌ఫైలింగ్ పనుల కోసం ప్రతిపాదన
♦ ఇప్పటికే డ్యాం పనులు 90శాతం పూర్తి
♦ కాంట్రాక్టర్‌కు రూ.8.50 కోట్ల చెల్లింపులు
♦ ప్రభుత్వం వద్ద రీ డిజైన్ ఫైల్ పెండింగ్
కాగ్నా నదిలోకి వర్షపు నీరు అలా వచ్చి ఇలా కిందకు వెళ్లిపోతోంది. వర్షాకాలంలో కర్ణాటకకు వృథాగా తరలిపోతున్న వరదజలాలను వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాగ్నాపై ఆనకట్ట (చెక్‌డ్యాం) నిర్మించారు. అయితే కోట్లు వ్యయం చేసినా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేరలేదు.
తాండూరు : తాండూరు వద్ద కాగ్నా నదిపై ఏడాదిన్నర క్రితం సుమారు రూ.8.50 కోట్లతో చెక్‌డ్యాం పనులను సాగునీటి పారుదల శాఖ అధికారులు చేపట్టారు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో కాగ్నా పరీవాహక ప్రాంతంలో సుమా రు తొమ్మిది వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు తాండూరు పట్టణానికి తాగునీటిని అందించొచ్చు. 12 శాతం లెస్‌తో ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ సుమా రు 90 శాతం పనులు పూర్తి చేశారు. మొత్తం డబ్బు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగిపోయాయి. చెక్‌డ్యాంతో కాగ్నా నదిలో 0.035 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిలుస్తుంది. దీంతో కాగ్నా పరిధిలో భూగర్భజలాలు పెరగటంతో పాటు చుట్టుపక్కల వ్యవసాయ బోరు బావులు కూడా పూర్తిగా రీఛార్జ్ అవుతాయి.
కొన్ని రోజులుగా తాండూరు ప్రాంతంలో జోరుగా కురిసిన వర్షాలకు కాగ్నా నదికి వరదనీరు పోటెత్తింది. ఈ వరదనీరు ఇప్పుడు పూర్తిస్థాయిలో నిలవని పరిస్థితి నెలకొంది. పనుల్లో నాణ్యత లోపమా? లేదా? లీకేజీల కారణమా? ప్రస్తుతం వరదనీరు పూర్తిస్థాయిలో ఆగడం లేదు. చెక్‌డ్యాం కిందిభాగం నుంచి నీరు వృథాగా తరలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌డ్యాం వద్ద డౌన్‌స్ట్రీమ్ కటాఫ్ వాల్ నిర్మాణాన్ని ఐదు మీటర్ల లోతుగా కాంక్రీట్‌తో నిర్మించాలి. కానీ సుమారు మూడు అడుగులకు పరిమితమయ్యారు. కాగ్నాలో మూడు అడుగుల తర్వాత తవ్వితే నీళ్లు, ఇసుక పైకి రావడం వల్ల పూర్తిస్థాయిలో ఈ పనులు చేయడం సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఈ విషయాన్ని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు నివేదించారు.
సీడీఓ అధికారులు చెక్‌డ్యాం పనులకు రీ డిజైన్ చేయాలని ప్రతిపాదించారు. డౌన్‌స్ట్రీమ్ కటాఫ్ వాల్ కింది భాగంలో కాంక్రిట్‌కు బదులు షీట్‌ఫైలింగ్ చేయాలని సీడీఓ అధికారులు సూచించారు. ఈ మేరకు అధికారులు రీ డిజైన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. వరదనీరు పోటెత్తడంతో చెక్‌డ్యాం కుడివైపు మట్టి కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. ప్రభుత్వం కొత్త డిజైన్‌కు ఆమోదముద్ర వేస్తే పూర్తిస్థాయిలో ఆనకట్ట పడి, వృథా జలాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లీకేజీలు లేవు..
కాగ్నా చెక్‌డ్యాం పనుల్లో లీకేజీలు లేవు. లీకేజీలున్నాయనేది అపోహ మాత్రమే. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యాం సామర్థ్యం మేరకు కాగ్నాలో నీరు నిలిచింది. డౌన్‌స్ట్రీమ్ కటాఫ్ వాల్ కాంక్రీట్ పనులకుగాను కొత్త డిజైన్‌తో తొమ్మిది అడుగల లోతులో షీట్‌ఫైలింగ్ పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. సుమారు రూ.4 కోట్ల అదనపు నిధులతో రూపొందించిన కొత్త డిజైన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే షీట్ పనులు మొదలవుతాయి. - నికేష్, ఇరిగేషన్ ఏఈ