తుంగభద్ర దిగువ కాల్వకు గండి
Published Sun, Jul 24 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
– కాల్వకు నీటిసరఫరా నిలిపివేత
– మరమ్మతులకు చర్యలు
సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీటినందించే తుంగభద్ర దిగువ కాల్వకు శనివారం గండి పడింది. బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధిలోని గుండ్లుకెరి సమీపంలో బుక్కసాగరకు ఆనుకుని కాలువకు గండి పడింది. నీరంతా బయటకు పారుతుండడంతో ఆ ప్రాంతవాసులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రంగారెడ్డి, సంబంధిత అధికారులు గండి ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆంధ్రా సరిహద్దు కాదు కదా కర్ణాటక పరిధిలోని బళ్లారి జిల్లాకు కూడా పూర్తిగా చేర కుండా గండిపడింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. పనులు పూర్తయిన వెంటనే తిరిగి కాలువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement