బాబ్బాబు.. ఎలాగైనా ఆపండి..!
రోడ్డుపాలవుతున్న గోదావరి జలాలు..
పైపులైన్‌కు పగిలి 48 గంటలైనా
పట్టించుకోని అధికారులు..
లీకేజీని అరికట్టాలని కాంట్రాక్టర్లను బతిమాలుతున్న వైనం
చింతల్: నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిష్ర్పమోజనంగా మారుతోంది. ఈ నెల 1వ తేదీ అర్థరాత్రి చింతల్ హెచ్‌ఎంటి వాటర్‌ట్యాంక్ సమీపంలో భారీ పైపులైన్ పగిలిపోవడంతో నీళ్లు ప్రధాన రహదారిని ముంచేశాయి. శనివారం ఉదయం 10 గంటలకు తాపీగా అక్కడికి చేరుకున్న వాటర్‌వర్క్స్ అధికారులు సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అయినా లీకేజీలు ఆగకపోవడంతో వాటర్ వర్క్స్ అధికారులు స్థానిక కాంట్రాక్టర్‌ను సంప్రదించగా, తాను మేజర్ పైపులైన్ పనులు చేయలేనని చెప్పడంతో అధికారులు ఇతర కాంట్రాక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు.
అయితే ఆదివారం సాయంత్రం వరకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం, సోమవారం కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు, జలమండలి ఉన్నతాధికారులు ఆరు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసేందుకు ఆ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న అధికారులు ఎలాగైనా పనులు పూర్తి చేయాలని పలువురు కాంట్రాక్టర్లను కాళ్లవేళ్ల పడుతున్నట్లు సమాచారం. ఇదే పైపులైన్‌కు నెల రోజుల్లో రెండు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడం గమనార్హం.