కరెంటు ఫుల్‌...నీళ్లు నిల్‌ | 24 ​hours current..water is nil | Sakshi
Sakshi News home page

కరెంటు ఫుల్‌...నీళ్లు నిల్‌

Published Fri, Mar 9 2018 11:06 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

24 ​hours current..water is nil - Sakshi

భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పూర్తిగా ఎండిపోయిన బావి


కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న విధంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుతే ప్రాణాధారం. ప్రభుత్వం ఇప్పుడు 24గంటల ఉచిత నిరంతర విద్యుత్‌ ఇస్తున్నా ఆయకట్టేతర ప్రాంతాలకు చెందిన రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు.  విద్యుత్‌ను అవసరాల మేరకే సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో రైతులను చైతన్య పరచడంలో విద్యుత్‌శాఖ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల విద్యుత్‌ మోటార్లు ఆగకుండా నడుస్తుండడంతో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా బోర్లు వట్టిపోయి, పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు.




పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్‌లో వరి సాగు చేశారు. సీజన్‌ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో  సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. 


సాక్షిప్రతినిధి, నల్లగొండ: వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్‌గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు.

పెరిగిన సాగు విస్తీర్ణం.. విద్యుత్‌ వినియోగం
గత యాసంగి సీజన్‌ కంటే ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం, విద్యుత్‌ వినియోగం  పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది.

సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్‌ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్‌ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్‌ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే.


రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది 
మాకున్న రెండు ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాం. ఉన్న రెండు బోర్లు నెల రోజుల్లో వట్టిపోయాయి. 20 రోజుల క్రితం కొత్తగా రూ.50 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. మొత్తం రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులను మేపుతున్నాం. పెట్టిన పెట్టుబడి పోగా మరో రూ.70 వేల వరకు అప్పు మిగిలింది.
– మల్లేపల్లి సైదమ్మ, సర్వారం, తిప్పర్తి మండలం

12గంటలు ఇస్తే చాలు 
ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్‌ ఇస్తుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గి బోర్లు సన్నని ధారగా పోస్తున్నాయి. నాటు పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 12 గంటల కరెంట్‌ విడుతల వారీగా ఇస్తేచాలు. వ్యవసాయం చేయగలం. నీటి వసతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది.
– గంగేశ్వర్, రైతు, అడ్డగూడూరు


ఆటోస్టార్టర్లు తొలగించుకోమని చెప్పాం 
24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్న నాటి నుంచే రైతులు ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగించుకోమని చెబుతున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. అవసరం మేరకు విద్యుత్‌ వాడుకుని ఆ తర్వాత రైతులు తమతంటతాముగానే స్టార్టర్లు బంద్‌ చేసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. 24 గంటల విద్యుత్‌ సరఫరా విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలో విద్యుత్‌ వాడకం పెరిగింది. ప్రతీ రోజూ నల్లగొండ జిల్లాలో 29.86 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కోటా 18.30 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. 
– కృష్ణయ్య, విద్యుత్‌ శాఖ, ఎస్‌ఈ, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement