దుఃఖసాగరమే! | live stock drought in medak distic | Sakshi
Sakshi News home page

దుఃఖసాగరమే!

Published Wed, Apr 6 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

దుఃఖసాగరమే!

దుఃఖసాగరమే!

‘క్షీర’సాగర్‌లో పడిపోయిన పాల దిగుబడి
గ్రాసం, దాణా, నీళ్ల కొరత
బక్కచిక్కిన పాడి పశువులు
అప్పుల పాలైన రైతులు
పోషించే శక్తి లేక అమ్ముకునుడే..
గ్రామం…లో దయనీయ దుస్థితి

 క్షీరసాగర్.. పేరుకు తగ్గంటే ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువే. పాడి పరిశ్రమకు నెలవు. అలాంటి ‘క్షీర’సాగర్ ఇప్పుడు దుఃఖసాగరంగా మారింది. కరువు దృష్ట్యా పరిస్థితులు తలకిందులయ్యాయి. పశువులను సాకేందుకు గ్రాసం లేక.. దప్పిక తీర్చేందుకు నీళ్లు లేకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. పాలు ఇవ్వడమే మానేశాయి. అప్పుల పాలైన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పాడి పశువులను అమ్మేసుకుంటున్నారు. ఈ గ్రామంలో ఏ రైతును కదిలించినా కన్నీరే కారుస్తున్నారు.

గజ్వేల్/ములుగు: దశాబ్దాలుగా ‘పాడి’కి నెలవుగా మారడంతో ఈ గ్రామానికి క్షీరసాగర్ పేరొచ్చింది. పేరుకు తగ్గట్టే ఎక్కడా లేనివిధంగా ఇక్కడి రైతులు పాడి అభివృద్ధిలో దూసుకెళ్తారు. ప్రియ, జెర్సీ, విజయా డెయిరీ తదితర కంపెనీలు ఏళ్ల తరబడి ఈ గ్రామం నుంచే పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్నారు. నేరుగా రైతుల డెయిరీ ఫారాల వద్దకు వచ్చి పాలను సేకరించేవారు. గతేడాది వరకు గ్రామంలో నిత్యం 2,500 వేల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి జరిగింది. కానీ ఆరు నెలలుగా గ్రామంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ధాటికి ‘పాడి’పరిశ్రమ అవసాన దశకు చేరుకుంది. ప్రస్తుతం రోజుకు 800 లీటర్ల పాలు రావడమే గగనంగా మారింది. పదుల సంఖ్యలో గేదెలు, ఆవులను ్చఠమొదటిపేజీ తరువాయి

 పెంచుతూ పాల ఉత్పత్తి చేపడుతున్న రైతులు కరువు కాలంలో గ్రాసం దొరక్క, నీళ్లు అందక ‘అడ్డికి పావుసేరు’ కాడికి వాటిని అమ్ముకుంటున్నారు. అప్పుల్లో మునిగి వారు చివరకు బంగారం, పుస్తెలతాళ్లను కూడా అమ్ముకుంటున్నారు. మరికొందరు ‘పాడి’పై మమకారాన్ని చంపుకోలేక వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎండుగడ్డిని కొనుగోలు చేస్తూ ఉన్న పశువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు అందరు రైతులు ఇదే రకమైన భారాన్ని మోస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ గ్రామాన్ని సందర్శించగా పాడి రైతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టారు.

 అల్లం బలరామ్ ఆశలు గల్లంతు...
క్షీరసాగర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అల్లం బలరామ్ మూడేళ్ల క్రితం ఒక్కోదానికి రూ.65 నుంచి రూ.75 వేల వరకు వెచ్చించి అధిక పాల దిగుబడినిచ్చే 12 గేదెలు కొనుగోలు చేశాడు. ఈయనకు గ్రామంలో ఎకరా సొంత భూమి ఉండగా అందులో చిన్నపాటి డెయిరీ ఫారమ్ ఏర్పాటు చేశాడు. తనకున్న ఓ బోరుబావి ఆధారంగా పశుగ్రాసాన్ని పెంచుతున్నాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా నిత్యం 40 లీటర్లకుపైగా పాలు ప్రైవేటు కంపెనీలకు పోసేవాడు. ఖర్చులు, శ్రమ పోను మంచి ఆదాయం లభించడంతో దర్జాగా బతికాడు. పాడిపరిశ్రమపై ఉన్న మమకారంతో ఇంటిని వదిలి డెయిరీ ఫారమ్ వద్దే నివాసం ఏర్పరచుకున్నాడు. భార్య నర్సమ్మతో కలిసి పొద్దంతా పశుపోషణలో నిమగ్నమయ్యాడు.

కానీ గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయి. బోరుబావి నుంచి నీళ్ల రావడం లేదు. పశుగ్రాసం ఎండిపోయింది. ఇప్పటివరకు రూ.10వేల చొప్పున మూడుసార్లు ట్రాక్టర్ల నిండా, మరోసారి రూ.16 వేలతో డీసీఎం నిండాఎండుగడ్డి కొనుగోలు చేశాడు. దీంతోపాటు నెలకు రూ.4-5వేల విలువైన దాణా అందించాడు. అయినా గేదెలకు గ్రాసం, దాణా సరిపోలేదు. పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. రోజుకు 10 లీటర్లు కూడా రావడం లేదు. ఎండుగడ్డి, దాణా భారీగా తేలేక బలరామ్ అప్పుల పాలయ్యాడు. చివరకు తన భార్య నర్సమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పుస్తెలతాడు 4 తులాల వరకు అమ్మేశాడు.

రూ.6 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలరామ్ 8 పాడిగేదెలను కేవలం రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద 4 గేదెలు మాత్రమే ఉన్నాయి. వాటి పోషణ కూడా ఇబ్బందికరంగానే ఉందంటున్న బలరామ్.. మరికొన్ని రోజుల్లో మరో రెండు గేదెలను సైతం అమ్ముకునే దయనీయ స్థితిలో ఉన్నాడు. ఈ ముసలితనంలో ఏ మూలకు కూసోకుండా...పశువులను పెంచుకుంటే... మాకు కస్టాలే మిగిలినయ్. మమ్మలను ఆదుకుంటనే గడ్డకు పడతం...అంటూ బలరామ్ వాపోయాడు.

 అందరిదీ ఇదే పరిస్థితి...
క్షీరసాగర్‌కు చెందిన ఆదోసు పెద్ద యాదయ్యకు ఎకరం భూమి ఉండగా, మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో నుంచి నీరు రావడం లేదు. కౌలుకు తీసుకున్న పొలంలో 3 బోరుబావులున్నాయి. అందులో రెండు మాత్రమే కొద్దిగా నీరు పోస్తుండడంతో ఆ నీటి ఆధారంగా అర ఎకరం వరి సాగు చేశాడు. మిగతా నీటిని ఆరు గేదెలకు వాడుకుంటున్నాడు. గ్రాసం లేక ఇతను కూడా కొన్ని నెలలుగా రూ.30వేలు వెచ్చించి గడ్డి కొనుగోలు చేశాడు. విసుగు చెంది రెండు గేదెలను అతి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు.

ప్రస్తుతం నాలుగు గేదెలను అతి కష్టం మీద పోషిస్తున్నాడు. గతంలో నిత్యం 20 లీటర్ల పాలు అమ్మే యాదయ్య ఇప్పుడు 4 లీటర్లు అమ్మడమే గగనమవుతుంది. ఇదే గ్రామానికి చెందిన చాకలి వెంకట్ సైతం 12 గేదెలకు గ్రాసం దొరకని కారణంగా వాటిని ఎనిమిదింటిని అమ్మేశాడు. గ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నాడు. కోల సాయిలు అనే మరో రైతు సైతం నాలుగు గేదెల్లో రెండింటిని అమ్మేయగా వీటి  పోషణ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement