వర్షాకాలంలో పశుసంరక్షణ | agriculture story | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో పశుసంరక్షణ

Published Sat, Aug 26 2017 9:51 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వర్షాకాలంలో పశుసంరక్షణ - Sakshi

వర్షాకాలంలో పశుసంరక్షణ

ధర్మవరం అర్బన్ : వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల వ్యాధులకు గురవుతాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, చిటిక వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. దీంతో పశువులను కాపాడుకోవడానికి పశు వైద్యుల వద్దకు రైతులు పరుగులు తీస్తుంటారు. పశువులకు ఏఏ వ్యాధులు సోకుతాయో ఇలా వివరిస్తున్నారు.

– గొంతువాపు వ్యాధి...
ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది. దీని కారణంగా గొంతు వాచిపోయి ఉంటుంది. ఓ రకమైన సూక్ష్మజీవి వల్ల పశువుల్లో ఈ వ్యాధి వస్తుంది. పల్లపు ప్రాంతాలు, వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీరసంగా ఉండే పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. ఇది జూన్‌ నుంచి సెప్టెంబరు మాసాల్లో కనిపిస్తుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో ఎక్కువగా గొంతు వాపు కూడా వస్తుంది. ఈ వ్యాధి వల్లే ఎక్కువ పశువులు మరణిస్తాయి.

– వ్యాధి లక్షణాలు...
వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది. గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింది భాగాన వాపు వస్తుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. తీవ్ర జ్వరం వచ్చి పశువు మరణిస్తుంది.

– వ్యాధి నివారణ చర్యలు...
జూన్, జులై, ఆగస్టులో రైతులు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారాన్ని అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలిన వాటి నుంచి వేరుచేయాలి. వాటి స్థావరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

– జబ్బవాపు వ్యాధి...
ఇది తెల్లజాతి రకాలైన ఆవులు, ఎద్దులకు సోకుతుంది. ఆరోగ్యంగా బలంగా ఉండే పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తొలకరి చినుకులు పడ్డాక ఉష్ణ ప్రాంతాలు, తేమగా ఉండే ప్రాంతాల్లో ఉన్న పశువులకు ఈ వ్యాధి సోకుతుంది. బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది. కలుషితమైన ఆహారం తినడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల కూడా సంక్రమిస్తుంది.

– దీని లక్షణాలు..
ఆరోగ్యంగా, బలంగా ఉన్న ఆరుమాసాలు నుంచి రెండేళ్ల వయసున్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యాధి లక్షణాలను గుర్తించేలోగానే పశువు మరణిస్తుంది. జబ్బ, తొడ కండరాలపై వాపు వస్తుంది. వాపు ఉన్నచోట తాకితే శబ్దం వస్తుంది. వ్యాధి సోకినప్పటి నుంచి పశువులు నీరసించి ఆహారం తీసుకోలేవు. తీవ్రమైన జ్వరంతో చనిపోతాయి. వ్యాధి సోకిన 12 నుంచి 36 గంటల్లో పశువులు మరణిస్తాయి.

– వ్యాధి నివారణ చర్యలు...
వర్షాలకు ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, అవి విడిచిపెట్టిన గడ్డిని కాల్చివేయాలి. మరణించిన పశువును సున్నపు గోతిలో పూడ్చాలి.

– చిటిక వ్యాధి...
ఇది గొర్రెల్లో వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయసు గల గొర్రెల్లో ఇది ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది.

– వ్యాధి లక్షణాలు..
వ్యాధి సోకిన గొర్రెలు నీరసిస్తాయి. కొద్ది సేపటికే గొర్రెలు గిలగిలా కొట్టుకుని, గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి.

– ఇవి నివారణ చర్యలు...
వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను గొర్రెల మంద నుంచి వేరు చేయాలి.

– గాలికుంటు వ్యాధి...
వర్షాకాలంలో గాలికుంటువ్యాధి పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒకసారి ఈ వ్యాధి సోకితే జీవితకాలం ఆ పశువులో పాల ఉత్పత్తి సగానికిపైగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా పాడి పశువులకు టీకాలు వేయాలి. ఈ వ్యాధి ఎక్కువగా పందులు, గేదెలు, దున్నల్లో కనిపిస్తుంది. ఇది పశువులకు ఆగస్టు, సప్టెంబరు నెలల్లో వస్తుంది. సూక్ష్మజీవి కారణంగా పశువుకు సోకుతుంది. వ్యాధి సోకిన ఆవు, గేదెల పాల నుంచి వాటి చూడలకు వ్యాపిస్తుంది.

– ఇవీ లక్షణాలు...
నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. ఒకటి నుంచి 4 వారాల్లో ఆ బొబ్బలు చితికి గాయాలవుతాయి. పశువుల నోటిలో చిగుళ్లపై పొక్కులు వస్తాయి. దీంతో పశువు నీరసించిపోయి నోటి నుంచి చొంగ కారుతుంది. పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది.

– రైతులు అప్రమత్తంగా ఉండాలి...
పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. పశువులకు వివిధ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి. పశువులను గాలి, వెలుతురు వచ్చేలా పాకల్లో కట్టాలి. ఈగలు, దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కువగా వానలో తడిసిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 14 వరకు టీకాలు వేయించాలి. నట్టల నివారణకు ఏటా రెండుసార్లు టీకాలు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు విడతలుగా టీకాలు వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement