సూపర్ నేపియర్ గ్రాస్.. పశువులకు ఆహారంగా పనికి వచ్చే ఈ గడ్డి ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తోంది. సరికొత్త ‘ఆహార వాణిజ్య’ పంటగా జిల్లాలో నాలుగేళ్ల క్రితం పదుల ఎకరాల్లో మొదలై ఇప్పుడు వందల ఎకరాల్లోకి చేరింది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: ఒకప్పుడు గ్రామాలు పశువులతో కళకళలాడేవి. వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములు ఉండేవి. పొలం గట్లు, అంచుల వెంబడి రైతులు పశుగ్రాసం పెంచేవారు. క్రమేణా బంజరు భూములు సాగునేలలుగా మారాయి. లేదంటే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది. కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది. పాలిచ్చే గేదెలు, జెర్సీ ఆవులను పెంచే రైతుల సంఖ్య గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు పశుగ్రాసం లభించడం లేదు.
అడవులు అధికంగానే ఉన్నా..
రాష్ట్రంలోనే అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పశుగ్రాసం సమస్య తీవ్రంగానే ఉంది. అడవుల సంరక్షణ పేరుతో అటవీ అధికారులు కట్టుదిట్టం చేయడంతో పశువులకు మేత దొరకడంకష్టమైపోయింది. దీంతో పాడిరైతులు పశుగ్రాసాన్ని మోపుల లెక్కన కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశువుల ఆహార కొరతను తీరుస్తూ రైతులకు ఆదాయాన్ని అందించే వనరుగా సూపర్ నేపియర్ రకం గడ్డి వెలుగులోకి వచ్చింది.
నేపియర్ గ్రాస్‌తో పెంచుతున్న పశువులు
సాగు సులభం..
అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయ్‌లాండ్ నుంచి వచ్చింది. భారత్ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రస్తుతం సూపర్ నేపియర్ రకం సాగు జోరందుకుంది. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్ నేపియర్ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఎనిమిదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది.
రైతుల మొగ్గు...
పట్టణాలకు సమీపంలో పాడి ఎక్కువగా విస్తరించిన గ్రామాల్లో రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చిల కంటే నేపియర్ సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి వేసి నానా కష్టాలు పడితే ఎకరానికి రూ.15 వేలకు మించి ఆదాయం రావట్లేదు. పత్తివేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.30 వేలైనా మిగలడం లేదు. కానీ సూపర్ నేపియర్ స్టెమ్స్ ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు ఢోకాలేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.70 వేల వరకు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు.
రెట్టింపు లాభం..
బెంగళూరులో ఉన్నప్పుడు సొంతూరిలో పాడి పరిశ్రమ పెట్టాలనుకున్నా. అప్పుడే సూపర్ నేపియర్ గురించి తెలిసింది. మా ఊళ్లో ఫాంహౌస్ కట్టి దానిలో ఈ గడ్డి పెంచుతున్నా. సాధారణ గడ్డి ఎకరంలో పండిస్తే.. ఐదారు పశువులకే సరిపోతుంది. కానీ నేపియర్ 16 అడుగుల పొడవు పెరగడం వల్ల 10 పశువులకు సరిపోతుంది. పైగా
ఇందులో ప్రొటీన్స్ ఎక్కువ. పాల దిగుబడి బాగుంటుంది.
– కళ్యాణ్, రైతు, అశ్వాపురం
సమయం ఆదా అవుతోంది
గతంలో భూమి కౌలుకు తీసుకుని గడ్డి పెంచేవాన్ని. ప్రతీ ఏడాది దుక్కి దున్ని విత్తనాలు చల్లాల్సి వచ్చేది. సూపర్ నేపియర్‌తో ఈ సమస్య లేదు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. 6 ఏళ్లు పాడి పశువులకు ఆహార కొరత లేదు. ఉదయం ఈ గడ్డి కోసి ఇస్తే చాలు. మిగిలిన సమయంలో ఇతర పను లు చూసుకునే వెసులుబాటు కలుగుతోంది.
– బాదం శ్రీనివాసరెడ్డి, రైతు, బూర్గంపాడ
Comments
Please login to add a commentAdd a comment