గడ్డిపొరకల మాటున స్మగ్లింగ్
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం రవాణా చేయడానికి స్మగ్లర్లు రోజుకో ఎత్తుగడలు వేస్తున్నారు. అయినా పోలీసులకు పట్టుబడుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో గడ్డిపొరకల మాటున దుంగలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో పోలీసులకు దొరికిన ఖాదర్‌బాద్ సునీల్ ఈ సారి తన గ్యాంగ్‌ను విస్తరించాడు.
మైదుకూరు రోడ్డులోని కొత్తపల్లె చెక్‌పోస్టు వద్ద శనివారం నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5లక్షలు విలువైన దుంగలతోపాటు వాహనాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖాదర్‌బాద్‌కు చెందిన పంగా సునీల్‌కుమార్, కానపల్లె గ్రామానికి చెందిన ఆకుమల్ల సుధాకర్, మల్లెబోయిన పరంధామ, రామేశ్వరానికి చెందిన షరీఫ్‌లు స్నేహితులు.
వీరు తరచూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారు. సునీల్‌కుమార్ గతంలో ఎర్రచందనం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వీరికి నంద్యాలలోని లక్ష్మిరెడ్డి, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, నరసింహులు, విజయ్‌తో పరిచయం ఏర్పడింది.
వీరు సునీల్‌కుమార్‌కు వాహనం సమకూర్చారు. వనిపెంటకు చెందిన పరంధామ కొద్ది రోజుల నుంచి నాగసానిపల్లెలో 15 ఎర్రచందనం దుంగలను దాచి ఉంచాడు. ఈ విషయాన్ని నంద్యాల లక్ష్మిరెడ్డికి తెలిపాడు. ఈ క్రమంలో 15 చందనం దుంగలను వాహనంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
ఎవరికీ అనుమానం రాకుండా వాహనంలో గడ్డి పొరకలు వేశారు. దుంగలను అనంతపురం తరలించేందుకు శని వారం నాగసానిపల్లె నుంచి బయలుదేరారు. వారి వాహనం కొత్తపల్లె చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.
అనుమానంతో పోలీసు లు వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో పరిశీలించగా గడ్డి పొరకల కింద 15 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. సునీల్‌కుమార్, ఆకుమల్ల సుధాకర్, పరంధామ, షరీఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
వాహనంలో ఉన్న లక్ష్మిరెడ్డి, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, నరసింహులు, విజయ్ పారిపోయినట్లు పోలీసులు తెలి పారు. దుంగల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఖాదర్‌బాద్ సునీల్‌పై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేస్తున్నామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు చలపతి, జీఎండీ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.