Redoak
-
గడ్డిపొరకల మాటున స్మగ్లింగ్
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం రవాణా చేయడానికి స్మగ్లర్లు రోజుకో ఎత్తుగడలు వేస్తున్నారు. అయినా పోలీసులకు పట్టుబడుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో గడ్డిపొరకల మాటున దుంగలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో పోలీసులకు దొరికిన ఖాదర్‌బాద్ సునీల్ ఈ సారి తన గ్యాంగ్‌ను విస్తరించాడు. మైదుకూరు రోడ్డులోని కొత్తపల్లె చెక్‌పోస్టు వద్ద శనివారం నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5లక్షలు విలువైన దుంగలతోపాటు వాహనాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఖాదర్‌బాద్‌కు చెందిన పంగా సునీల్‌కుమార్, కానపల్లె గ్రామానికి చెందిన ఆకుమల్ల సుధాకర్, మల్లెబోయిన పరంధామ, రామేశ్వరానికి చెందిన షరీఫ్‌లు స్నేహితులు. వీరు తరచూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారు. సునీల్‌కుమార్ గతంలో ఎర్రచందనం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వీరికి నంద్యాలలోని లక్ష్మిరెడ్డి, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, నరసింహులు, విజయ్‌తో పరిచయం ఏర్పడింది. వీరు సునీల్‌కుమార్‌కు వాహనం సమకూర్చారు. వనిపెంటకు చెందిన పరంధామ కొద్ది రోజుల నుంచి నాగసానిపల్లెలో 15 ఎర్రచందనం దుంగలను దాచి ఉంచాడు. ఈ విషయాన్ని నంద్యాల లక్ష్మిరెడ్డికి తెలిపాడు. ఈ క్రమంలో 15 చందనం దుంగలను వాహనంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనంలో గడ్డి పొరకలు వేశారు. దుంగలను అనంతపురం తరలించేందుకు శని వారం నాగసానిపల్లె నుంచి బయలుదేరారు. వారి వాహనం కొత్తపల్లె చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానంతో పోలీసు లు వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో పరిశీలించగా గడ్డి పొరకల కింద 15 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. సునీల్‌కుమార్, ఆకుమల్ల సుధాకర్, పరంధామ, షరీఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వాహనంలో ఉన్న లక్ష్మిరెడ్డి, సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, నరసింహులు, విజయ్ పారిపోయినట్లు పోలీసులు తెలి పారు. దుంగల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఖాదర్‌బాద్ సునీల్‌పై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేస్తున్నామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐలు చలపతి, జీఎండీ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగని తమిళ తంబీల రాక!
రాయచోటి మీదుగా అడవిలోకి ప్రవేశం రాజంపేట : ఎర్రచందనం చెట్లను నరికేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళతంబీల రాక ఆగడంలేదు. అడవిలో ఎన్కౌంటర్ చేసినా..ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నా తమిళ కూలీలు రాక మాత్రం ఆగడంలేదు. పెద్దఎత్తున ఎస్పీ నవీనగులాఠి ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖల సమన్వయంతో ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్టేషన్ల వారీగా రెడ్షీట్ను సిద్ధం చేశారు. ఆ దిశగా రెడ్షీట్ జాబితాలోకి ఎక్కిన వారిని విచారించడం, కేసులు నమోదు చేయడం మరోవైపు జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నా ఎర్రచందం చెట్లు నరకడానికి తమిళ తంబీలు ఇంకా వస్తున్నారన్న అంశమే పోలీసుశాఖను వేధిస్తోంది. శేషాచలం రాజంపేట నియోజకవర్గంలో విస్తరించబడి ఉంది. చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న సుండుపల్లె మండలం పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చొరబడుతున్నారు. దీంతో అక్కడ అటవీ అధికారులు పనితీరుపై అదే శాఖలోనూ..ఇటు పోలీసుశాఖలో అనుమానాలు ఉన్నాయి. రూట్మార్చుకుని... శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బాలపల్లె, మామండూరు, శెట్టిగుంట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట నుంచి అడవిలోకి సులభంగా వెళ్లేందుకు వీలుంది. అయితే ఈ మార్గాలన్నింటిపై పోలీసుశాఖ పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఇప్పటికే ఈ మార్గంలో వెళ్లే తమిళ కూలీలను అనేకమందిని పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు తమిళ తంబీలు చెన్నై నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి చిత్తూరు, పీలేరు, రాయచోటికి చేరుకుని అక్కడి నుంచి సుండుపల్లె, వీరబల్లికి సరిహద్దులో నుంచి శేషాచలంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా కూలీలు తమ ఆకలి, అలవాట్లు తీర్చుకునేందుకు వినియోగించిన వస్తువులు దాదాపు రాయచోటిలో కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు స్థానిక స్మగ్లర్ల నుంచి సహకారంలేకుండా తంబీలు అడవిలో అణువణువునా అవగాహన ఉండటంతో అడవిలో యథేచ్చగా ప్రవేశించడం గమనార్హం. కేరళకు వెళ్లడం కన్నా.. ఒకప్పుడు రబ్బరు చెట్లు నరికివేతలో ఆరితేరిన తమిళకూలీలు అక్కడ ఇచ్చే కూలీ కన్నా..శేషాచలంలో ఎర్రచందనం చెట్లు నరికితే చేతి నిండా డబ్బే అని భావిస్తున్నారు. అక్కడ ముఠా మేస్త్రీలు కూడా ఎర్రచందనం చెట్ల నరికివేతకు ప్రోత్సహిస్తున్నారు. ఒక చెట్టు కొడితే 20 నుంచి 30 కేజీల బరువు ఉంటుంది. ఆ లెక్కన 10 నుంచి రూ.15వేల వరకు రోజుకు ఆదాయం వస్తుంది. దానికి ఆశబడి నరికివేతకు వస్తున్నారు. కేరళలో రోజు కూలీ రూ250 నుంచి రూ300ఇస్తున్నారు.. ఇదే మేలు అన్న తరహాలో తమిళ తంబీలు శేషాచలం వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం అక్రమరవాణాకు ఎంతగా అడ్డుకట్టవేసే దిశగా చర్యలు తీసుకున్నా పక్క రాష్ట్రం నుంచి తమిళ స్మగ్లర్లు తాకిడి తగ్గడంలేదు. -
‘ఎర్ర' స్మగ్లర్లపై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పీడీ యాక్ట్ అమలు చేయాలని పోలీసు, అటవీశాఖ అధికారులను గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ ఆదేశించారు. సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సాయంత్రం ఆయన నెల్లూరు, ప్రకాశం జిల్లాల అటవీ, పోలీసుల అధికారులతో సమావేశం నిర్వహించారు. శేషాచలం తర్వాత వెలుగొండ, నల్లమల అడవుల్లో స్మగ్లర్లు తిష్టవేసి విలువైన అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ఫలితంగా జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇరుశాఖలపై ఉందన్నారు. ఇరు శాఖల అధికారులు రెండు జిల్లాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. కేవలం వాహనాలు, దుంగలను సీజ్ చేసి కూలీలను పట్టుకోవడమే కాక లోతైన దర్యాప్తు జరిపి కీలక వ్యక్తుల గుట్టును రట్టు చేయాలన్నారు. పోలీసు, అటవీశాఖ అధికారుల మధ్య అపోహలు తొలగితేనే అప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. కూంబింగ్ ముమ్మరం చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అవసరమైతే చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక నేరాల నియంత్రణపై దృష్టి ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు ఎక్కువవుతున్నాయని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు ఐజీ సూచించారు. నకిలీ చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలపై నిఘా ఉంచాలన్నారు. నిందితులను అరెస్ట్చేయడంతోనే సరిపెట్టకుండా అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది అనుమతి లేకుండా చిట్టీలు, ఫైనాన్స్ సంస్థలు నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో విచారణ నత్తనడకన సాగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు ఎస్ సెంథిల్‌కుమార్, శ్రీకాంత్, డీఎస్పీలు, అటవీశాఖ అధికారులు, నెల్లూరు జిల్లా సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.