ఆగని తమిళ తంబీల రాక!
రాయచోటి మీదుగా అడవిలోకి ప్రవేశం
రాజంపేట : ఎర్రచందనం చెట్లను నరికేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళతంబీల రాక ఆగడంలేదు. అడవిలో ఎన్‌కౌంటర్ చేసినా..ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నా తమిళ కూలీలు రాక మాత్రం ఆగడంలేదు. పెద్దఎత్తున ఎస్పీ నవీనగులాఠి ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖల సమన్వయంతో ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్టేషన్ల వారీగా రెడ్‌షీట్‌ను సిద్ధం చేశారు.
ఆ దిశగా రెడ్‌షీట్ జాబితాలోకి ఎక్కిన వారిని విచారించడం, కేసులు నమోదు చేయడం మరోవైపు జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నా ఎర్రచందం చెట్లు నరకడానికి తమిళ తంబీలు ఇంకా వస్తున్నారన్న అంశమే పోలీసుశాఖను వేధిస్తోంది. శేషాచలం రాజంపేట నియోజకవర్గంలో విస్తరించబడి ఉంది. చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న సుండుపల్లె మండలం పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చొరబడుతున్నారు. దీంతో అక్కడ అటవీ అధికారులు పనితీరుపై అదే శాఖలోనూ..ఇటు పోలీసుశాఖలో అనుమానాలు ఉన్నాయి.
రూట్‌మార్చుకుని...
శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బాలపల్లె, మామండూరు, శెట్టిగుంట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట నుంచి అడవిలోకి సులభంగా వెళ్లేందుకు వీలుంది. అయితే ఈ మార్గాలన్నింటిపై పోలీసుశాఖ పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఇప్పటికే ఈ మార్గంలో వెళ్లే తమిళ కూలీలను అనేకమందిని పట్టుకున్నారు.
దీంతో ఇప్పుడు తమిళ తంబీలు చెన్నై నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి చిత్తూరు, పీలేరు, రాయచోటికి చేరుకుని అక్కడి నుంచి సుండుపల్లె, వీరబల్లికి సరిహద్దులో నుంచి శేషాచలంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా కూలీలు తమ ఆకలి, అలవాట్లు తీర్చుకునేందుకు వినియోగించిన వస్తువులు దాదాపు రాయచోటిలో కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు స్థానిక స్మగ్లర్ల నుంచి సహకారంలేకుండా తంబీలు అడవిలో అణువణువునా అవగాహన ఉండటంతో అడవిలో యథేచ్చగా ప్రవేశించడం గమనార్హం.
కేరళకు వెళ్లడం కన్నా..
ఒకప్పుడు రబ్బరు చెట్లు నరికివేతలో ఆరితేరిన తమిళకూలీలు అక్కడ ఇచ్చే కూలీ కన్నా..శేషాచలంలో ఎర్రచందనం చెట్లు నరికితే చేతి నిండా డబ్బే అని భావిస్తున్నారు. అక్కడ ముఠా మేస్త్రీలు కూడా ఎర్రచందనం చెట్ల నరికివేతకు ప్రోత్సహిస్తున్నారు. ఒక చెట్టు కొడితే 20 నుంచి 30 కేజీల బరువు ఉంటుంది. ఆ లెక్కన 10 నుంచి రూ.15వేల వరకు రోజుకు ఆదాయం వస్తుంది.
దానికి ఆశబడి నరికివేతకు వస్తున్నారు. కేరళలో రోజు కూలీ రూ250 నుంచి రూ300ఇస్తున్నారు.. ఇదే మేలు అన్న తరహాలో తమిళ తంబీలు శేషాచలం వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం అక్రమరవాణాకు ఎంతగా అడ్డుకట్టవేసే దిశగా చర్యలు తీసుకున్నా పక్క రాష్ట్రం నుంచి తమిళ స్మగ్లర్లు తాకిడి తగ్గడంలేదు.