‘ఎర్ర' స్మగ్లర్లపై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పీడీ యాక్ట్ అమలు చేయాలని పోలీసు, అటవీశాఖ అధికారులను గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ ఆదేశించారు. సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సాయంత్రం ఆయన నెల్లూరు, ప్రకాశం జిల్లాల అటవీ, పోలీసుల అధికారులతో సమావేశం నిర్వహించారు.
శేషాచలం తర్వాత వెలుగొండ, నల్లమల అడవుల్లో స్మగ్లర్లు తిష్టవేసి విలువైన అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ఫలితంగా జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇరుశాఖలపై ఉందన్నారు. ఇరు శాఖల అధికారులు రెండు జిల్లాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. కేవలం వాహనాలు, దుంగలను సీజ్ చేసి కూలీలను పట్టుకోవడమే కాక లోతైన దర్యాప్తు జరిపి కీలక వ్యక్తుల గుట్టును రట్టు చేయాలన్నారు.
పోలీసు, అటవీశాఖ అధికారుల మధ్య అపోహలు తొలగితేనే అప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. కూంబింగ్ ముమ్మరం చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అవసరమైతే చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్థిక నేరాల నియంత్రణపై దృష్టి
ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు ఎక్కువవుతున్నాయని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు ఐజీ సూచించారు. నకిలీ చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలపై నిఘా ఉంచాలన్నారు. నిందితులను అరెస్ట్‌చేయడంతోనే సరిపెట్టకుండా అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు.
జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది అనుమతి లేకుండా చిట్టీలు, ఫైనాన్స్ సంస్థలు నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో విచారణ నత్తనడకన సాగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు ఎస్ సెంథిల్‌కుమార్, శ్రీకాంత్, డీఎస్పీలు, అటవీశాఖ అధికారులు, నెల్లూరు జిల్లా సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.