భూసారంతోనే భవిష్యత్తు! | Future only will save Soil | Sakshi
Sakshi News home page

భూసారంతోనే భవిష్యత్తు!

Published Thu, Oct 9 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

భూసారంతోనే భవిష్యత్తు!

భూసారంతోనే భవిష్యత్తు!

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై.ఎల్. నెనె
 హరిత విప్లవ కాలంలో వనరుల దుర్వినియోగంతో సర్వనాశనమైన భూసారాన్ని.. తిరిగి పెంపొందించుకోవడంపైనే జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెయ్యేళ్ల నాటి భారతీయ వ్యవసాయ విజ్ఞానం ఇప్పటికీ ఉపయుక్తమేనని ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. యశ్వంత్ లక్ష్మణ్ నెనె స్పష్టం చేస్తున్నారు.   
 
 పంటల్లో జింక్ లోపం వస్తున్నదని గుర్తించిన తొలి వ్యవసాయ శాస్త్రవేత్తగా డా. యశ్వంత్ లక్ష్మణ్ నెనె ప్రసిద్ధులు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఆయన స్వస్థలం. యూపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ‘ఇక్రిశాట్’లో చేరి 1989లో డిప్యూటీ డెరైక్టర్ జనరల్‌గా ఎదిగినా.. భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానాన్ని వెలికితీయాలన్న తపన ఆయనను ఉద్యోగంలో కొనసాగనివ్వలేదు. ఐదేళ్లు ముందుగానే 1996లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సికింద్రాబాద్‌లో ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. గత 15 ఏళ్లలో 8 పురాతన, మధ్యయుగం నాటి గ్రంథాలతోసహా మొత్తం 11 పుస్తకాలను ప్రచురించారు. మూలగ్రంథాల్లో విషయాన్ని యథాతథంగా ఆంగ్లంలోకి అనువదించడంతోపాటు.. ఈ కాలానికి అవి ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించే వ్యాసాలను సైతం ఈ గ్రంథాల్లో చేర్చడం విశేషం. మన పూర్వీకుల వ్యవసాయ విజ్ఞాన గని మనకు ఇప్పటికీ ఉపయుక్తమేనంటున్న నెనె.. రసాయనాలతో సర్వనాశనమైన భూమిలో సేంద్రియ పదార్థం పెంపుదలతోనే వ్యవసాయాభివృద్ధి ఆధారపడి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు..    
 
 వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నత స్థితికి ఎదిగిన మీరు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి ‘ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్’ను నెలకొల్పడానికి ప్రేరణ ఏమిటి?
     భారతీయ పురాతన వ్యవసాయ సంస్కృతి సుసంపన్నమైనది. మన పూర్వీకులు వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. అయితే, ప్రపంచ వ్యవసాయ చరిత్రలో మన కృషికి బొత్తిగా చోటులేదు. మొదట్లో బ్రిటిష్ వాళ్లు, ఇప్పుడు అమెరికన్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. బ్రిటిషర్లు మనల్ని చూసి వ్యవసాయం నేర్చుకున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా చెప్పరు! 50 ఏళ్ల క్రితం ఇలినాయిస్ యూనివర్సిటీ (అమెరికా)లో నేను పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ అన్న మాటలు నాలో ఆలోచన రేకెత్తించాయి. ‘చైనా, మెసపటోమియా, రోమన్ తదితర పురాతన వ్యవసాయ సంస్కృతులు, విజ్ఞానం గురించి వివరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానం గురించి ఇదమిత్థంగా సాహిత్యం ఏమీ అందుబాటులో లేదెందుకు?..’ అని ప్రొఫెసర్ అన్న మాటలు దశాబ్దాలు గడచినా నా మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ ప్రేరణతోనే 1996లో ఐదేళ్లు ముందుగానే ‘ఇక్రిశాట్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మరో పది మంది శాస్త్రవేత్తలతో కలిసి ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ని నెలకొల్పాను.   
 
‘వృక్షాయుర్వేదం’ మొదలుకొని పదకొండు పురాతన సంస్కృత వ్యవసాయ సంబంధ గ్రంథాలను సేకరించాం. వీటిని ఆంగ్లంలోకి అనువదించి, విశ్లేషణలతో పాటు ప్రచురించి ప్రపంచం ముందుంచాం. మన పూర్వీకుల సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని మన వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు అందించాలన్నదే మా అంతిమ లక్ష్యం.
 
 ‘ఫౌండేషన్’ లక్ష్యం ఏమిటి?
     భారతీయ పురాతన వ్యవసాయ విజ్ఞానం ఇదీ అని చెప్పడానికి ఒక్క గ్రంథమూ ఆధునికులకు అందుబాటులో లేకపోవడం విషాదం. భారతీయ రచయితలు కూడా ఈ వైపు దృష్టి సారించలేదు. పురాతన సంస్కృత గ్రంథాల్లో ప్రస్తావనలున్నాయే తప్ప ఇదమిత్థంగా తెలీదు.  ఈ కొరత తీర్చడం కోసమే ఈ ఫౌండేషన్ 1994లో ఏర్పడింది. రూ. 60 లక్షల కార్పస్ ఫండ్‌ను సేకరించాం. ‘వృక్షాయుర్వేదం’ మొదలుకొని ఇప్పటికి 11 పురాతన సంస్కృత వ్యవసాయ సంబంధ గ్రంథాలను సేకరించాం. వీటిని ఆంగ్లంలోకి అనువదించి, విశ్లేషణలతో పాటు పుస్తకాలను ప్రచురించి ప్రపంచం ముందుంచాం. మన పూర్వీకుల సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని మన వ్యవసాయ విద్యార్థులకు, రైతులకు అందించాలన్నదే మా అంతిమ లక్ష్యం.
 
 మన పురాతన వ్యవసాయ విజ్ఞానంలో శాస్త్రీయత ఎంత?
సైన్సు పుట్టింది 14వ శతాబ్దంలో. ఈ విజ్ఞానం పది వేల ఏళ్ల నాటిది. ఇది శాస్త్రీయమైనది కాకుండాపోతుందా? వరి సాగు తూర్పు భారత్,  దక్షిణ చైనాలో సుమారు 10 వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. 1200 ఏళ్ల నాటి ‘కాష్యపీయ కృషి సూక్తి’ గ్రంథంలో 26 వరి వంగడాల సాగు విశేషాలున్నాయి.
 
 ‘వృక్షాయుర్వేదం’ గురించి..?
     సుమారు వెయ్యేళ్ల క్రితం సురాపాల మహర్షి రాసిన ‘వృక్షాయుర్వేదం’ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్రంథాలయంలో మాత్రమే ఉంది. మైక్రోఫిల్మ్ తెప్పించి ఆంగ్లంలోకి అనువదించి, శాస్త్రీయ విశ్లేషణ వ్యాసాలతో కలిపి ప్రచురించాం. ప్రచురించిన పది గ్రంథాల్లో 9 ఆహార/ఉద్యాన పంటల సాగు పద్ధతులకు సంబంధించినవి కాగా, మృగపక్షి శాస్త్రం ఒక్కటే పక్షులకు సంబంధించినది. 250 ఏళ్ల క్రితం పాలకాప్య రుషి రచించిన ‘హస్త్యాయుర్వేదం’ను ఇటీవలే సేకరించాం. ఇందులో ఏనుగులపై సమస్త సమాచారం ఉంది.
 
 నాటి వ్యవసాయ విజ్ఞానం నేటి రైతులకు ఉపయోగపడుతుందా?
 మన సంప్రదాయ విజ్ఞానం ఈ కాలపు వ్యవసాయానికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. భూసారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని 2500 ఏళ్ల క్రితమే పరాశర ముని చెప్పారు. సారవంతమైన భూమి వ్యవసాయానికి పట్టుగొమ్మ వంటిది. సేంద్రియ పదార్థం అటవీ భూమిలో పుష్కలంగా (3- 5% వరకు) ఉంటుంది. కానీ మన పొలాల్లో 1960 తర్వాత బాగా తగ్గి ఇప్పుడు 0.4 నుంచి 0.6 శాతానికి అడుగంటింది. రైతులు ఇప్పటికీ అనుసరించదగిన పురాతన వ్యవసాయ సాగు పద్ధతులను ప్రచారం చేయాలన్న దృష్టితో ఐసీఏఆర్‌తో కలసి  గోవాలో వచ్చే డిసెంబర్ 11,12 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాం.
 
 భూములను తిరిగి సారవంతం చేయడం ఎలా..?
పశువుల ఎరువు వాడకం పూర్తిగా మానేయడమే సమస్య. ప్రతి రైతుకూ తప్పనిసరిగా పశువులుండాలి. వేరే దారి లేదు. ఆవులు, గేదెలు, గొర్రెలు.. ఏవైనా సరే. పశువుల్లేకుండా పంట లేదు. భూమిలోని సేంద్రియ పదార్థం ద్వారానే మొక్కల వేళ్లు పోషకాలను గ్రహిస్తాయి. సేంద్రియ పదార్థం లేకపోతే రసాయనిక ఎరువులూ పనిచేయవు.  భూమిలో సేంద్రియ పదార్థం కనీసం 1.5 నుంచి 2% వరకు పెంచుకోవడమే ప్రభుత్వం, రైతుల తక్షణ కర్తవ్యం కావాలి. రైతుకు పశువుల్లేకుండా ఇది అసాధ్యం. పట్టణాలు, నగరాల చెత్తతో వర్మీకంపోస్టు తయారుచేసి ప్రభుత్వం రైతులకివ్వాలి.
 
 ‘వృక్షాయుర్వేదం’ నుంచి మన రైతులు నేర్చుకోదగినవేమిటి?
 ‘కునప జలం’ అనే సేంద్రియ ద్రవ ఎరువును మన పూర్వీకులు వెయ్యేళ్ల క్రితమే వాడారు. జంతువుల పేడ, మాంసం, చేపల మాంసం, మినుములు, నువ్వుల చెక్క, తేనె, నెయ్యితో కునప జలం తయారు చేసేవారు. నీటిలో ఉడకబెట్టి, తర్వాత మురగబెట్టేవారు. దీన్ని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేసి, పాదుల్లో పోసి ఫలసాయం పొందేవారు. ఇప్పటికీ కొందరు రైతులు ఇలా చేస్తున్నారు. కోళ్ల మాంసం వ్యర్థాలు, రొయ్యల తలల వంటి వ్యర్థాలను నీటిలో మూడు నెలలు మురగబెడితే.. దుర్వాసన పోయి చక్కని కునప జలం తయారవుతుంది. పావు కేజీ వేప ఆకులు, లీటరు ఆవు లేక బర్రె మూత్రం కలిపి మరిగించిన ద్రావణానికి పది రెట్లు నీరు కలిపి పంటలపై చల్లితే పురుగులు నశిస్తాయి. పంచ గవ్య గురించి గరుడ పురాణం, వరాహ పురాణం చెబుతున్నాయి. కొద్ది మంది రైతులు వీటిని అనుసరిస్తున్నా ఏ శాస్త్ర వేత్తా పట్టించుకోవడం లేదు. విదేశీ శాస్త్రవేత్తలు వీటిని అనుసరిస్తే.. మన శాస్త్రవేత్తలు అలవాటు ప్రకారం తీరికగా వారిని అనుసరిస్తారు. అందు వల్లే.. తమకు ఎటువంటి సాగు పద్ధతి నప్పుతుందో, ఏ సాంకేతికత అవసరమో నిర్ణయించు కోవాల్సింది అంతిమంగా రైతులే. ఏసీగదుల్లో కూర్చునే వాళ్లు మాత్రం కాదు! మొదట రైతులు అనుసరించిన సాగు పద్ధతులనే ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆనక తీరిగ్గా ఆమోదిస్తాయి.
 
 సంప్రదాయ విజ్ఞానం దన్నుతో రైతు నిలబడగలడా?
  నిక్షేపంగా! చిన్న రైతైనా జత ఎద్దుల్ని, ఆవును సమకూర్చుకోవాలి. కనీసం దూడలనైనా కొని పెంచుకోవాలి. భూమిని తిరిగి సారవంతం చేసుకోవడం మీద ఎంత ఎక్కువ దృష్టి పెడితే సాగులో అంత తొందరగా సుస్థిరత లభిస్తుంది. ప్రభుత్వం రసాయనిక ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం మానేసి ఇటువంటి వాటికి సబ్సిడీ ఇవ్వాలి. (ఆసియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్‌ను ఫోన్: 040-27755774 లేదా asianagrihistory94@gmail.com ద్వారా గానీ సంప్రదించవచ్చు)
- పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్
 ఫొటోలు: వెంకట్ పులిపాటి

 
 దిగుబడిని పెంచే కునప జలం!
కునప జలాన్ని ఇలా కూడా తయారు చేయొచ్చు:  మాంసం కిలో, మంచి నీరు 5 లీటర్లు, పావు కేజీ చొప్పున పచ్చిమినప్పప్పు పిండి, నువ్వులు, నల్లబెల్లం, లీటరు ఆవు పాలు, 50 గ్రాముల ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. తయారు చేసే విధానం: మాంసాన్ని  నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్లీ మరగించాలి. పొంగు వచ్చిన తరువాత మినపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ కాయాలి. పొంగు రాగానే పాత్రను దించి, చల్లార్చి మట్టికుండలో పోయాలి.
 
 అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసెన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంటలో పాతిపెట్టాలి. 11వ రోజున బయటకు తీసి, ద్రావణాన్ని వడపోయాలి. ఈ ద్రావణాన్ని వేరొక కుండలో పోసి, దానికి నెయ్యి లేక నూనె కలిపి, పాత్రపై మూకుడు ఉంచి, ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి, గట్టిగా తాడుతో కట్టి పది రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. తయారైన 3 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పైరు మీదైనా పిచికారీ చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారీ చేయొచ్చు. ఇది ప్రభావశీలమైన ఔషధం. దిగుబడి 20% పెంచుతుంది.
 - సామినేని హిమవంతరావు, రైతు
 (98665 63556)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement