అలంకారప్రాయమే.. | Ceremonial opening .. | Sakshi
Sakshi News home page

అలంకారప్రాయమే..

Published Tue, Jun 17 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

అలంకారప్రాయమే..

అలంకారప్రాయమే..

నిరుపయోగంగా భూసార పరీక్ష కేంద్రాల
రైతులకు అందుబాటులో లేని  అధికారులు
పరీక్షలపై కొరవడిన ప్రచారం
పాత పద్ధతుల్లోనే సాగు చేస్తున్న అన్నదాతలు

 
 
ఖమ్మం :అధునాతన వ్యవసాయ పద్ధతులు, హరిత విప్లవ ఫలితాలను అందించి రైతులను రాజుగా చూడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంతో పాటు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం  ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నెలకొల్పారు. ఇందులో ఒక ఏడీ స్థాయి అధికారి, నలుగురు ఇతర అధికారులు, సిబ్బంది ఉండాలి. అయితే ప్రస్తుతం ఖమ్మం మినహా ఏ కేంద్రంలోనూ సరిపడా ఉద్యోగులను నియమించడం లేదు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం ఖమ్మం వంటి పెద్ద కేంద్రంలో ఆరువేల మట్టి నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం కేంద్రాలలో రెండువేల చొప్పున సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ వివరాలును రైతులకు చేరవేయాలి. కానీ భద్రాచలంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని ఇంతవరకూ తెరిచిన పాపాన పోలేదు. ఇక ఖమ్మంలో ఇప్పటి వరకు కేవలం రెండువేల నమూనాలు, కొత్తగూడెం, సత్తుపల్లిలో వెయ్యి మేరకు మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు లెక్కలే చెపుతున్నాయి. జిల్లాలో మొత్తం సుమారు ఆరు లక్షల మంది రైతులు 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఇలా జాప్యం జరిగితే రానున్న 20 సంవత్సరాల్లో కూడా జిల్లాలో ఉన్న భూమి మొత్తాన్ని పరీక్షించలేరని స్పష్టం అవుతోంది. ఇక పరీక్షలు నిర్వహించిన భూముల్లోనూ ఆ వివరాలను ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారా రైతులకు చేరవేసి,  ఆ భూమికి అనుకూలంగా పంటలు సాగుచేసేలా సూచనలు ఇవ్వాలి. కాగా, ఇటీవల కొత్త విధానం పేరుతో  రైతుల సెల్‌ఫోన్ నంబర్లు సేకరించి మెసేజ్ ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు చెపుతున్నారు. అయితే ఆ మెసేజ్ వివరాలు అర్థం కాక, చేసేదేమీలే పాత పద్ధతిలోనే వ్యవసాయం చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూతూ మంత్రంగానే పరీక్షలు..

భూమిలో ఉన్న పోషక విలువలు ఏమిటి..? ఏ పోషకాలు అధికంగా ఉన్న నేలల్లో ఏ పంటలు వే యాలి. ఏవి సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుంది.. అనే వివరాలను భూసార పరీక్షల ద్వారా అధికారులు రైతులకు తెలియజేయాలి. దీనికి ముందు రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో అత్యధిక మంది రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తారనే విషయమే తెలియక పోవడం శోచనీయం. ఇక కొంతమేర అవగాహన ఉన్న రైతులు మట్టి నమూనాలు ఇచ్చినా.. పరీక్షలు చేసే నాథుడే లేడు. కొన్ని కేంద్రాల్లో అధికారులు ఉన్నా.. అవసరమైన పరికరాలు, రసాయనాలు లేకపోవడంతో తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదంతా తెలిసినా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

కొరవడిన ప్రచారం...

భూసారం తెలుసుకుని వ్యవసాయం చేస్తే లాభదాయకమనే ప్రచారం చేయడంలో జిల్లా వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెక్క, చౌడు, ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో కొన్నింటిలో భాస్వరం, పొటాష్ విలువలు, మరి కొన్నింటిలో నత్రజని అధికంగా ఉన్నాయి. అయితే ఏ నేలల్లో ఏ పంటలు వేయాలో అధికారులు రైతులకు వివరించాలి. ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ఆదర్శ రైతులను నియమించి వారికి భూసార పరీక్ష కిట్లను అందజేశారు. అయితే ఆయన మరణానంతరం రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రైతు చైతన్య సదస్సులు, పొలంబడి, ఇతర కార్యక్రమాలు నిర్వహించడంలో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారు.  దీంతో రైతులు చేసేదేమీ లేక పురాతన వ్యవసాయ పద్ధతులనే పాటిస్తూ.. దేవుడిపై భారం వేసి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి రైతు భూమిని పరీక్షించి ఏ  పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది.. తమ చేలల్లో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి.. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలి అనే విషయాలపై అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement