సబ్సిడీ వద్దన్న బీహార్ రైతులు: కలాం
అనంతపురం: రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరముందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించాలని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో ‘జన్మభూమి- మాఊరు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించారు.
దేశంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, సాగుబడిలో 16 శాతం మాత్రమే ఆదాయం వస్తోందని అబ్దుల్ కలాం తెలిపారు. సమస్యను గుర్తించి పరిష్కరించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్ అందిస్తే తమకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని బీహార్ రైతులు తనతో చెప్పారని వెల్లడించారు.
తక్కుత నీటితో అధిక దిగుబడి సాధించే విత్తనాలు తయారుచేయాలని సూచించారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు.