గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని మధ్యప్రదేశ్ నమోదు చేసింది. ఇది ఓటర్లలో గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. కానీ ఆ రాష్ట్ర సీఎం చౌహాన్ తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పక్కకు వెళ్లి అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? ఉత్పత్తి పెరిగినా రైతుకు గిట్టుబాటుధర లభించకపోతే హరిత విప్లవ కేంద్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తప్పవు. అధిక దిగుబడి నేపథ్యంలో రైతుల జీవితాల్లో దయనీయమైన వేదనకు ఇదే మూల కారణం.
గోడలపై రాతలు అనేది ప్రత్యేకించి ఎన్నికల ప్రచార సమయంలో భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా ఉనికిలోకి వచ్చే పదబంధం. మన నగరాలకేసి లేక వేగంగా పట్టణీకరణకు గురవుతున్న గ్రామీణప్రాంతం కేసి చూస్తే మీ కళ్లూ చెవులూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి. ప్రతిచోటా గోడలపై రాసి ఉన్న విషయం లేదా దాని ప్రతిధ్వనులు దేశంలో మారుతున్నదేమిటి, మారనిదేమిటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాయి. ఇక్కడ గోడలు అంటే పరిమిత స్థలం అని వాచ్యార్థం కాదు. గుజరాత్ హైవేల పొడవునా కనిపించే ఫ్యాక్టరీల వరుసను కూడా ఈ అర్థంలోనే చూడాల్సి ఉంటుంది. లేక కాంచీపురంలోని పాత పెరియార్ విగ్రహం మీద రాసిన అక్షరాలు కూడా కావచ్చు. లేదా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణంలోని మధ్యప్రదేశ్‌లో ఆహారధాన్యాలు, సోయాబీన్ రాశులను, కళకళలాడుతున్న మండీలను మనం గమనించవచ్చు. పంజాబ్‌లో పంటకోతల కాలంలో మీరు చూసే లెక్కలేనన్ని ట్రాక్టర్ల ట్రాలీలను కూడా గమనించవచ్చు. ఇప్పుడు వ్యవసాయ గిడ్డంగుల గోడలు హైవేల పొడవునా కనిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ నిజంగానే హరిత విప్లవం సాధించిన రాష్ట్రం. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని ఈ రాష్ట్రం నమోదు చేసింది. ప్రత్యేకించి గత అయిదేళ్లలో మధ్యప్రదేశ్ అసాధారణ స్థాయిలో 18 శాతం వ్యవసాయరంగ అభివృద్ధిని నమోదు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ రజోరా తెలిపారు. ఇక టీఎన్ నినాన్ తన ‘వీకెండ్ రుమినేషన్స్’ (వారాంతపు చింతన) కాలమ్‌లో రాసినట్లుగా, 2010 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ దిగుబడిలో 92 శాతం వృద్ధి నమోదైంది. చాలావరకు వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఉంటూ 77 శాతం గ్రామీణప్రాంతాలను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ జనాభాలో ప్రతి పదిమందికీ ఏడుగురు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఇది ఓటర్ల సంఖ్య పరంగా గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. గత 15 ఏళ్లుగా ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో దఫా పాలనను ఆశిస్తూ ఎంతో స్థిమితంగా కూర్చోవాలి.
కానీ కాస్త వేచి ఉండండి. 2018లో మధ్యప్రదేశ్ గోడలపై రాసి ఉన్న చిత్రణ ఇది కాదు. తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను చౌహాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీపై 9 శాతం ఆధిక్యతతో గెలుపు సాధించారన్నది పట్టించుకోవద్దు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మేం పర్యటిస్తున్నప్పుడు మేం సమాధానం కోసం ప్రయత్నించిన ప్రశ్నలు ఇవే. వ్యవసాయరంగంలో సాధించిన అభివృద్ధి పక్కకు వెళ్లి వ్యవసాయ రంగ అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? ప్రస్తుతం మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? మీరు కలుసుకుంటున్న అక్కడి రైతులు ఎందుకింత ఆగ్రహంతో ఉంటున్నారు?
ఒక దశాబ్ది కాలం వ్యవసాయ రంగ వికాసం ఇప్పుడు పెద్ద శిక్షలాగా ఎందుకు మారిపోయింది? కళ్లూ, చెవులూ, మనసు పెట్టుకుని ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రానికి వచ్చి చూడండి. భారతీయ వ్యవసాయంలో ఎక్కడ తప్పు జరుగుతోందో అది మీకు తెలియజేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సెహోర్‌కు వెళ్లండి. రాష్ట్ర రాజధాని భోపాల్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద మండీలకు నెలవుగా ఉంటోంది. అయితే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు.. రైతునా, వ్యాపారినా, మధ్యదళారినా లేక ప్రభుత్వాధికారినా అనే దానిమీదే సమాధానాలు ఆధారపడి ఉంటాయి. తన ట్రాక్టర్ ట్రాలీపై కూర్చొని ఉన్న రామేశ్వర్ చంద్రవంశీతో మేం మాట్లాడాం. సూర్యుడి ఎండలో ఈ రైతు ముఖం మాడిపోయినట్లు కనిపిస్తోంది.
‘గోధుమలకు గిట్టుబాటుధరలు తప్ప మాకేమీ అవసరం లేదు. వంద కేజీల గోధుమలకు రూ.3,000లు సోయాబీన్‌కి రూ. 4,000లు వచ్చేలా చేస్తే చాలు’ అని చెప్పాడా రైతు. ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఇది 30 శాతం కంటే ఎక్కువే. పంటమీద వచ్చే నష్టాన్ని తానెందుకు భరించాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించనీయండి, లేదా ఎగుమతి చేయనివ్వండి అని తేల్చేశాడు. ‘అంతకంటే మేమిక ఏదీ కోరుకోం. ఫిర్యాదులూ చేయం’ అని చెబుతూ తాను 15 ఎకరాలున్న సంపన్న రైతునే కానీ దారిద్య్రానికి దిగువన ఉంటున్న బీపీఎల్ రైతును కాదు అని రెట్టించి మరీ గుర్తు చేశాడాయన. చౌహాన్ ప్రభుత్వం దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గోధుమ, వరి పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీలు)ను పెంచారు. దీనికి అదనంగా బోనస్ కూడా ప్రకటించారు. సోయాబీన్ వంటి కనీస మద్దతు ధర పరిధిలో లేని పంటలకు క్వింటాలుకు రూ.500లు రైతు ఖాతాలోకి బోనస్‌గా వెళ్లింది.
తర్వాత తృణధాన్యాల వంతు. ప్రత్యేకించి పెసరపప్పు, ఉద్దిపప్పు. వీటి కనీస మద్దతు ధర వ్యాపారి చెల్లిస్తున్న ధర కంటే 60 నుంచి 90 శాతం ఎక్కువగా ఉంది. తృణధాన్యాల ధరలు పడిపోవడం వినియోగదారుడికి వరంగా మారితే రైతుకు పెను ముప్పుగా తయారవుతుంది. ఈ అంశంపై వ్యవసాయ ఆర్థికవేత్త, ఐసీఆర్‌ఆఇఆర్ సంస్కర్త అశోక్ గులాటిను ఈ విషయమై ప్రశ్నించండి చాలు.
మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర దాదాపు రెట్టింపు ధరను ప్రతిపాదిస్తున్నప్పటికీ రైతు ఖర్చులను అది చెల్లించలేకపోతోందని మీరు తెలుసుకుంటారు. కాబట్టి, రైతు ఎక్కువగా పండించే కొద్దీ ప్రభుత్వం ఎక్కువగా చెల్లిస్తుంటుంది. కానీ ఇద్దరూ కలిసి ఎక్కవ డబ్బును నష్టపోతుంటారు. మనం మూర్ఖంగా నష్టపోవడానికే చాలా కష్టపడి పని చేస్తున్నామా? గులాటి ఆయిన తోటి స్కాలర్లు రూపొందించిన ఐసీఆర్‌ఐఇఆర్ వర్కింగ్ పేపర్ 339 పేజీని చదవండి. మార్కెట్లతో సమన్వయం లేకపోయినట్లయితే, ఉత్పత్తిని మాత్రమే పెంచడం అనేది ప్రతీఘాతకంగా మారిపోతుందని ఈ నివేదిక మనకు తెలుపుతుంది.
దీనికి మంచి ఉదాహరణ కాయధాన్యాలు. సంవత్సరాల తరబడి భారతీయ మొత్తం కాయధాన్యాల ఉత్పత్తి కనీసం 3–4 మిలియన్ టన్నుల కొరతను నమోదు చేస్తింది. ప్రపంచం తగినన్ని కాయధాన్యాలను పెంచడానికి సతమతమవుతోంది కానీ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. రిటైల్ ధరలు వంద రూపాయలకు చేరుకోగానే మీడియాలో జనాగ్రహం కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. అప్పుడు ప్రభుత్వం నిద్రమేలుకుని కనీస మద్దతు ధరను పెంచుతుంది.
కాయధాన్యల ఉత్పత్తికి సాంకేతిక మిషన్‌ను నిర్మిస్తుంది, ఉత్పత్తిని పెంచుతుంది. దేశీయంగా కాయధాన్యాల డిమాండును 20 లక్షల టన్నుల మేరకు అధిగమించినట్లు ఐసీఆర్‌ఐఇఆర్ డేటా మనకు తెలుపుతుంది. కానీ పాత ఒడంబడికల వల్ల కాయధాన్యాల దిగుమతులు కొనసాగుతూనే ఉంటాయి. దీనిఫలితంగా భారత్‌కు ఏటా 22 లేక 23 మిలి యన్ టన్నుల కాయధాన్యాల ఉత్పత్తి సరిపోతుండగా, దేశంలో 30 మిలియన్ టన్నుల పంట చేరుతుంటుంది. అన్ని దిగుమతులూ జీరో పన్నుతో వస్తున్నందున వీటి ధరలు మన కనీస మద్దతు ధరలో సగమే ఉంటాయి. అంటే రైతు వ్యవసాయ ఖర్చులకు కూడా సమానం కావన్నమాట. కాయధాన్యాల వ్యవహారం మన కళ్లను తెరిపించకపోతే, మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి విషయంలో ఏం జరుగుతోందో పరి శీలించండి.
గత సంవత్సరం మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా మాండసూర్‌లో రైతుల ఆగ్రహం జాతీయ పతాక శీర్షికల్లో చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలతో మండుతున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ఉల్లిపాయల ఉత్పత్తి కేంద్రంగా ఉంటున్న మాండసూర్‌లో వాటి ధర కిలోకు రూపాయికంటే తక్కువకు పడిపోయింది. రైతుల ఆత్మహత్యలకు జడిసిన చౌహాన్ ప్రభుత్వం నిల్వ ఉన్న ఉల్లిపాయలన్నింటినీ కిలోకు 8 రూపాయల లెక్కన కొంటానని ప్రకటించింది. ఈ వార్త ప్రచారం కాగానే మాండసార్‌లో పది కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్ ట్రాలీలు ఉల్లిపంటతో బారులు తీరాయి. సుదూరంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూడా రైతులు తమ ఉల్లిపాయల పంటను ఇక్కడికి తీసుకొచ్చారు.
ఆ ధర వద్ద కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏంచేయాలో తోచలేదు. ప్రభుత్వానికి నిల్వ సౌకర్యాలు లేవు. వర్షాలు కుమ్మరించాయి. దీంతో భారీ నిల్వను వదిలించుకోవడానికి కిలో 2 రూపాయలకు అమ్ముతానని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఉన్మాదం కారణంగా మధ్యప్రదేశ్‌లో పన్ను చెల్లింపుదారులు రూ.785 కోట్లు నష్టపోయారు. ఇలా నష్టపోయే జాబితాలో ఈ ఏడు వంతు వెల్లుల్లికి దక్కింది. కిలో వెల్లుల్లి ఉత్పత్తికి రైతుకు రూ. 15–20లు ఖర్చు అవుతుండగా ధరలు మాత్రం కిలో రూ‘‘ 7కి పడిపోయాయి. మనది ఎంత విచిత్రమైన దేశం అంటే, మన రైతులు పండించిన వెల్లుల్లి ధరలు కుప్పగూలిపోతాయి. అదే సమయంలో చైనానుంచి భారీగా దిగుమతులు వస్తుం టాయి. ఎందుకంటే మన ప్రభుత్వ మెదడులో సగం వ్యవసాయం వైపు చూస్తుంటుంది. మిగతా సగం వినియోగదారు ధరలకేసి చూస్తుం టుంది. కానీ వీరు ఇద్దరూ ఎన్నడూ పరస్పరం చర్చించుకోరు.
ఎన్నికల్లో మునిగితేలుతున్న మధ్యప్రదేశ్ నుంచి నేర్పవలసిన పాఠం ఏమిటి? రైతులు తమ ఉత్పత్తిని పెంచేలా ఏర్పాట్లు చేసినందుకు మన రాజకీయ నేతలకు అప్పనంగా ఓట్లు పడవు. కాస్త మంచిగా ఆలోచింది వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించకపోతే, దశాబ్ది కాలపు అమోఘమైన వ్యవసాయాభివృద్ధి సాధించినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని చెప్పలేం. డబ్బు వెదజల్లడం పరిష్కారం కాదు. కనీస మధ్దతు ధర పెంపు అధిక ధరలకు గ్యారంటీ ఇవ్వదు. పైగా ఆహారధరలు పెరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. ఎందుకంటే అక్కడ వినియోగదారుడు ఉన్నాడు. పప్పు, ఉల్లిపాయ, టమేటో, బంగాళదుంపల ధరలు కాస్త పెరిగితే చాలు విమర్శలతో విరుచుకుపడే మీడియా ఉండనే ఉంది.
అందుకే ఈ రోజు నిజమైన, చురుకైన రాజకీయనేత వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించడంపైనే దృష్టిపెడతాడు. దీనిపైనే వనరులను వెచ్చిస్తాడు. అవేమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ చైన్లు, ప్రైవేట్ రంగం ద్వారా స్టోరేజ్, ప్యూచర్ మార్కెట్లను తెరవడం. ప్రభుత్వ వ్యతిరేకత లేక భావజాలం కంటే మధ్యప్రదేశ్ గోడలపై ఇవ్వాళ స్పష్టంగా వ్యక్తమవుతున్న సందేశం ఇదే మరి.
వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment