![Road accident occurred in Madhya Pradesh while returning from Maha Kumbh Mela](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ACCIDENT.jpg.webp?itok=3uQU8ulo)
మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మ్యాక్సీక్యాబ్‌ను అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన ట్రక్
ఏడుగురు హైదరాబాద్‌వాసుల మృతి
రోడ్డునపడ్డ ఏడు కుటుంబాలు
మరణంలోనూ వీడని స్నేహబంధం
ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్‌కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు.
వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
కత్నీ వైపు నుంచి జబల్‌పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్‌చారి జబల్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్‌లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
అమ్మా... నాన్నకు ఏమైంది?
ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్‌కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు.
వస్తానని చెప్పాడు.. కానీ..
నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు.
- రాజు భార్య మహేశ్వరి
మృతులు:
1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు.
2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు.
3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి.
4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్.
5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి.
7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్‌సుఖ్‌నగర్‌లోని వివేకానందనగర్ వాసి
Comments
Please login to add a commentAdd a comment