సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన ఇద్దరిని గ్రీన్ అవార్డులు -2013తో సత్కరించాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పర్యావరణ పరిరక్షణ వేదిక (గ్రేస్) సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డిని జీవన సాఫల్య పురస్కారానికి, రిటైర్డు అటవీ అధికారి డాక్టర్ తులసీరావును గ్రీన్ లీడర్ పురస్కారానికి ఎంపిక చేశాయి.
మూడు దశాబ్దాలపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోన్న ప్రొ. పురుషోత్తంరెడ్డిని 2013 సంవత్సరం జీవన సాఫల్య పురస్కారానికి, రెండు దశాబ్దాలుగా తూర్పు కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా స్ఫూర్తివంతంగా పనిచేస్తున్నందున డాక్టర్ తులసీరావును గ్రీన్ లీడర్ అవార్డు -2013కు ఎంపిక చేశామని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్‌పర్సన్ నీలా లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం జూబ్లీహాలులో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి అవార్డులు ప్రదానం చేస్తారని నీలా లక్ష్మారెడ్డి, గ్రేస్ చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి మీడియాకు తెలిపారు.